ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ రివ్యూ

By Surya Prakash  |  First Published Jan 29, 2021, 3:35 PM IST


తెలుగు టీవీ షోల రెగ్యులర్  చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేని పేరు  ప్రదీప్‌ మాచినేని. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ పదునైన పంచ్ లతో, ఫ్యామిలీ మొత్తాన్ని అలరించేలా షోలు చేయటం అతని ప్రత్యేకత.   తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా వెలిగిపోతున్న ప్రదీప్ అడపాదడపా సినిమాల్లోనూ కనిపించాడు. అయితే ఈ సారి హీరోగా ఫుల్ లెంగ్త్ సినిమా చేసారు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే విభిన్నమైన టైటిల్ తో క్యూరియాసిటీ కలగచేస్తూ.. ‘నీలీ నీలీ ఆకాశం’  అనే సూపర్ హిట్టైన పాటతో థియోటర్స్ లో దిగాడు. ఎన్ని చెప్పుకున్న ప్రదీప్ లాంటి హీరోకు కథ బాగుంటేనే సినిమా నిలబడుతుంది. ఆ విషయం అతనికీ తెలుసు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుంది..ప్రదీప్ ని ఫుల్ లెంగ్త్ హీరోగా చూడగలమా, పునర్జన్మ కాన్సెప్టు తో వచ్చిన ప్రాణం సినిమాతో ఈ సినిమాకు పోలిక తెస్తూ జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


యస్..ఇది పునర్జన్మల కథే. 1947 లలో అరకు ప్రాంతంలో అటవీ తెగల్లో నివసించే ఓ జంట (ప్రదీప్,అమృత). వారిద్దరు తెగ ప్రేమించుకుంటారు. నీలి నీలి ఆకాసం వంటి హిట్ సాంగ్స్ పాడుకుంటారు. అయితే వారి ప్రేమ కథ అక్కర్లేని అపార్థాలకు లైనే ,ప్రాణాలు తీసేస్తుంది. మళ్లీ ఇంత కాలం తర్వాత వాళ్లిద్దరూ తిరిగి జన్మిస్తారు..అఫ్ కోర్స్ మనుష్యులుగానే. వాళ్లిద్దరూ అర్జున్(ప్రదీప్), అక్షర(అమృత అయ్యర్)గా పెరిగి పెద్దవుతారు. అంతేకాదు వీళ్లిద్దరూ నువ్వే కావాలి టైప్ లవ్ యవ్వారం. ప్రక్క ప్రక్క ఇళ్లల్లో ఉంటూ పరస్పరం ఒకళ్ళమీద మండిపడుతూ..  కాలేజీలోనూ యుద్దాలు చేసుకుంటూంటారు. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలవాలని రాసిపెట్టి ఉండంటతో...  ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్తారు. అక్కడ గత జన్మలో వీళ్లద్దరు ప్రేమించుకున్న దేవాలయం ఉంటుంది. అక్కడ ఓ దేవత విగ్రహం ముందు జరిగిన ఓ చిత్రమైన సంఘటన వీళ్ళ జీవితాలను మార్చేస్తుంది.అదేమిటంటే... అక్కడ వారి ఆత్మలు ఒకరి బాడీ నుంచి ఇంకొకరి బాడీలోకి మారిపోతాయి. ఇక అక్కడి నుంచి వారు ఒకరితో ఒకరు ఎలా ఆడుకున్నారు? ఇద్దరూ ఎదుర్కున్న సమస్యలేమిటి? చివరికి వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ పుట్టి మళ్ళీ ఎవరి శరీరంలోకి వాళ్లు వచ్చారా? లేదా? అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే...
 మూడు గంటల్లో  కథ రాయటం ఎలా అని కూర్చిని అల్లేసినట్లు ఉందీ డ్రామా.  అంతేకానీ ఎక్కడా మొదలు ,చివరా..ఓ కాన్సెప్టు ఉన్నట్లు కనపడదు. ప్లాష్ బ్యాక్ కేవలం పాట కోసమే పెట్టుకున్నట్లు ఉంటుంది. ఓ గొప్ప అసాధారణ ప్రేమ కథ చెప్తున్నట్లు బిల్డప్ ఇచ్చి అతి సాధారణ ...అతి గా అనిపించే అతని కథను ప్లాష్ బ్యాక్ గా చెప్తారు. ఆ ప్లాష్ బ్యాక్ ..మొత్తం సినిమాకు కీ అనే విషయం గుర్తు పెట్టుకుని చేసి ఉంటే...ఖచ్చితంగా వేరే విధంగా ఉండేది. అలాగే ఏ ఎమోషన్ ని బిల్డ్ చేయాలనుకున్నారో క్లారిటీ లేదు. ఇలాంటి కథలకు రైటింగ్ డిపార్మెంట్ రైట్ హ్యాండ్ లా నిలబడాలి. కానీ ఈ సారి అది జరగలేదు. పునర్జన్మలు, ఆత్మలు మార్పిడి రెండూ ఒకే కథల్లో ఒకదాన్ని తీసుకుంటే ఫెరఫెక్ట్ లైన్ వచ్చేది. అలాగే చాలా సినిమాల్లో సీన్స్ తీసుకొచ్చి ఈ సినిమాలో కలిపారు. అంతేకాదు అల్లరి నరేష్ సినిమాల్లో లాగ స్పూఫ్ లు సంత ఒకటి. అలా సినిమా మొత్తం కలగూర గంపగా మారింది. వినటానికి లైన్ గా ఈ సినిమా చాలా ఎగ్జైట్మెంట్ తో అనిపించవచ్చు కానీ ప్రదీప్ కు హీరోగా లాంచింగ్ కు మాత్రం సరైన వేదిక కాదు. 

Latest Videos

undefined


బాగున్నవి:
ఇంట్రవెల్ ట్విస్ట్
హీరోయిన్ అమృతా అయ్యిర్ ఫెరఫార్మెన్స్
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బాగోలేనివి:
సాగ తీసినట్లున్న కథ విస్తరణ
ఊహకు అందేటట్లు రాసిన స్క్రీన్ ప్లే
దర్శకత్వం,కథ చెప్పిన విధానం
 
టెక్నికల్ గా...

సినిమాకు ఇంత ఈ స్దాయి క్రేజ్ తీసుకురావడంలో ప్రధాన కారణమైన నీలి నీలి ఆకాశం సాంగ్ పెద్ద ఎస్సెట్. అయితే మిగతా పాటలు సోసోగానే ఉన్నాయి.  రీరికార్డింగ్ మాత్రం బాగుంది.  దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ సైతం పెద్ద సినిమాకు చేసినట్లు క్వాలిటీగా ఉంది.  ఈ సినిమాకు ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ సైతం అన్యాయం చేసారు. చాలా ల్యాగ్ లతో ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో మరీ విసిగిస్తుంది. డైరక్టర్  మున్నా స్వయంగా రాసుకున్న డైలాగులు అక్కడక్కడా పేలాయి.  ఎస్వి బాబు ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్లేదు.  

ఫైనల్ థాట్ :

 ‘3 గంటల్లో బోర్ కొట్టడం ఎలా’ అనేది ప్రాక్టికల్ గా చూపించినట్లుంది.

Rating : 2/5 

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..
నటీనటులు : ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌, శుభలేఖ సుధాకర్‌, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్‌ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ :  ఎస్వీ ప్రొడక్షన్‌
నిర్మాత :  ఎస్వీ బాబు
దర్శకత్వం : మున్నా ధూళిపూడి
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :  దాశరథి శివేంద్ర
విడుదల తేది : జనవరి 29, 2021

click me!