అమ్మవారు ఓ రోజు హఠాత్తుగా మనముందు చెప్పాపెట్టకుండా ప్రత్యక్షమైతే ఏం చేస్తాం. ఆమె రాక పట్ల మనం ఎలాంటి స్టాండ్ తీసుకుంటాం. ఆమెను అసలు నమ్ముతామా..లేక మహిమలు చూపేదాకా ఆగుతామా..చూసాక అసలు ఆగగలమా..అది సరే భూమ్మీదకు వచ్చిన అమ్మవారు ఏం చేస్తుంది..తింటుందా..తాగుతుందా...మనతో కలిసి వీధులు చుడుతుందా..బస్ ఎక్కుతుందా..మన ఇళ్లలో ఉంటుందా..అబ్బో...ఎన్నెన్నో ప్రశ్నలు. అయితే ఇప్పటిదాకా వచ్చిన అమ్మవారు సినిమాలు అన్నీ ఆమె మహిమలను సీరియస్ గా చూపెట్టి..వేపమండలు,సాంబ్రాణీ ధూపాలతో మైమరిపించాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అమ్మోరు తల్లి ఏం చేసింది. అసలు ఏం పని మీద ఈ భూమి మీదకు వచ్చింది..వచ్చిన ఆమెకు ఈ భూమి మీద సేప్టీ ఉందా వంటి విషయాలను వ్యంగ్యాత్మగా చూపిస్తూ ఈ సినిమా రూపొందింది. తమిళ డబ్బింగ్ గా వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మనని ఆకట్టుకుంటుంది. కథేంటి...కాషాయ కబుర్లేంటో రివ్యూలో చూద్దాం.
కథేంటి
కాశిబుగ్గ ఆకులపల్లి అనే గ్రామస్దుడైన ఏంజిల్స్ రామస్వామి(ఆర్జె బాలాజి) లోకల్ ఛానల్ 'ఉత్తరాంధ్ర' టీవీ రిపోర్టర్ . ఆ ఛానెల్ వ్యూస్,ఆదాయం లేక అల్లాడుతూంటుంది. ఆ ఛానెల్ కు పేరు తేవాలని కాదు కానీ ఓ పెద్ద స్కూప్ బయిటపెట్టి పేరు తెచ్చుకుని వేరే ఛానెల్ కు జంప్ అయ్యిపోవాలనేది మనోడి జీవితాశయం. ఈ క్రమంలో అతని కంట ఓ పెద్ద భూ కబ్జా కుంభకోణం బయిటపడుతుంది. తన ఊరు చుట్టప్రక్కల ఉండే 11 వేల ఎకరాలను భాగవతి బాబా (అజయ్ ఘోష్) దేవుడి పేరు చెప్పి కబ్జా చేసేస్తాడు. దాంతో ఆ నకిలీబాబా బండారం బయిటపెట్టి క్లిక్ అయ్యిపోదమని విశ్వప్రయత్నం చేస్తూంటాడు. కానీ ఎవరూ నమ్మరు.
undefined
ఇదిలా ఉంటే రామస్వామి తల్లి బంగారం (ఊర్వశి) అతనికి వయస్సు మీరిపోతోందని పెళ్లి సంబంధాలు చూస్తుంటుంది. మనవాడు గురించి నానా రకలుగా బిల్డప్ ఇస్తూంటుంది.అయితే రామస్వామి అవన్ని అబద్దాలే అని చెప్పేసి చెడకొడుతూంటాడు. దానికి తోడు ఆమెకు చాలా కాలంగా తిరుపతి వెళ్లాలని కోరిక. దాని అది ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోతోంది. దాంతో తమ గృహ దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుని మెక్కు తీర్చుకుంటే కష్టాలు తీరుతాయని భావించి అక్కడికి ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తుంది. అక్కడ రామస్వామికి అమ్మవారు(నయనతార) దర్శనమివ్వటం కథ మలుపు తిరుగుతుంది.
