
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పావులు కదుపుతున్నారు. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇక బలమైన వైసీపీ పార్టీని ఎదుర్కోవాలంటే పొత్తులే మార్గమని నమ్ముతున్నాడు. వైసీపీని ఓడించడం కోసం త్యాగానికైనా సిద్ధం అంటున్నాడు. అదే సమయంలో గతంలో నేను రెండుసార్లు తగ్గాను, ఈసారి మీరు తగ్గండి అంటున్నాడు. అంటే టీడీపీతో పొత్తుకు సిద్ధమే, కానీ సీఎం అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ జనసేన మిత్రపక్షంగా బీజేపీ ఉంది. టీడీపీ లేకుండా జనసేనతో కలిసి పోటీ చేస్తాం, మా ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణే అని ప్రకటించారు .
అయితే ఒకటి రెండు శాతం ఓటు బ్యాంకింగ్ కలిగిన బీజేపీతో కలిసి పోటీ చేయడం వలన జనసేనకు ఒరిగేదీ ఏమీ లేదని పవన్ కి బాగా తెలుసు. అందుకే టీడీపీతో కచ్చితంగా కలవాలని డిసైడ్ అయ్యారు. కానీ 40 ఏళ్ల చరిత్ర కలిగి, జనసేన కంటే అధిక ఓటింగ్ శాతం కలిగిన టీడీపీ పవన్ ని సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తాయా? అనే సందేహం అందరిలో ఉంది. పొత్తు పెట్టుకున్నంత మాత్రానా పవన్ సీఎం అంటూ జనసేన జెండా మోసేంత సహనం టీడీపీ శ్రేణులకు ఉంటుందా? అది జరగని పనే. పవన్ ఏదో ఇలా బెట్టు ప్రదర్శించినా ఫైనల్ గా.. బాబు సీఎం అభ్యర్థిగా టీడీపీ, జనసేన ఎన్నికలకు వెళ్లడం ఖాయం అంటున్నారు.
ఆ విషయాలు అంటుంచితే పవన్ కళ్యాణ్ పాదయాత్రకు సమానమైన యాత్ర చేయనున్నట్లు అన్నయ్య నాగబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేశాడు. ఈ క్రమంలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాదయాత్రకు సమానమైన యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. అంటే పవన్ ఏదో ఓ రూపంలో ఏపీ మొత్తం పర్యటించనున్నాడన్న మాట. పాద యాత్ర అంటే చాలా సమయం పడుతుంది. ఇక వాహనంలో యాత్ర చేసినా కొన్ని నెలలు సమయం కేటాయించాల్సిందే.
ఈ యాత్ర కారణంగా పవన్ కళ్యాణ్ తో చిత్రాలు కమిటైన నిర్మాతలకు గట్టిదెబ్బ తగలడం ఖాయం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు (Hari hara veeramallu) భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంది. ఆ సినిమా చిత్రీకరణ నత్త నడక సాగుతుండగా... భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. అలాగే వినోదయ సిత్తం రిమేక్ నిర్మాతలు, సురేంధర్ రెడ్డితో ప్రకటించిన మూవీ నిర్మాతలు పవన్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పవన్ రాజకీయ యాత్ర వీరందరికీ నష్టం చేకూర్చుతుంది.
అయితే పవన్ వెంటనే ఈ యాత్ర చేయకపోవచ్చు. కనీసం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసే అవకాశం కలదు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ మూవీ బడ్జెట్ పరిధులు దాటిపోతున్నట్లు సమాచారం. ఒకవేళ యాత్ర తర్వాతే హరిహర వీరమల్లు అంటే, ఆ ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఏదేమైనా పవన్ తో కమిటైన నిర్మాతల ఫ్యూచర్ ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంది.