రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డా. రాజశేఖర్ చేసిన మొదటి హారర్ సినిమా ‘పట్ట పగలు’. 2014 లో తయారైన ఈ సినిమా ఇన్నాళ్లకు రిలీజైంది.
దెయ్యం సినిమాలన్నీ దాదాపు ఒకే విధంగా మొదలై..ఒకే విధంగా ముగిస్తూంటాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో దెయ్యాలు కవల పిల్లల్లా ఉంటాయి. వాటిని పెంచుకుని గారం చేస్తున్నట్లుగా బిహేవ్ చేస్తూంటాయి. కాబట్టి వాటి లక్షణాలు...వాటి ప్రవర్తన లో పెద్ద మార్పు ఉండదు. ఒక దెయ్యం పరిచయం అయ్యితే అన్ని దెయ్యాలు అర్దమైపోతాయి. ఆయనకీ ఈ విషయం తెలిసే ఉంటుంది. తెలియనట్లు నటిస్తూంటారు. దెయ్యాలను అప్పుడప్పుడూ పిలిచి తన సినిమాలో వాకింగ్ కు తీసుకెళ్తూంటారు. తాజాగా ఆయన మరోసారి దెయ్యంతో ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేసినట్లుగా ఓ సినిమాని వదిలారు. అది కొత్తగా ఉందా..కొత్త డ్రస్ వేసుకున్న పాత దెయ్యమేనా..చూడ్డానికి వచ్చిన జనాలను భయపెట్టిందా...తనే కన్ఫూజై భయపడిందా వంటి విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
undefined
కారు మెకానిక్ శంకర్(రాజశేఖర్)కి ఓ గారాల కూతురు విజ్జి(స్వాతి దీక్షిత్). కాలేజీ చదువుతున్న ఆమె బిహేవియర్ ఉన్నట్లుండి మారుతుంది. విచిత్రంగా ప్రవర్తిస్తూంటుంది. రాత్రిళ్లు నడవడం, గట్టిగా అరవడం వంటివి చేస్తూ..కాలనీ లో ఉన్న చుట్టూ ప్రక్కలవాళ్ళని భయానికి గురి చేస్తుంది. దాంతో శంకర్ కంగారుపడి డాక్టర్ ని సంప్రదిస్తారు. వాళ్లూ రకరకాల గా పరీక్షలు చేసి చివరకు చేతులు ఎత్తేసారు. దాంతో ఆమెని దెయ్యం పట్టిందని తెలుసుకుంటారు. ఈ లోగా ఆమెలో గాలి చేష్టలు మరీ పెరిగిపిపోతాయి. సైకో కిల్లర్ గురులా మాట్లాడుతూ... ఆ ఊళ్లో జరిగే హత్యలన్నింటికీ తానే కారణం అని చెబుతుంది. ఇంతకీ సైకో కిల్లర్ గురు ఎవరు..ఆ ఆత్మ..విజ్జినే ఎందుకు సెలక్ట్ చేసుకుంది.. చివరకు ఆ దెయ్యం విజ్జిని వదిలి వెళ్లిపోయిందా..శంకర్ అందుకోసం ఏం ప్రయత్నం చేసాడు?అనేది మిగతా కథ.
విశ్లేషణ
2014లో తయారైన ఈ సినిమా ఇన్నాళ్లకు బయిటకు వచ్చింది. ఈలోగా ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. దెయ్యాలు కూడా తమ రూపు రేఖలు మార్చుకున్నాయి. జనాలు కూడా దెయ్యం కథలకు బాగా అలవాటుపడిపోయారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమా అంటే కామెడీ అనుకునే స్దితికి చేరుకున్నారు. దాంతో ఈ దెయ్యం కథ కొంచెం కూడా ఇంపాక్ట్ చూపలేకపోయింది. వర్మ కూడా ఈ సినిమాని పూర్తి గా చూసి రిలీజ్ చేసారా అనే సందేహం వచ్చాలా ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా ఆయన ఇలాంటి సినిమా నేనే తీసానా అని భయపడుదురు. అలా ఉంటాయి సీన్స్. చాలా రొటీన్ గా వచ్చి వెళ్లిపోతూంయాయి. ఈ సినిమాలో ఉన్న ఏకైక కొత్త ఎలిమెంట్...సైకో దెయ్యం. రాజశేఖర్ ఇలాంటి సినిమాలో నటించాడా అనే ఆశ్చర్యమూ ఒక టైమ్ లో కలిగిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా రిజల్ట్ ఊహించే ఇన్నాళ్లూ ఈ చిత్రం డబ్బాళ్లో మగ్గిపోయిందని అనిపించటం ఆశ్చర్యమూ కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడటానికి కొత్తగా ఏమీ ఉండదు. వర్మ గత చిత్రం మరోసారి చూసినట్లు ఉంటుంది. దానికి తోడు సినిమాలో చాలా విషయాలు వర్మ కంక్లూజన్ ఇవ్వకుండానే వదిలేసారు. అయితే అవీ మనం పట్టించుకునేలా ఉండవు.
టెక్నికల్ గా ..
ఇలాంటి హారర్ ఫిల్మ్స్ కు కావాల్సిన సౌండ్ మిక్సింగ్ సరిగ్గా చేయలేదు. అలాగే నేపధ్య సంగీతమూ అంతంత మాత్రమే. సినిమా చాలా నాశిరకంగా ఉంటుంది. ఉన్నంతలో కెమెరా వర్క్ కాస్త బాగుంటుంది. అలాగే లైటింగ్ కూడా హైలెట్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకునేది ఏమీ లేదు. రాజశేఖర్ వంటి హీరో ఉన్నాడు కాబట్టి కాస్త ఆ మాత్రం లుక్ అయినా వచ్చింది. డబ్బింగ్ అయితే దారుణం. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో నలుగురైదుగురికి చెప్పింసారని అర్దమవుతుంది. ఎక్కడా వాయిస్ సింక్ అనేది లేదు. ఎంత దారుణం అంటే తనికెళ్ళ భరణి, బెనర్జీ, అనంత్, సన తదితర నటులది కూడా సొంత డబ్బింగ్ కాకపోవడంతో ఆ పాత్రలకి కనెక్ట్ కాలేని పరిస్దితి.
నటన నటుల్లో ...స్వాతి దీక్షిత్ చాలా బాగా చేసింది. దెయ్యం పట్టిన పాత్రలో భయపెట్టగలిగింది. బాగా అరిచింది. తండ్రి పాత్రలో రాజశేఖర్ రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే ఆయనకు డబ్బింగ్ వాయిస్ అసలు సెట్ కాలేదు. దాంతో చాలా చోట్ల కథకి డిస్కనెక్ట్ అవుతాం.
ఫైనల్ థాట్
దెయ్యం అనే కాన్సెప్టు కన్నా ఆర్జీవి ‘దెయ్యం’ సినిమా అనేదే జనాలను ఎక్కువ భయపెడుతున్నట్లుంది. థియోటర్స్ లో జనం లేరు.
Rating: 1.5/5
ఎవరెవరు..
సంస్థ: నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్;
నటీనటులు: రాజశేఖర్, స్వాతిదీక్షిత్, బెనర్జీ, ఆహుతి ప్రసాద్, అనిత చౌదరి, జీవా, తనికెళ్ల భరణి, సన, అనంత్ తదితరులు;
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల,
సంగీతం: డి.ఎస్.ఆర్;
ఎడిటింగ్: సత్య, అన్వర్;
నిర్మాత: నట్టికుమార్;
దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ;
రన్ టైమ్:1 గంట 38 నిమిషాలు
విడుదల: 16 ఏప్రిల్ 2021