
స్టార్ హీరోలతో సినిమా చేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. తమ హీరో సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ డిమాండ్లు వినిపించడమే కాకుండా, అప్డేట్స్ లేటైతే విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బూతుల దండకాలు అందుకుంటున్నారు. రాధే శ్యామ్ మూవీ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ ఎంతగా తిట్టారో చూశాం. పలుమార్లు ఆ నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు.
తాజాగా మహేష్ (Mahesh Babu) ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. సర్కారు వారి పాట నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ ఏకిపారేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్, అప్డేట్స్ విషయంలో నిర్మాతలు అలసత్వం వహిస్తున్నారనే అక్కసుతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీ మే 12న సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అంటే మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ ఆల్రెడీ షురూ చేశారు. రెండు సాంగ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
అయితే ఆశించిన మేర సర్కారు వారి పాట ప్రమోషన్స్ లేవని, వరుస అప్డేట్స్ కావాలనేది మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఈ క్రమంలో అప్డేట్స్ సరిగా ఇవ్వడం లేదంటూ నిర్మాతలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. #WorstTeamSVP అనే నెగిటివ్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాతలపై మీమ్స్, ట్రోల్స్ చేస్తూ తమ కోపం తీర్చుకుంటున్నారు.
ఇక దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.