'మల్లేశం' రివ్యూ..!

By AN Telugu  |  First Published Jun 19, 2019, 10:05 AM IST

బయోపిక్ లు అంటే క్రీడాకారులు,రాజకీయనాయకులు వంటి ప్రజల్లో పేరున్న సెలబ్రెటీల గురించే తీయాలా..మన కష్టాలు తీరటానికి శ్రమించిన మనలో ఒకడు గురించి మాట్లాడకూడదా..వాటిని జనం చూడరా...ఆదరించరా అనే ఆలోచన కోట్లు ఖర్చు పెట్టే సినీ పరిశ్రమలో చాలా తక్కువ.


బయోపిక్ లు అంటే క్రీడాకారులు,రాజకీయనాయకులు వంటి ప్రజల్లో పేరున్న సెలబ్రెటీల గురించే తీయాలా..మన కష్టాలు తీరటానికి శ్రమించిన మనలో ఒకడు గురించి మాట్లాడకూడదా..వాటిని జనం చూడరా...ఆదరించరా అనే ఆలోచన కోట్లు ఖర్చు పెట్టే సినీ పరిశ్రమలో చాలా తక్కువ. సినిమా తెరపై రైతు కష్టాలు చూపినా, రాముడు దైవత్వం చూపినా ఫైనల్ గా పైసలే పరమావధి.

ఇలాంటి నేపధ్యంలో  చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును,పద్మశ్రీని సైతం  సాధించు కున్న చింతకింది మల్లేశం.. జీవితచరిత్రను ‘మల్లేశం’ గా  తెరకెక్కించి మన ముందించారు.  మరి అంత గొప్ప వ్యక్తి కథను హాస్య పాత్రలు, హీరో ఫ్రెండ్‌ పాత్రలను చేస్తూ ముందుకు వెళ్తున్న   ప్రియదర్శి.. చేత వేయించటం సమంజసమేనా..‘మల్లేశం’గా ప్రియదర్శి కనిపించాడా? అలాగే ఈ తెలంగాణా స్పూర్తి ప్రదాత చిత్రం మిగతా ప్రాంత ప్రేక్షకులను ఆకర్షించగలుగుతుందా... అసలు మల్లేశం కథలో బయోపిక్ తీసేటంత విషయం ఏముంది వంటి విషయాలు రివ్యూలో  చూద్దాం.


కథ..

Latest Videos

undefined

చేనేత కుటుంబంలో పుట్టిన యువకుడు మల్లేశం (ప్రియదర్శి).తను పుట్టిన ఊళ్లో చాలా వరకూ తమ లాంటి చేనేత మీద ఆధారపడిన కుటుంబాలే.  చాలిచాలని ఆదాయంతో కుటుంబం లాగలేక  అప్పుల పాలవుతున్నప్పట వాళ్లంతా ఇబ్బందులు పడుతూంటారు. పోనీ వేరే పనిచేసుకుందామా అంటే ఆ ఊళ్లో చాలామందికి తెలిసింది చేనేతమాత్రమే. దాంతో  దాన్నే నమ్ముకుని అక్కడే ఉండాల్సిన పరిస్దితి. మల్లేశం కుటుంబానిదీ ఏ మార్పు లేని అదే పరిస్థితి. ఒక్కరే మగ్గం నేస్తే జీవనోపాది కష్టమవుతోందని మల్లేశం చేత ఆరో తరగతిలోనే బడి మాన్పించి కులవృత్తిలోకి దింపుతాడు తండ్రి (చక్రపాణి). 

రోజుకు కొన్ని వందల సార్లు చేయి తిప్పుతూ ఆసు పోయడం వల్ల అప్పటికే  మల్లేశం తల్లి లక్ష్మి (ఝాన్సి) భుజం నొప్పితో బాధపడుతుంటుంది. ఆ ఊర్లో చాలామంది ఆడాళ్లదీ అదే బాధ. మల్లేశం తన తల్లి బాధ చూడలేకపోతాడు.  ఎలాగైనా తల్లి కష్టం దూరం చేయాలనుకుంటాడు. అందుకు మార్గమేది. తమ కుటుంబానికి ఆధారమైన చేనేతకు ఉపయోగపడే ఆసు యంత్రమే. దాంతో  ఆసు యంత్రం తయారుచేయాలని ప్రయత్నిస్తుంటాడు మల్లేశం. చాలిచాలని ఆదాయం, సరైన ప్రోత్సాహం లేకపోవడం, జనం ఎగతాళి చేయడం అతన్ని లక్ష్యం వైపు వెళ్లనీయకుండా వెనక్కి లాగేస్తూంటాయి.  వీటికి తోడు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అప్పుల తిప్పలు.  వీటన్నింటి నడుమ తాను అనుకున్న లక్ష్యాన్ని మల్లేశం ఎలా చేరుకున్నాడు... ఆసుయంత్రాన్ని ఎలా కనిపెట్టి తన తల్లి కష్టమే కాక తన వారి కష్టాన్నిసైతం ఎలా దూరం చేసాడు అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

ఎలా ఉంది..?

ఒకరి జీవితాన్ని తెరపై చూపాలంటే ఆయా వ్యక్తుల జీవితాల్లో ఎంతో సంఘర్షణ ఉండాలి. అది ఏమాత్రం లోపించినా ఫలితం ఎలా ఉంటుందో ఇటీవల కొన్ని బయోపిక్ చిత్రాల విషయంలో చూశాం. రియాలిటీకి దగ్గరగా ఉంటూనే వారి లైఫ్ స్టోరీలోని సోల్ మిస్ అవకుండా, అదే సమయంలో ప్రేక్షకులను రంజింపజేసేలా తీయగలగాలి. ఒకరకంగా దర్శకులకు ఇది కత్తిమీద సాము లాంటిది. స్టోరీ సెలక్షన్ లో పద్మశ్రీ మల్లేశం లాంటి గ్రామీణ చేనేత వ్యక్తి జీవితాన్ని ఎంచుకుని మొదటి అడుగు విజయవంతంగా వేసిన దర్శకుడు రాజ్.. కథకు తగ్గ నటీనటుల ఎంపికతో సగం సక్సెస్ అందుకున్నాడు. 

గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరణ, ముఖ్యంగా తెలంగాణ యాస, ఇక్కడి వ్యక్తుల్లోని భావోద్వేగాలను క్యాప్చర్ చేయడంలో దర్శకుడి నైపుణ్యతను ప్రశంసించకుండా ఉండలేం. అమ్మ కష్టం దూరం చేసేందుకు ఆరాటపడే కొడుకు, ప్రపంచమంతా నమ్మని వ్యక్తిపై నమ్మకముంచి అతని ప్రయత్నాన్ని ప్రోత్సహించే భార్య.. ఇలా ఓ వైపు కుటుంబ సంబంధాలు.. మరోవైపు చేనేత కళాకారుల జీవితాల్లోని సాధకబాధకాలను చూపించిన వైనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 

అయితే కథనాన్ని రక్తి కట్టించేందుకు ఫిక్షన్ అంశాలు జోడించినా అవి వాస్తవికతకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. పాటల్లాంటి కమర్షియల్ వ్యాల్యూస్ ఉన్నప్పటికీ అవి కథలో ఇమిడిపోయాయి. పెద్దింటి అశోక్ కుమార్ అందించిన సంభాషణలు తెలంగాణ ప్రాంత గ్రామాల్లోని వ్యక్తులను, పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించాయి. 

ప్లస్ లు.. 

ఎక్కడా అనవసర ప్రాసల కోసం పాకులాడలేదు. సెట్స్ వేయడం కాకుండా నేచురల్ లొకేషన్స్ లో తీయడం వల్ల కూడా సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. స్లో నెరేషన్ లో కథ నడుస్తున్నా మల్లేశం పాత్రతో కలసి జర్నీ చేస్తున్న ప్రేక్షకులు అవేవి పట్టించుకోరు. ఆ అథెంటిసిటీని దర్శకుడు ప్రేక్షకులకు అందించగలిగాడు. రొటీన్ సీన్స్ తో మూస ధోరణిలో వెళ్తున్న సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఓ కొత్త అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది.  

మైనస్ లు.. 

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమా మరీ స్లోగా వెళ్లటం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా చేనేత పనివారు, వారు పనిచేసే విధానం పై కొద్దిగా అయినా అవగాహన ఉన్న వారికి బాగా అర్దమవుతుంది. అలాగే ఎంత ఫిక్షన్ జోడించినా తాగుబోతు రమేష్ వంటివారితో నవ్వించే ప్రయత్నం చేసినా డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ కొన్ని సార్లు వస్తూంటుంది. 

ప్రియదర్శికు ప్లస్సేనా..?

ఇప్పటివరకూ కామెడీ పాత్రల్లోనే ఎక్కువ గుర్తింపును అందుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో మల్లేశం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అతనికి ఖచ్చితంగా కేవలం కామెడీ కాదు...ఎమోషన్స్ ని సైతం చక్కగా పండించగలడు అనే గుర్తింపుని ఈ సినిమా తీసుకొస్తుంది. అలాగని ప్రియదర్శి ..నేను హీరోగా చేస్తా అంటూ మిగతా కమిడయన్ల రూట్ లో వెళ్తే మాత్రం దెబ్బతినటం ఖాయం. 

ఇక మిగతావాళ్లలో ..కొత్తమ్మాయి అయినప్పటికీ అనన్య అతనికి పోటీ ఇచ్చేలా నటించింది. అందంతో పాటు అభినయంలోనూ తన మార్క్ చూపించింది. తల్లిదండ్రులుగా ఝాన్సీ, చక్రపాణి నూటికి నూరుశాతం ఆ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో నటించిన వారు కొత్తవారైనా ఎక్కడా ఆ లోటు కనిపించలేదు. ఆర్.ఎస్ నంద, గంగవ్వ, తాగుబోతు రమేష్ పాత్రల పరిధిమేరకు మెప్పించారు. 


ప్యాడ్ మ్యాన్ తో పోలిక..

ఒక సాధారణ వ్యక్తి అనేక కష్టనష్టాలకోర్చి ఒక యంత్రం కనిపెట్టడం అనేది రెండు చిత్రాలు (వ్యక్తుల) మధ్య అందరికీ కనపడే  పోలిక. అయితే బడ్జెట్ కారణాల వల్ల కావొచ్చు, లేదా అక్షయ్ మార్కెట్ వల్ల కావొచ్చు.. 'ప్యాడ్ మ్యాన్' లో  కమర్షియల్ వ్యాల్యూస్ ఎక్కువ కనిపిస్తాయి. పైగా అరుణాచలమ్ మురుగానంతమ్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని నేటివిటీ, క్యారెక్టర్స్ అన్నీ మార్చేస్తూ తమకు తగ్గట్టుగా కథను మలచుకున్నారు. 'మల్లేశం' చిత్రం విషయంలో దర్శకుడు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ ఆయన జీవితాన్ని వీలయినంత సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు.

రేటింగ్ : 2.5/5

ఎవరెవరు..

నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు
సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌
దర్శకత్వం : రాజ్‌ ఆర్‌
నిర్మాత : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి


 

click me!