
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పవన్ జ్వరంతో బాధపడుతూ కూడా పొలిటికల్ మీటింగ్స్ లో పాల్గొనడం, బ్రో చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పార్లల్ గా చేశారు. శుక్రవారం రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఎప్పటిలాగే పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఈ సభకు తరలి వచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గత 20 రోజులుగా పవన్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ యాత్రలో పవన్ తరచుగా టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ మధ్యన మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ వీళ్లంతా తనకంటే పెద్ద హీరోలని.. పాన్ ఇండియా స్థాయిలో ఎదిగారని ప్రశంసించారు.
నిన్నటి సభలో పవన్.. ప్రభాస్ అభిమానుల గురించి మాట్లాడి వారి మనసు గెలుచుకున్నారు. భీమవరంలో ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువగా ఉంటారు. అలాగే మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. నా ఒక్కరి అంభిమానులే నాకు సరిపోరు. మొత్తం జనం నాకు కావాలి.
2015లో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున జరిగిన పోస్టర్ గొడవ గురించి పవన్ స్పందించారు. ఆ సంఘటన భీమవరంలో పవన్, ప్రభాస్ అభిమానుల మధ్య ఊహించని చిచ్చు రేపింది. దీని గురించి పవన్ మాట్లాడుతూ.. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. ఎవరైనా పొరపాటున పోస్టర్ చించేసినా క్షమించి అక్కడితో వదిలేయాలి. ఇంత పెద్ద గొడవ చేయకూడదు అని పవన్ అన్నారు. చిన్న సంఘటనల్ని పెద్దవి చేసుకోవద్దు.. రెండు చేతులెత్తి వేడుకుంటున్నా అని పవన్ అన్నారు. ఈ మాటలు ప్రభాస్ అభిమానుల హృదయాల్ని గెలుచుకునేలా ఉన్నాయని అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.