
హీరో నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ 'స్పై' సినిమాతో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు అంత కాదు..ఇంతకాదు అన్నట్లు పబ్లిసిటీ జరిగింది. ట్రైలర్ లో సుభాష్ చంద్రబోస్ గురించిన విజువల్స్ ఉండటంతో అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే రిలీజ్ డేట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసారు. మొదటిది 29న బక్రీద్ నేషనల్ హాలిడే. ఆపై మూడు రోజుల లాంగ్ వీకెండ్ దక్కుతుంది. చివరి శనివారం కావడంతో బ్యాంకుల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవులు ఉంటాయి. అలాగే నార్త్ లోనూ ఈ సినిమాని మంచి పబ్లిసిటితో రిలీజ్ చేసారు. తెలుగులో వర్కవుట్ కాలేదు..అని తేలిపోయింది. మరి నార్త్ లో పరిస్దితి ఏమిటో చూద్దాం. నేతాజీ ఎలిమెంట్ ఏ మేరకు కలిసొచ్చిందో గమనిస్తే..
గత ఏడాది రిలీజై హిట్టైన నిఖిల్ సినిమా ‘కార్తికేయ-2’సెన్సేషన్ ఈ సినిమా కు బాగా ఉపయోగపడింది. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రేపిన సంచలనమే చర్చనీయాంశం అయింది.నార్త్ లో నామమాత్రంగా రిలీజైన ‘కార్తికేయ-2’.. అంతకంతకూ థియేటర్లు, షోలు, వసూళ్లు పెంచుకుని పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా రూ.120 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ద్వారక నేపథ్యం, శ్రీకృష్ణుడి యాంగిల్ అక్కడి ప్రేక్షకులకు పట్టేసాయి. సినిమాకు భారీ సక్సెస్ ని అందించాయి. నిఖిల్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేశాయి.
దాంతో ఖచ్చితంగా ‘స్పై’కూడా అలాంటి సినిమానే అవుతుందని అందరూ నమ్మారు. దేశభక్తి యాంగిల్ ఉండటం.. సుభాష్ చంద్రబోస్ పాత్ర సినిమా కథలో కీలకం అవడంతో ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో మ్యాజిక్ చేస్తుందని అనుకున్నారు. అన్నిటికన్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రో ఐడియాలజీతో కొన్ని సీన్స్ కలిసి వచ్చి ఈ చిత్రాన్ని నార్త్ లో పెద్ద హిట్ చేస్తారని ట్రేడ్ లోనూ లెక్కలేసారు. అయితే ఆ లెక్కలు అన్నీ తప్పాయి. రానా గెస్ట్ రోల్ కూడా కలిసి రాలేదు.
ఇక ఈ సినిమాను రూ.20 కోట్ల బడ్జెట్ తెరకెక్కించారు. అలాగే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా బిజినెస్ ను [థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రెండూ] చేసింది. ఇది సినిమా విడుదలకు ముందే నిర్మాతను సూపర్ ప్రాఫిట్ జోన్‌లో ఉంచింది. అంతే కాకుండా నిఖిల్ సినిమాకి ఇదే అత్యధిక ప్రీ బిజినెస్. ఆంధ్రాలో రూ. 6 కోట్లు, నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్ రూ.2 కోట్లు, ఓవర్సీస్లో రూ.1.75కోట్లు, ఇతర రాష్ట్రాలు రూ.70 లక్షలకు విక్రయించారని పలు లెక్కలు కూడా వైరల్ అయ్యాయి.
'స్పై' సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.22 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే దాదాపు రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలనే సినీ విశ్లేషకులు అంచనా వేసారు. 'స్పై'ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం, నిఖిల్ సినిమాలకు నార్త్ లో డిమాండ్ ఏర్పడటం, స్పై మీద అంచనాలు ఉండటంతో ఈ కలెక్షన్స్ ఈజీగానే వస్తాయని ట్రేడ్ లో భావించారు. అయితే అవన్నీ కంటెంట్ సరిగ్గా లేకపోవటంతో తేలిపోయాయి. అక్కడ మినిమం వసూళ్లు కూడా రాలేదని తెలుస్తోంది.హిందిలో ఈ సినిమాకు మినిమం రెస్పాన్స్ కూడా రాలేదని సమాచారం.