'సినిమా బండి' రివ్యూ

By Surya Prakash  |  First Published May 14, 2021, 11:57 AM IST

ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సినిమా బండి'. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రీసెంట్ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది.


ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఉన్న ప్రతీవాళ్లు ఓ షార్ట్ ఫిల్మ్ చేసి,యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉంటున్నారు.  పల్లెల్లో కూడా సినిమాల మీద జనాలకు బోలెడు ఆలోచనలు ఉంటున్నాయి. బిహైండ్ సీన్స్ పైనా బీబత్సంగా చర్చ నడుస్తోంది. ఈ సిట్యువేషన్ లో కొంత మంది పల్లె జనం ..సినిమా చేయాలనుకోవటం చిత్రం ఏమి కాదు. కాకపోతే అసలు సినిమా గురించి ఆలోచన ఏమీ లేకుండా  సినిమా తీసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. వాటిని కాప్చర్ చేసి తెరకెక్కిస్తే జనాలను  ఎంతవరకూ ఆకట్టుకుంటాయి. ట్రైలర్ తోనే జనాల్లో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ  'సినిమా బండి' ని ధైర్యంగా ఎక్కచ్చా ..రివ్యూలో చూద్దాం.

కథేంటి

Latest Videos

undefined

ఆటో డ్రైవర్ వీరబాబు (వికాస్ వశిష్ట)కు అనుకోకుండా ఓ రోజు తన బ్యాక్ సీట్ లో  ఓ ఖరీదైన కెమెరా కనపడుతుంది. దాన్ని దేనికి ఉపయోగిస్తారో..అసలు ఎవరిదో అర్దం కాదు. దాంతో తన ప్రెండ్ గణపతి(సందీప్ వారణాసి)ని సంప్రదిస్తాడు .గణపతి లోకల్ గా పెళ్లి ఫొటోలు,వీడియో తీసుకునే ఫొటో కమ్ వీడియోగ్రాఫర్. మొదట దాన్ని అమ్మేద్దామనుకుంటాడు. కానీ ఆ తర్వాత దాంతో సినిమాలు తీయొచ్చు అని తెలుసుకుని ..తమ ఊళ్లో సినిమా తీసి తమ పరిస్దితులు మెరుగుపరుచుకుందామనుకుంటాడు. కానీ తనకు కానీ,తన స్నేహితుడుకి గానీ,ఆ ఊళ్లో ఎవరికి కానీ సినిమాలు తీయటం గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. కానీ తీయాలనే ఆలోచన ఉంది.అక్కడ నుంచి మొదట కథ రెడీ చేయాలని ఆ రోజుల్లో పద్యాలు, చిన్న చిన్న కథలు రాసే ఓ తాతను పట్టుకుంటారు. 

ఆ తర్వాత హీరోగా తన ఊళ్లో బార్బర్ షాపు నడుపుకునే మరిడియ్య( రాగ్ మయూర్) ను ఎంపిక చేస్తారు. అలాగే తమ హీరోకు తగ్గ హీరోయిన్ గా ఓ స్కూల్ లో చదివే అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. షూటింగ్ మొదలెడతారు. అప్పటి నుంచి రకరకాల ఇబ్బందులు ,కష్టాలు మొదలవుతాయి. సగం సినిమా షూట్ చేసాక హీరోయిన్ గా చేసే అమ్మాయి ఓ ట్విస్ట్ ఇస్తుంది. ఆ ఊరి జనం కొందరు ఈ షూటింగ్ ని అపోజ్ చేసి ఎగతాళి చేస్తారు. ఈ లోగా అసలు ఆ కెమెరా కల వాళ్లు దాన్ని వెతుక్కుంటూ బయిలుదేరతారు. అప్పుడు ఏమైంది...సినిమా పూర్తి చేసారా..హీరోయిన్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది...

