'గతం' మూవీ రివ్యూ

By Surya Prakash  |  First Published Nov 6, 2020, 5:06 PM IST

అదేంటో ..ఓటీటిల్లో స్టైయిట్ గా రిలీజయ్యే ఇండియన్ సినిమాల్లో ఎక్కువ  థ్రిల్లర్సే ఉంటున్నాయి. తక్కువ బడ్జెట్ పూర్తి అయ్యి..థియోటర్ లో రిలీజ్ కు నోచుకోని సినిమాలకు ఓటీటి వేదిక అవుతోంది. అలాగని ఓటీటిలలో ఇప్పటికే విడుదలైన వి,నిశ్శబ్దం వంటి ఎక్కువ బడ్జెట్ సినిమాలను మనం విస్మరింలేం. అయితే ఈ థ్రిల్లర్స్ ఏమీ సక్సెస్ బాట పట్టలేదు. మనవాళ్లు అంతకు మించిన థ్రిల్లర్స్ ప్రపంచ భాషల్లో చూడటం వలనో,లేక మనవాళ్లు వండే థ్రిల్లర్ వంటకాల్లో సరైన దినుసులు పడకపోవటం వలనో ఫలితం ఉండటం లేదు. అయితే ఉత్సాహవంతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. తాజాగా అలాంటి కొందరు ఔత్సాహికులు కలిసి రెడీ చేసిన సైక్లాజికల్ థ్రిల్లర్ గతం. ఈ గతం ...ఎవరి స్వగతం..చూసాక గుర్తుండే గతమేనా, అసలు ఈ గతం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథేంటి
హాస్పటల్ లో రిషి (రాకేష్)స్పృహలోకి వచ్చాక డాక్టర్ అతనికి ఓ సీరియస్ విషయం చెప్తాడు.  కొద్ది రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల అమ్నీషియా (మెమెరీ లాస్) వచ్చిందని వివరిస్తాడు.అలాగే హాస్పటిల్ లో అతన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అతని గర్ల్ ప్రెండ్ అదితి (పూజిత కూరపాటి) చెప్తాడు. అయితే రిషి తన గర్ల్ ప్రెండ్ ని సైతం గుర్తులేదంటాడు. కానీ ఆమె ఆదరణ,ప్రేమ చూసి ఆమె సాయంతో తన గతం గుర్తు చేసుకుందామనుకుంటాడు. ఆ తర్వాత డిఛ్చార్జ్ అయ్యాక..అతని తల్లితండ్రుల గురించి అడుగుతాడు. అదితి అప్పుడు అతని తల్లి ఎప్పుడో చనిపోయిందని, తండ్రి మాత్రం అతని కోసం ఉన్నాడని చెప్తుంది.  దాంతో తన తండ్రిని కలుద్దామని అదితిని తీసుకుని బయిలుదేరుతాడు రిషి. ఆ జర్నీలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. 

