మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ వేడుకకు హాజరు కాబోతుండటం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన సమాధానాలతో దేశం గర్వించేలా చేశారు. అలాగే ‘నాటు నాటు’ సాంగ్ కు లైవ్ డాన్స్ పెర్పామెన్స్ పైనా క్లారిటీ ఇచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’టీమ్ ఇప్పటికే ‘ఆస్కార్స్’ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫ్యాన్స్ నూ మీట్ అవుతూ అమెరికాలో సందడి చేస్తున్నారు. RRR ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇండియాకు ఎలాగైనా ఆస్కార్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ET హాలీవుడ్ టాక్ షోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తొలిసారి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ ఈవెంట్ రెడ్ కార్పెట్ పై నడవబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వేడుకలో రెడ్ కార్పెట్‌పై RRR నటులుగా తాము నడవబోమని చెప్పారు. తను భారతీయ చిత్ర పరిశ్రమ నుండి నటుడిగా కాకుండా.. ఆ కార్పెట్‌పై భారతీయుడిగా, తన హృదయంలో దేశ గర్వంతో, తన జాతిని గుండెల్లో పెట్టుకుని నడుస్తానని ఎన్టీఆర్ ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. దేశ భక్తిని చాటుతూ చెప్పే ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
మరోవైపు ఆస్కార్స్ వేదికపై Naatu Naatu సాంగ్ కు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాలభైరవ, రాహుల్ పిప్లిగంజ్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఈ క్రమంలో తారక్, చరణ్ కూడా ప్రపంచ సినీ వేదికపై డాన్స్ చేయబోతున్నారని అంతా ఆశిస్తుండగా.. తాజాగా ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ‘రిహార్సల్ కు అంతగా టైం లేకపోవడంతో.. నేను, Ram Charan లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వేదికపై పాడబోతున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదికాస్తా ఫ్యాన్స్ కు నిరాశే అని చెప్పాలి. ఏదేమైనా సినిమా వరల్డ్ ఎదురుచూస్తున్నవేదికలో తెలుగు హీరోలు సందడి చేయబోతుండటం పట్ల అంతా సంతోషిస్తున్నారు.
ఇక ఆస్కార్స్ 95వ అకాడమీ అవార్డ్స్ కు ‘నాటు నాటు’సాంగ్ ఒరిజినల్ విభాగంలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇండియాకు ఆస్కార్ ను సాధించిపెడుతుందని దేశప్రజలు ఆశిస్తున్నారు. మార్చి 12 ఆస్కార్స్ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉద్యమవీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది.