`మురారి` చిత్రంతో టాలీవుడ్‌లో మ్యాజిక్ చేసిన మహేష్ హీరోయిన్ సోనాలీ బింద్రె మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
మహేష్(Maheshbabu) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `మురారి`(Murari). కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంటిళ్లిపాదిని ఆకట్టుకుంది. ఇందులోని పెళ్లి సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఇందులో మహేష్‌తో జోడీ కట్టింది సోనాలి బింద్రె(Sonali Bindre). మహేష్, సోనాలి మధ్య ప్రేమ కథ అద్భుతంగా, హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధం మాదిరిగా ఉండే ఈ సినిమాలో సోనాలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
దీంతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలతోనూ ఆడిపాడింది. `ఇంద్ర`, `ఖడ్గం`, `మన్మథుడు`, `శంకర్ దాదా ఎంబీబీఎస్`, `పట్నాటి బ్రహ్మనాయుడు` చిత్రాలు చేసింది. తెలుగులో జస్ట్ ఆరు సినిమాలే చేసిన సోనాలీ బింద్రె తనదైన ముద్ర వేసుకుంది. అన్ని సూపర్ హిట్ చిత్రాల్లోనే భాగమైంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. ఆ తర్వాత హిందీకే పరిమితమై, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత సినిమాలు మానేసింది.
అయితే ఆ మధ్య Sonali Bindre క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్ లో చికిత్స పొంది కోలుకుంది. ఆ సమయంలో సోనాలీ బింద్రె పెట్టిన ఎమోషన్స్ పోస్ట్ లు ఆడియెన్స్ ని కదిలించాయి. దీంతో యావత్ ప్రజానికం ఆమో కోలు కోవాలని కోరుకుంది. అభిమానులు ప్రార్థనలు చేశారు. అన్నట్టే ఆమె కోలుకుంది. ఇప్పుడు కెరీర్‌ని కూడా తిరిగి ప్రారంభించబోతుందట. అయితే టాలీవుడ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.
దాదాపు 18ఏళ్ల తర్వాత సోనాలీ బింద్రె రీఎంట్రీ ఇవ్వబోతుందట. చివరగా ఆమె చిరంజీవితో `శంకర్ దాదా ఎంబీబీఎస్`(2004)లో నటించింది. అయితే ఆమె ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` విడుదల కాగానే ఎన్టీఆర్ ఈ సినిమా సెట్‌లో జాయిన్ అవుతారు. ఇందులో కీలక పాత్ర కోసం సోనాలీ బింద్రెని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఆమె ఇందులో నటించేందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.