సాధారణంగా ఇరాన్ లో ఇలాంటి సినిమాలు చూస్తూంటాము..చాలా నాచురల్ గా..ఓ చిన్న పాయింట్ తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ అనే పరిధి పెట్టుకోకుండా తీస్తూంటారు. ఇలాంటివి మన దగ్గర తక్కువే. ఈ సినిమాతో ఇలాంటివి కూడా మన దగ్గర కూడా తీయవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చారు నిర్మాతలు, దర్శకులు. చాలా నీట్ గా..రెండు మూడు బూతు డైలాగులు తప్పించి సినిమాని చక్కగా సహజ వాతావరణంలో తీసారు. నిజంగా మన కళ్లెదురుగా జరుగుతోందా అనిపిస్తుంది. కథా ప్రారంభమే మెయిన్ పాయింట్ లోకి వెళ్లిపోవటం,మెల్లిమెల్లిగా కథలో టెన్షన్ ఎలిమెంట్స్ ని తీసుకురావటం జరిగింది.  అయితే క్యారక్టర్స్ మొత్తం పరిచయం చేసి, ఊరుని సెటప్ చేసి అప్పుడు కథలోకి వస్తే బాగుండేదేమో. పాత్రలు మనకు అలవాటు అవ్వకుండా కథలోకి వచ్చేయటంతో..ఆ తర్వాత ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూంటాము..అప్పుడు చాలా సేపటికానీ కథలో మరో మలుపు రాకపోవటం కొద్దిగా ఇబ్బందిగా ,సాగిందా అన్నట్లు అనిపించింది. అయితే అవేమీ కథా గమనానికి అడ్డు రాలేదు. పాత్రలు సహజమైన నడక అలాంటి వాటిని అధిగమించేసింది. అలాగే సినిమా ఆగిపోయే పరిస్దితి వచ్చినప్పుడు ఆ ఊరి జనం ఎమోషనల్ గా కనెక్ట్ అవటం బాగుంది. ఇంక హీరోగా తెరపై కనిపించే మరిడయ్య తను మరిడేష్ బాబు అని పించుకోవాలనే తాపత్రయం నవ్విస్తుంది. హీరోయిన్ గా ఎంపికైన అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ అయ్యితే పగలబడి నవ్విస్తుంది. చాలా కాలం గుర్తిండిపోతుంది. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి. సింపుల్ గా అనిపిస్తూనే చాలా విషయాలను ఎక్సప్లోర్ చేస్తుంది ఈ సినిమా. ఇక క్లైమాక్స్ లో అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని తాత చెప్పే డైలాగుకు నవ్వకుండా ఉండలేము.అప్పుడు అర్దమవుతుంది ఆ తాతకు అప్పటిదాకా ఎందుకు డైలాగులు పెట్టలేదా అని..ఇలా చాలా విషయాల్లో ఈ సినిమా తనదైన మార్క్ తో ముందుకు సాగింది. 

నటీనటుల్లో ...
 వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్ సినిమాని అలా నిలబెట్టేసారు. అలాగే కూరగాయలు అమ్ముకునే అమ్మాయి పాత్ర వేసిన ఆమె కూడా చాలా బాగా చేసింది. రాగ్ మయూర్ లో చాలా ఈజ్ ఉంది. వికాస్ వశిష్ట ..పూర్తిగా ఆటోవాని పాత్రలో లీనమైపోయాడు. ఇక సందీప్ అయితే లోకల్ ఫొటోగ్రాఫర్ గా నిజంగానే అతన్నే తీసుకొచ్చేరామో అనిపించారు. అందరూ సాలిడ్ గా ఫెరఫార్మ్ చేసారు. ఎక్కడా కొత్తదనం అనేది లేదు.

టెక్నికల్ గా ..

‘లాంగ్‌ డ్రైవ్‌’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్‌. ప్రస్తుతం ప్రవీణ్ దర్శకుడిగా ఫుల్ లెంగ్త్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటారనే చెప్పాలి. తొలి చిత్రం ఏదో చేయాలి పెద్ద హీరోల డేట్స్ పట్టాలని కాకుండా  విభిన్నకథతో ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘సినిమా బండి’ ఖచ్చితంగా  టార్గెటెడ్ వర్గానికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు మరికొంతమందికి ప్రేరణగానూ నిలుస్తాయి.

సత్యవోలు అందించిన సంగీతం బాగుంది. అలాగే  'బావిలోన కప్ప'  సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ..కొన్ని సార్లు ఆర్ట్ సినమాని తలపించింది. కొన్ని షాట్స్ బాగా తీసారు. ఇక ఎడిటింగ్ అయితే పరుగెట్టించింది.ఎక్కడా ల్యాగ్ అనేదే లేదు. స్క్రిప్టు వర్క్ సినిమా కు బాగా కలిసొచ్చింది. డైలాగులు కూడా సినిమాలో ఓ భాగమైపోయాయి..విడిగా ఇది బాగుంది..ఇది లేదు అని చెప్పలేము అన్నంతగా. ప్రొడక్షన్ వాల్యూస్..విషయానికి వస్తే..సినిమా కు ఎంత అవసరమో అంతే ఖర్చుపెట్టారు. 

ఫైనల్ థాట్
 'సినిమా బండి' హాయిగా ఎక్కచ్చు.
Rating:3

--సూర్య ప్రకాష్ జోస్యుల

ఎవరెవరు...
నటీనటులు : వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర త‌దిత‌రులు.
 దర్శకత్వం : ప్రవీణ్‌ కండ్రెగుల
సంగీతం : శిరీశ్‌ సత్యవోలు
స్క్రీన్ ప్లే : ప్రవీణ్‌ కండ్రెగుల
నిర్మాతలు : రాజ్‌ అండ్‌ డీకే

 

click me!