అప్పుడు ఆ ప్రక్కగా వెళ్తున్న ఓ పరిచయం లేని ఓ వ్యక్తి(భార్గవ) ప్రక్కనుంచి వెళ్తూ తన వెహికల్ ఆపుచేసి , విషయం తెలుసుకుని వాళ్లను తన కాటేజికి రమ్మని ఆహ్వానిస్తాడు. మెకానిక్ వచ్చే దాకా తమతో ఉండమంటాడు.  అయితే ఆ ఇంటికి వెళ్లాక, ఆ అపరిచితుడు..అతని కొడుకు చేష్టలు వింతగా అనిపిస్తాయి రిషి,అదితిలకు. ఏదో తేడాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోదామనుకునే సరికి తామిద్దరూ అక్కడ ట్రాప్ అయ్యిపోయామని అర్దం చేసుకుంటారు. అంతేకాదు తను గర్ల్ ప్రెండ్ ని చెప్పుకునే ఆమె పైనా డౌట్ వస్తుంది. అయితే అక్కడే ఓ ట్విస్ట్ వస్తుంది. రిషి గత జీవితానికి, ఆ అపరిచితుడు జీవితానికి ఓ కనెక్షన్ ఉందని తెలుస్తుంది. అది ఎలాంటి కనెక్షన్...ఆ జంట క్షేమంగా బయిటపడ్డారా..అసలు ఈ రిషి గతం ఏమిటి, గర్ల్ ప్రెండ్ అని చెప్పుకునే అమ్మాయి..నిజంగా గర్ల్ ప్రెండేనా లేక వేరొకరా  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 
ఎలా ఉంది
ఈ సినిమా సైక్లాజికల్ థ్రిల్లర్ అనేటంత సీన్ లేదు కానీ కొంతమేరకు ఎంగేజ్ చేస్తుంది. సెటప్,లాక్ బాగుంటుంది. అయితే ఆ లాక్ ని ఓపెన్ చేసే క్రమమే అంత ఇంట్రస్టింగ్ గా అనిపించలేదు. దానికి తోడు అంతా కొత్తవారితో కథ నడపటంతో..కాస్తంత కన్ఫూజన్ తోడవుతుంది. అయితే దర్శకుడు ఎక్కువ ట్విస్ట్ లు మీద ఆధారపడటంతో వరసగా మలుపులే కనపడతాయి కానీ ఓ చెప్పుకోదగ్గ కథ కనపడదు. ట్విస్ట్ లు థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి పెద్ద విషయంగా అనిపించవు. మెమరీ లాస్ క్యారక్టర్ ని డేంజర్ సిట్యువేషన్ లో పడేయటం అనేది మంచి ఆలోచన. ఈ ప్లాట్ లో సైకోపాత్ తరహా పాత్రలు కలపటం మరింతగా ఇంట్రస్టింగ్ కలిగించే అంశమే. అయితే సో వాట్..వాట్ నెక్ట్స్ అంటే తెల్లమొహం వేయకూడదు. ముడి వేస్తే అంతే గొప్పే విప్పేలా ఉండాలి. అదే ఇక్కడ మిస్సైంది. ఫస్ట్ యాక్ట్ లో హుక్ చేసిన దర్శకుడు ఎప్పుడైతే కీ క్యారక్టర్స్ ని  ఓ అపరిచితుడు క్యాబిన్ లోకి తోసాడో అప్పుడే రివైంజ్ ప్యాట్రన్ లోకి ప్రవేసిస్తుంది. చాలా ఆర్డనరీగా మారిపోతుంది. తెలుగు సినిమా కదా ఇలా ఉండకపోతే బాగోదు అని ఫిక్సై ఇలా చేసేరేమో అనిపిస్తుంది.

Latest Videos

undefined

అలాగని గతం సినిమా టీమ్ కష్టాన్ని పూర్తి తీసిపారేయలేం. సినిమా కొన్ని మిస్టరీ మూమెంట్స్, అద్బుతమైన లొకేషన్స్ మనని మెస్మరైజ్ చేస్తాయి. అయితే రైటింగ్ డిపార్టమెంట్ మాత్రం మరింత కష్టపడాల్సింది. ఎత్తుగడ ఉన్నదానికి రెట్టింపు గొప్పగా క్లైమాక్స్ మూవ్ మెంట్స్ ఉండాలనే విషయం మర్చిపోయారు. ఫస్టాఫ్ కే వారు అలిసిపోయారు.

టెక్నికల్ గా..
సినిమాలో కెమెరా వర్క్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. స్క్రిప్టు వర్క్ కుదరలేదు. ఫెరఫార్మెన్స్ లలో అక్కడక్కడా అనుభవలేమి స్పష్టంగా కనపడుతోంది. ఎక్సప్రెషన్స్ సరిగ్గా లేవు. అయితే కీ ఆర్టిస్ట్ లు రాకేష్, భార్గవ మాత్రం మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. సపోర్టింగ్ యాక్టర్స్ పూజిత, హర్షవర్ద్, లక్ష్మీ భరద్వాజ్ వంటి కూడా ఫరవాలేదు. విజువల్స్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల సినిమాని లేపింది. చాలా సీన్స్ కు ప్రాణం పోసింది. ఎడిటింగ్ కూడ బాగుంది. డైరక్టర్ ..స్క్రిప్టు డిపార్టమెంట్ లోనే వీక్ అయ్యారు. తప్ప మిగతావన్నీ ఫెరఫెక్ట్. కొత్తవాళ్లతో ఓ కొత్త దర్శకుడు ఈ మాత్రం చేయటం గొప్ప విషయం.

ఫైనల్ థాట్
కథలో ట్విస్ట్ లు ఒక్కోసారి సినిమాకు ట్విస్ట్ ఇస్తాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
ఎవరెవరు..
నటీనటులు : భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే, పూజిత కురపర్తి, హర్ష వర్ధన్ ప్రతాప్, లక్ష్మీ భరద్వాజ్ తదితరులు.
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల
నిర్మాత : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
ఓటీటి:అమేజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్ 06-11-2020

click me!