వివాదం లేనిదే వర్మ సినిమా ముట్టరు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ..ఇంతోటి సినిమాకు అనవసరంగా వివాదం చేసామో అని నాలుకు కరుచుకునే పరిస్దితి ప్రతీసారి కల్పిస్తున్నారు. ఏదో సినిమాలో ఉందని పోస్టర్,ట్రైలర్స్ ద్వారా ఓ ఊహని జనం మైండ్ లో క్రియేట్ చేయటం ఆ తర్వాత సినిమాలో అలాంటిదేమీ లేకుండా చేసి తూచ్ అనటం ఆయనకు అలవాటే. అదే పద్దతిలో 'మర్డర్’ ట్రైలర్ విడుదలైన తరవాత ఈ సినిమాపై వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా తన కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా రూపొందించారని, దాని విడుదలను ఆపాలని అమృతా ప్రణయ్ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ‘మర్డర్’ విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ ‘మర్డర్’ నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమృత, ప్రణయ్, మారుతీరావు పేర్లను వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ క్రమంలో మీడియాలో రసవత్తరంగా ఈ ఎపిసోడ్స్ నడిచి ప్రీ పబ్లిసిటీ జరిగాక సినిమా ఈ రోజు రిలీజైంది. ఇంతకీ వర్మ ఈ సినిమాలో ఏం చూపించే ప్రయత్నం చేసారు. కథేంటి...ఆయన ఈ సినిమాలో చెప్పిందేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథేంటి
సొసైటీ లో పేరు,ప్రతిష్టలు,హోదా ఉన్న మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్)కు కూతురు నమ్రత(సాహితి) అంటే ప్రాణం. పిల్ల పుట్టాకే కలిసి వచ్చిందని నమ్మి,గారంగా పెంచుకుంటాడు. పెరిగి పెద్దైన నమ్రత ఓ రోజు ఇంట్లో ఓ బాంబ్ పేల్చుతుంది. కాలేజీలో ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రేమించానని ప్రకటన చేస్తుంది. అయితే.. ప్రవీణ్ తన ఆస్తి కోసం ఊరిలో తన పరువు మర్యాదల్ని దెబ్బ తీయడం కోసమే నమత్రని వలలో వేసుకున్నాడని తెలుసుకుంటాడు. దాంతో మాధవరావు వారి ప్రేమకు నో చెప్పేస్తాడు. దాంతో ఉన్నట్టుంది ఇంట్లో యుద్ద వాతావరణం ఏర్పడుతుంది. తండ్రి, కూతురు మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తాడు.
కానీ నమ్రత తన ప్రేమను వదులుకోలేక.. ఇంటి నుంచి పారిపోయి తన తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది . తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కూతురు చేసిన పనికి క్రుంగిపోయిన మాధవరావు.. సమాజంలో తన పరువు మర్యాదల్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఓ కఠిన నిర్ణయం తీసుకుని అమలు పరుస్తాడు. ఆ నిర్ణయం ఏమిటి అనేది మీరు ఊహించేదే. ప్రేమించిన వ్యక్తి ప్రవీణ్ మర్డర్. అయితే మర్డర్ అయితే ఈజీగా చెయ్యించగలడు. కానీ తదంతర పరిణామాలను ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. ఈ క్రమంలో నమ్రత తను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి ఏమైంది. చివరకు చక్కగా ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబం ఏమైంది. రామ్ గోపాల్ వర్మ ఏ విధమైన ముగింపు ఇచ్చారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కరోనా మహమ్మారిని ఎన్‌క్యాష్ చేసుకోవడంలో ఈ ప్రపంచం లోనే ముందున్నాడు. సినిమాలను వరస పెట్టి తీసి పడేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి ఏకబిగిన సినిమాలు చేస్తూ అన్ని రకాల ప్రయోగాలూ చేస్తూ ఆస్వాదిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ దగ్గర్నుంచి కరోనా వరకూ మధ్యలో ఇటీవల జరిగిన ముఖ్యమైన ఘటనల్ని తెరకెక్కిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలాంటిదే ‘దిశ ఎన్ కౌంటర్’ కాగా, మరొకటి ‘మర్డర్’. ఈ సినిమాలో పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? అనే ప్రశ్నలను మనపై వదులుతారు వర్మ. అలాగే అందరికీ తెలిసిన కథని చెప్పటం కష్టం.
ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో తెలిసిన విషయం చూడలేం. కానీ దర్శకుడు ఆనంద్ చంద్ర ఎమోషన్స్ ని హైలెట్ చేస్తూ తండ్రి పాయింటాఫ్ వ్యూలో కథ నడిపి మనని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పటిదా మన ఆలోచనలలో ఆమెపై సానుభూతి ఉన్నా..తండ్రి వైపు నుంచి చూపించే భావోద్వేగాలను మనని ఏకీభవించేలా చేసే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. ఇది ఓ పాయింటాఫ్ వ్యూ. ఇదే కరెక్ట్ అని చెప్పలేం. పరువు హత్యలను ..అలాగే చూపెడితే టీవిల్లో వచ్చే క్రైమ్ ఎపిసోడ్ అవుతుంది. అయితే ఆ పరువు హత్యలు సమయంలో ఆ కుటుంబ సబ్యులు పడే మానసిక వేదనను ఫోకస్ చేస్తూ చేయటమే హైలెట్ గా నిలిచింది. అయితే కథ ఎక్కువలాగ లేకపోవటంతో సెకండాఫ్ టీవీ సీరియల్ గా జీడిపాకంలా సాగుతుంది. మెలో డ్రామా విసిగిస్తుంది. రెండు గంటల సినిమాకు సరపడ స్క్రిప్టు అయితే ఈ సినిమాలో లేదు.
సూపర్ గా ఉన్నవి
తండ్రి ,కూతుళ్లుగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిల అద్భుతమైన నటన
తండ్రి, కూతుర్ల మధ్య నడిచే ఎమోషనల్ ఎపిసోడ్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్..
విసిగించినవి
ప్రెడిక్టుబుల్ కథ,కథనం
స్లో నేరేషన్
మితిమీరిన మెలోడ్రామా
మూవీ లెంగ్త్
క్లైమాక్స్
నటీనటులు
రాము లేటెస్ట్ మూవీ అయిన ‘కరోనావైరస్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ అయ్యంగార్, ‘మర్డర్’ లోనూ మరుపురాని నటన ప్రదర్శించారు. ప్రాణంగా పెంచుకున్న కూతురు వెళ్ళిపోతే ఆ తండ్రి పడే వ్యధ, ఆవేదనతో పాటు ఆవేశంలో తీసుకునే ఓ తొందరపాటు నిర్ణయం వంటివి అద్బుతంగా తన మొహంలో పలికించారు. నమ్రతగా వేసిన అమ్మాయి స్క్రీన్ కు కొత్త అయినా క్యాజువల్ గా చేసుకుంటూ పోయింది. ఎక్కడా అసహజం అనిపించలేదు. అయితే ప్రవీణ్ గా వేసిన కుర్రాడుకు ఎక్కువ సీన్స్ లేవు. మిగతావాళ్లు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నకల్ గా...
ఆవేశంలో తీసుకునే నిర్ణయం వలన కుటుంబం ఎంత చిందర వందర అవుతుందనేది తెరపై చక్కగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు దర్శకుడు. అయితే ఆ దర్సకుడు పేరు వేయికపోతే వర్మ తీసారని అనిపిస్తుంది. అంతలా ఆయన మేకింగ్ స్టైల్ ని అనుకరించారు. లేదా వర్మ షూట్ చేసి ఈ దర్శకుడు పేరు వేసారేమో. ఇక కెమెరా వర్క్ సైతం చక్కగా ఉంది. చీకటి వెలుగులను కెమెరా కన్ను బాగా పట్టుకుంది. ఇలాంటి సినిమాకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరింది. ఎడిటింగ్ సోసోగా ఉంది.
ఫైనల్ థాట్
ఇది తండ్రి పాయింటాఫ్ లో చెప్పిన కథ. ఇదే కథను ఈ సారి కూతురు పాయింటాఫ్ వ్యూలో ఎవరైనా ట్రై చేయచ్చు..లేదా అకీరా కురసోవా 'రోషోమన్ ' శైలిలో ఒకే సంఘటన అనేక పాయింటాఫ్ వ్యూలు చూపెడుతూ ట్రై చేయచ్చు.
Rating:2.5
ఎవరెవరు..
నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్ తదితరులు
కెమెరా: జగదీష్ చీకటి
సంగీతం: డి ఎస్ ఆర్
ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్.ఆర్
నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్ చంద్ర
విడుదల: 24-12-2020