
ఊపిరి తీసుకునే తీరిక కూడా ఉండని సెలబ్రిటీలు మానసికంగా, శారీరకంగా అలసిపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్లకు ఒత్తిడి తగ్గించే బాధ్యత పెట్ డాగ్స్ దే. దాదాపు హీరోలు, హీరోయిన్స్ పెట్ డాగ్స్ కలిగి ఉంటారు. తమకెంతో ప్రీతిపాత్రమైన ఆ కుక్కలను తమతో పాటు సెట్స్ కి కూడా తీసుకెళుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ రష్మిక ఆ మధ్య ఓ పెట్ డాగ్ కొన్నారు. దానికి ఆరా అని నామకరణం చేశారు. ఖాళీ సమయం దొరికితే ఆరాతోనే రష్మిక గడుపుతారు. సెట్స్ లో షాట్ కి షాట్ కి మధ్య గ్యాప్ లో ఆరానే ఆమెకు ఆటవిడుపు.
తాజాగా రష్మిక (Rashmika Mandanna) ఆరాను ప్రేమగా నిమురుతున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆరాను ఒళ్లో కుర్చోబెట్టుకొని రష్మిక ప్రేమగా ముద్దులు ఇస్తుంది. యజమాని ప్రేమను ఆరా తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న రష్మిక ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆమె అక్కడ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం ఉంది.
ఇక తెలుగులో రష్మిక పుష్ప 2(Pushpa 2)చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. పార్ట్ వన్ సక్సెస్ నేపథ్యంలో భారీగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆలస్యం అవుతుంది. అలాగే సీతారామం పేరుతో తెరకెక్కుతున్న ఓ మూవీలో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. అలాగే రష్మిక ఖాతాలో ఉన్న పెద్ద చిత్రం దళపతి 66. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. రష్మిక నటించిన హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రన్బీర్ కపూర్ కి జంటగా చేస్తున్న యానిమల్ షూటింగ్ జరుపుకుంటుంది.