రామస్వామి మొదట ఆమెను నమ్మడు కానీ కాలక్రమేణా నమ్మే పరిస్దితులు వస్తాయి. తన పంచావనాన్ని కాపాడుకోవడానికే వచ్చానని చెబుతుంది.అక్కడ నుంచి అమ్మవారు, రామస్వామి కలిసి జర్నీ చేస్తూంటారు. ఈ క్రమంలో భగవతిబాబా (అజయ్‌ఘోష్) ఆట ఎలా కట్టించారు. పంచావనాన్ని కాపాడడం కోసం అమ్మవారు రామస్వామితో కలిసి ఎలా పోరాడాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
అమ్మవారు,అయ్యవార్లు(దేవుళ్లు) భూమి మీదకు రావటం అనే కథ చుట్టూ సినిమాలు మనకు కొత్తకాదు..ఆమె మహిమలు మనకు వింతాకాదు. గతంలో మా ఊళ్ళో మహాశివుడు, రీసెంట్ గా గోపాల గోపాల మధ్యలో అక్కినేని బుద్దిమంతుడు, రాజేంద్ర ప్రసాద్ కన్నయ్య కిట్టయ్యలు అంటూ బోలెడు వచ్చాయి.అయితే ఈ మధ్యకాలంలో ఆ ట్రెండ్ తగ్గింది. నిజానికి గ్రాఫిక్స్ కాలంలో భక్తి సినిమాలు బాపురే అనిపించేలా తీయచ్చు కానీ ..మరీ పాత చింతకాయ పచ్చడి సినిమా అంటారేమో అని ప్రక్కన పెట్టేస్తున్నారు నిర్మాతలు. అయితే ఈ కాలంలోనూ అలాంటి సబ్జెక్ట్ ను తీసుకుని హిట్ కొడదామని బయిలుదేరారు తమిళ దర్శకుడు ఆర్.జె. బాలాజీ. కాకపోతే కొద్దిగా తేడా. నేరేషన్ మార్చేసాడు. వ్యంగ్యం జోడించి,విట్టినీ కలిపి..కళ్లెదుట నిలిపాడు. అమ్మవారిని అడ్డం పెట్టి సెటైరికల్ గా సొసైటీలో జరుగుతున్న చాలా అంశాలను బాగానే చెప్పారు. అక్కడిదాకా హై సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కథనం ఇంకాస్త డిఫరెంట్ గా రాసుకోవాల్సింది. ట్రీట్మెంట్ లో మరిన్ని మలుపులు కలపాల్సింది. అలా చేయకపోవటంతో..కథలో చాలా సీన్స్ ప్రెడిక్టబుల్ గా తయరయ్యాయి. చూసేవాడికి పెద్ద కిక్ ఇవ్వలేకపోయాయి. అప్పటికి క్లైమాక్స్ లో దేవుడే వచ్చి డౌట్స్ తీర్చటం వంటి ఐడియాలు వర్కవుట్ అయ్యినా, అవి ఎంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోయారు. దాంతో అనుకున్న పాయింట్ ని క్లైమాక్స్ లో అయినా ఇంకాస్త స్ట్రాంగ్ గా చెప్పి ఉంటే బాగుండేది అన్న ఫీల్ వచ్చేసింది.ప్రస్తుత పరిస్థితుల మీద వేసిన వ్యగ్యాస్త్రాలు మనకు బాగానే కనెక్ట్ అయినా అక్కడికి అక్కడే అన్నట్లు అయ్యిపోయి.. ఓవరాల్ గా సినిమా మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా నయనతారను డామినేట్ చెయ్యాలన్నట్లుగా తనకే ఎక్కువ సీన్స్ రాసుకుని ఆర్జె బాలాజీ విసిగించాడు. సినిమా ప్రారంభం నవ్వులతో మొదలైనా కాసేపటికి మొనాటినీ వచ్చేసింది. అంతేకాకుండా అసలు కథకన్నా విలన్ ని అడ్డం పెట్టి దొంగబాబాల గురించి క్లాస్ లు,వివరణలు ఇవ్వటంతో విసుగెత్తించింది. సెకండాఫ్ సోసోగా నడిచింది.
బాగున్నవి
ఈ సినిమాలో నయనతార నటన హైలెట్ గా నిలుస్తుంది. నిజంగా అమ్మవారు ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేటంత గ్రేస్ తో జీవించేసింది. అయితే ఆమెకోసమే ఈ సినిమా అంటే నయనతార కూడా ఒప్పుకోదు. ఫస్టాఫ్ లో కామెడీ కూడా బాగుంది. ఇప్పటి పరిస్థితులకు రిలేట్ అయ్యే కొన్ని సీన్స్ బాగున్నాయి.దొంగ బాబాగా అజయ్ ఘోష్ బాగా చేసారు.
బాగోలేనివి
ఆర్జే బాలాజీ అత్యుత్సాహం చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ పరమ రొటీన్ గా ప్రెడిక్టుబుల్ గా నడవటం ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ కూడా కలిసిరాలేదు. రన్ టైమ్ కూడా బాగా ఎక్కువ అనిపించింది.
టెక్నికల్ గా ..
స్క్రిప్టు చాలా డల్ గా ఉంది. డైలాగులు బాగున్నాయి. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ, గిరీష్ మ్యూజిక్ సినిమాకు కలిసివచ్చాయి. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి, కాస్త రన్ టైం తక్కువగా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్ ధాట్
విలన్ డెన్లో అమ్మోరు ఫైట్ , మీడియా ఛానల్స్ లో దేవత ఇంటర్వ్యూలు వంటి సీన్స్ చాలు అమ్మోరిని ..అమ్యామ్యా చేసేయటానికి.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
---------
ఎవరెవరు..
తారాగణం: నయనతార, ఆర్.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్, తిరునవక్కరసు, మౌళి తదితరులు
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్.బి
ఆర్ట్: విజయ్‌కుమార్.ఆర్
ఎడిటర్: సెల్వ ఆర్.కె
స్క్రీన్ ప్లే: ఆర్.జె.బాలాజీ & టీమ్
మాటలు: కె.ఎన్.విజయ్‌కుమార్
పాటలు: రెహ్మాన్
కొరియోగ్రఫీ: దినేష్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్.జె.బాలాజీ & ఫ్రెండ్స్
దర్శకత్వం: ఆర్.జె.బాలాజీ, ఎన్.జె.శరవణన్
నిర్మాత: ఐసరి కె.గణేష్
విడుదల: 14,నవంబర్ 2020
ఓటీటి: (డిస్నీ+హాట్‌స్టార్)