
ఆచార్య చిత్ర ఘోరపరాజయం నేపథ్యంలో చిరంజీవి ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మెహర్ రమేష్ కి షాక్ తగిలే ఆస్కారం కలదు అంటున్నారు. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల తెరకెక్కించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితం చవిచూసింది. పెట్టుబడిలో కనీసం 50 శాతం రికవరీ సాధించలేకపోయింది. ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ అందుకోగా... రెండో రోజే కలెక్షన్స్ పడిపోయాయి. ఆచార్య థియేటర్స్ ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలకు కేటాయించారు. చిరు-చరణ్ కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
ఈ క్రమంలో తన భవిష్యత్ చిత్రాలపై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారట. ఇటీవల విదేశాలకు వెళ్లిన చిరంజీవి తిరిగి ఇండియా వచ్చారు. ఆల్రెడీ మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరింది. మెగా 154, భోళా శంకర్ చిత్రాలు కొంత మేర చిత్రీకరణ జరుపుకున్నాయి. కాగా గాడ్ ఫాదర్ తో పాటు మెగా 154 చిత్రాలు ముందుగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ చిత్రాలు. వీటి ఫలితం ఎలా ఉన్నా, ఒరిజినల్స్ తో పోల్చుతూ విమర్శలు తలెత్తడం ఖాయం. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 మాత్రం స్ట్రెయిట్ మూవీ. చిరు ఇమేజ్ కి తగ్గట్లు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఇలాంటి స్ట్రెయిట్ మూవీతో రావడమే మంచిదని చిరంజీవి భావిస్తున్నాడట. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చివరి దశకు చేరిన తరుణంలో దానితో పాటు, మెగా 154 పూర్తి చేస్తాడట. మెహర్ రమేష్ తో చేస్తున్న బోళా శంకర్ పక్కనపెట్టే సూచనలు కలవు అంటున్నారు. ఇదే జరిగితే మెహర్ రమేష్ కి పెద్ద షాక్ తగిలినట్లే. వరుస డిజాస్టర్స్ తో కనుమరుగైన మెహర్ రమేష్ ఎలాగొలా చిరంజీవితో ప్రాజెక్ట్ ఓకె చేయించుకున్నారు. ఆయన చివరి చిత్రం షాడో 2013లో విడుదలైంది. అంటే ఏకంగా ఓ దశాబ్దం పాటు మెహర్ రమేష్ ఖాళీగా ఉన్నారు. ఇన్నేళ్లకు తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కిస్తున్నారు. భోళా శంకర్ విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటే ట్రాక్ లోకి రావచ్చని ఆయన ఆశపడుతున్నాడు.