నవీన్ చంద్ర ‘సూపర్ ఓవర్’ రివ్యూ

By Surya Prakash  |  First Published Jan 22, 2021, 4:14 PM IST


మొన్న సంక్రాంతికి వరస పెట్టి థియోటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఓటీటిలలో సబ్ స్క్రిప్షన్ కట్టిన మా పరిస్దితి ఏమిటి..మాకు కొత్త సినిమాలు లేవా అని బెంగుపెట్టుకునే వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం  ‘సూపర్ ఓవర్’ అనే క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ చేసారు. నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి & రామకృష్ణ’ ఆ మధ్యన ఆహాలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం  ‘సూపర్ ఓవర్’ ని ఆహా వారు రిలీజ్ చేసారు. ఇంతకీ ఈ సినిమా ఆహా అనిపించిందా.. నవీన్ చంద్ర మిగతా సినిమాలు ఓటీటిలలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన  ఇచ్చిందా? అలాగే ఈ చిత్రం క్రికెట్ కు సంభందించిందా..కథేంటి, చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కాశీ(నవీన్ చంద్ర), వాసు(రాకేందు మౌలి),  మధు(చాందిని చౌదరి). వీళ్లలో కాశీ అమెరికా వెళ్లే ట్రైల్స్ లో ఉంటే, వాసు ఓ కంపెనీలో జాబ్ చేస్తూంటాడు. మధు హయ్యిర్ స్టడీస్ చేస్తూంటుంది. హ్యాపీగా జీవితం నడిచిపోతున్న టైమ్ లో కాశీ మామయ్య ఫోన్ చేసి...రేయ్..మనకు నలభై లక్షలు అప్పు ఇచ్చిన వాళ్లు నాలుగు రోజుల్లో తీర్చలేకపోతే ఇల్లు జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చారని చెప్తాడు. దాంతో ఇప్పుడు కాశీ ఎలాగైనా ఆ డబ్బు సంపాదించి ఒడ్డున పడాలనుకుంటాడు. అయితే హఠాత్తుగా అంత పెద్ద ఎమౌంట్ సర్దేదెవరు. 

అప్పుడు ఆపద్బాందవుడులా బెట్టింగ్ బంగార్రాజు(వైవా హర్ష) తగులుతాడు. అతనో క్రికెట్ బెట్టింగ్ బుకీ. అతను ఇచ్చిన సలహాతో కాశీ కూడా తన అప్పులని బెట్టింగ్ లో డబ్బులు గెలిచి తీర్చాలని ఫిక్స్ అవుతాడు. అదృష్టం కొద్ది కాశీ బెట్టింగ్ లో కోటీ డబ్బై లక్షలు గెలుస్తాడు.  అయితే ఆ డబ్బు చేతికి ఇచ్చేయరు. హవాలా రూపంలో ఇస్తారు. దాంతో హవాలా గ్యాంగ్ నుంచి డబ్బులు తీసుకోవటానికి రెడీ అయ్యిన ఈ ముగ్గురు స్నేహితులకు రకరకాల ఎక్సపీరియన్స్ లు ఎదురౌతాయి. అంతేకాదు లంచగొండి సీఐ అజయ్ (అజయ్) వీళ్ల వెంటపడతాడు. అప్పుడు ఏమైంది. హవాలాలో తాము గెలిచిన డబ్బులు కాశీ తెచ్చుకోగలిగాడా..తన అప్పు కట్టేసాడా..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

Latest Videos

undefined

కథా విశ్లేషణ

టైటిల్ చూసి ఇదో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అనుకుంటే బోల్తా పడినట్లే. క్రికెట్ కు ఈ సినిమాలో స్దానం లేదు. కేవలం క్రికెట్ బెట్టింగ్, హవాలా చుట్టూ తిరుగుతుంది. అలాగే క్రికెట్ బెట్టింగ్ లు ఎలా జరుగుతాయి. హవాలా మనీ ఏమిటి వంటి విషయాల గురించి తెలియని వారికి ఇది ఎడ్యుకేట్ చేసే పోగ్రామ్ పెట్టుకుంది. అక్కడిదాకా ఇంట్రస్టింగ్. అయితే  కథగా ఇది మంచి క్రైమ్ థ్రిల్లర్ కావాల్సింది. అయితే ట్విస్ట్ లు కోసం కథను కావాల్సిన చోట లాజిక్ లు వదిలేసి వంచుకుంటూ పోయారు. దాంతో అప్పటికప్పుడు భలే ఉందే అనిపించినా మరుక్షణం ఏంటి ఇలా జరిగింది అనిపిస్తుంది. అలాగే ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే అనేది సాయి పడాలి. ట్విస్ట్ లతో థ్రిల్ చేయగలగాలి. ఆ విషయంలో డైరక్టర్ మంచి ప్రతిభనే చూపెట్టారు. అయితే సినిమాలో ఎక్కువ సమయం...డాట్స్ పెట్టి వాటిని కనెక్ట్ చేయటానికే సరిపెట్టేసారు. దాంతో హీరో పాత్ర పరిస్దితుల వెనక పరుగెడుతూ ప్యాసివ్ గా మారిపోయింది. చాలా సీన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి.కానీ సరైన కంటెంట్ ని ప్రెజెంట్ చేయలేకపోయాయి. అయితే ఫాస్ట్ పేస్ గా కథని నడపటం, ఎత్తుకున్న పాయింట్ తెలుగువారికి కొత్త కావటంతో బాగుందనిపిస్తుంది. ఇక కథలో ఉన్న ట్విస్ట్ లు చాలా ఫోర్సెడ్ గా ఇక్కడ ట్విస్ట్ రావాలి, ఇక్కడ కథ మలుపు తిరిగాలి అన్నట్లుగా అనిపిస్తాయి. సహజత్వం లోపించింది. అలాగే కారు నెంబర్ కో ఇన్సిడెన్స్, లైట్ తీసుకునే పోలీస్ లు , హవాలా బ్యాచ్ తో పోలీస్ లు టచ్ లో ఉండటం వంటి అనేక సినిమాటెక్ లిబర్టీస్ కొంచెం ఇబ్బంది పెడతాయి. అలాగే సినిమాలో ప్రేక్షకుడుకి ఎమోషన్ కనెక్షన్  ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారు. గ్రిప్పింగ్ గానూ అనిపించని థ్రిల్లర్ ఇది. 
  
టెక్నికల్ గా..
సినిమాలో అదృష్టవశాత్తు పాటలు లేవు. రీరికార్డింగ్ మాత్రం చాలా సీన్స్ కు ప్రాణం పోసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..సినిమాకు కీలకంగా నిలిచింది. కెమెరా వర్క్ ని కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ని చక్కగా కాప్చర్ చేసారు. ఏరియల్ షాట్స్,ఛేజ్ సీక్వెన్స్ లు సినిమా కెమెరామెన్ ప్రతిభను పట్టిస్తాయి. డైలాగులు బాగున్నాయి కానీ కొన్ని చోట్ల మరీ సెన్సార్ లేదు కదా అని శృతి మించారు. ఓటీటిలో సినిమాని ఫ్యామిలీలు కలిసి చూసేందుకు ఇది ఇబ్బందికరమైన పరిస్దితి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు సీన్స్ ప్రెజెంటేషన్ లో,ఆర్టిస్టు ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టుకోవటంలో తన నైపుణ్యం ప్రదర్శించారు. ఇక ఈ చిత్రం దర్శకుడు సినిమా సగంలో చనిపోతే..మిగతాది సుధీర్ వర్మ ఫినిష్ చేసారు. 

నటీనటుల్లో నవీన్ చంద్ర పరిణితి చెందిన నటుడులా చేసారు. రాకేందు మౌళి ఎక్సప్రెషన్స్  బాగున్నాయి. చాందిని చౌదరి,వైవా హర్ష, ప్రవీణ్ అలా చేసుకుంటూ పోయారు. అజయ్ మాత్రం కాస్త ఓవర్ అనిపించారు. 
 
ఫైనల్ థాట్
 
మనింట్లో టీ త్రాగుతూ చూసే ఫెరఫెక్ట్ ఓటీటి ఫిల్మ్ 
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..

నటీనటులు: నవీన్ చంద్ర-చాందిని చౌదరి-రాకేందు మౌళి-అజయ్-వైవా హర్ష-ప్రవీణ్ తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సుధీర్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రవీణ్ వర్మ
విడుదల  తేదీ: 22/01/2021

click me!