కొత్త కథలు దొరకనప్పుడు పాత కథలనే వండి వార్చాలనే నియమాన్ని చాలా శ్రద్దగా సినిమాలు వాళ్లు పాటిస్తూంటారు. అయితే ఆ పాతదనాన్ని కొత్తగా మార్చి, మనల్ని ఏమార్చాలనే క్రమంలో చాలా మార్చేసి, అసలు రూపు రేఖలే లేకుండా మార్చేస్తారు. దాంతో తల తోకా లేని సినిమాలు తయారవుతూంటాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు కావాల్సింది కథ అని అందరూ చెప్తూంటారు కానీ దాన్ని నమ్మి ఆచరించరు. తాజాగా 'బొంభాట్' అనే తెలుగు సినిమా ప్రేక్షకులను బొంబాట్ ఆడిస్తానంటూ ఓటీటిలోకి దూకింది. రోబో, ప్రేమ, సైంటిస్ట్ లు అంటూ శంకర్ రోబో నాటి కబుర్లు వెంటేసుకుని వచ్చింది. సైన్స్, లైఫ్ అంటూ సినిమా చూపించింది. ఇంతకీ 'బొంభాట్' ఎంతవరకూ ప్రేక్షకుడుని ఆకట్టుకుంది. అసలు ఈ సినిమా కథేంటి...ఈ 2020 నాటి రోబో ఎలాంటి విన్యాసాలు చేసింది. చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
అనగనగా ఓ అన్ లక్కీ ఫెలో విక్కీ (సుశాంత్ రెడ్డి). దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న అతన్ని ఎవరూ దగ్గరకి చేరతీయరు..కన్న తల్లి,తండ్రులతో సహా అందరూ దూరం పెడతారు. ఆ టైమ్ లో అతని ఒంటరి జీవితంలో ఒయసిస్సులా ప్రొఫెసర్ ఆచార్య (శిశర శర్మ) పరిచయం అవుతాడు. వీరిద్దరు అతి కొద్ది రోజుల్లోనే జిగిరి దోస్ట్ లుగా మారతారు. ఆయన సలహాతో తన ఇష్టపడ్డ అమ్మాయి చైత్ర(చాందిని చౌదరి)ని ప్రేమను పొందుతాడు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఆమెతో అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. ఈలోగా తన ప్రొఫెసర్ ఫ్రెండ్ సలహా తీసుకుందామంటే ఆయనా పరలోక ప్రయాణం పెట్టుకుంటాడు. ఈ కష్టాలు చాలదన్నట్లు ఆయన కుమార్తె మాయ(సిమ్రాన్ చౌదరి) భాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఈ లోగా అనుకోనిది జరుగుతుంది. ఓ తిక్క సైంటిస్ట్(మాక్రాండ్ దేశ్ పాండే) సీన్ లోకి వస్తాడు. ఆయన మాయని మాయం చేసే పనిలో ఉంటాడు. దాన్ని అడ్డుకుందామనుకునే విక్కీకు ఓ విచిత్రమైన విషయం మాయ గురించి తెలుస్తుంది. అసలు మాయ మనిషే కాదని అర్దమవుతుంది. తన ప్రెండ్ ప్రొఫెసర్ ని మరణం వెనక కూడా ఓ సీక్రెట్ ఉందని అర్దమవుతుంది. ఇంతకీ మాయ ఎవరు..ఆ ప్రొఫెసర్ మరణం వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి..చైత్రతో అతని ప్రేమ కథ ఓ కొలిక్కి వచ్చిందా...వంటి అనేక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ఎలా ఉంది..
undefined
‘సైన్స్‌ని.. లైఫ్‌ను కంట్రోల్ చేయడానికో లేదా డిస్ట్రాయ్ చేయడానికో వాడకూడదు. బెటర్ చేయడానికి మాత్రమే వాడాలి’ అనే సెంట్రల్ పాయింట్ తో తయారైనట్లు చెప్పబడుతున్న ఈ సినిమాలో ఆ పాయింట్ తప్ప అన్ని ఉంటాయి. స్క్రిప్ట్ దశలోనే కథ ప్రక్క దారులు పట్టింది. సినిమాలో హ్యుమనాయిడ్ రోబోట్ ఉంది. అలాంటి విషయం ఉన్నప్పుడు దాన్నే హైలెట్ చేస్తూ దానిచుట్టూ నే కథ జరగాలి. జరుగుతుందని ప్రేక్షకుడు ఆశిస్తాడు. అలాంటిది ఎక్కడో ప్రీ క్రైమాక్స్ దాకా ఆ విషయం దాచి పెడితే కలిసి వచ్చేదేముంది. హీరో లవ్ స్టోరీ చెప్పాలనుకుంటే మధ్యలో ఈ రోబో విషయం ఎత్తటం అనవసరం కదా.
అలాగే ఈ సినిమా ప్రారంభంలో హిచ్ కాక్ కోట్...“Where drama begins logic ends.” వేస్తాడు డైరక్టర్. అయితే ఇందులో లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి కానీ డ్రామా మాత్రం ఎక్కడా బిగిన్ కాదు. డ్రామా బిగిన్ అయ్యేది కేవలం కథలో కాంప్లిక్ట్ పార్ట్ వచ్చినప్పుడే. క్యారక్టర్ అన్ లక్కీ పర్శన్ కాబట్టి వాడి దురదృష్టమే కాంప్లిక్ట్ అనుకుని స్క్రిప్టు రాసుకున్నారు కానీ..అలాంటి వాడి జీవితంలో ఫలానాది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం పై వర్కవుట్ చేయలేదు. ఈ కథలో వచ్చే కాంప్లిక్ట్ ప్రీ క్రైమాక్స్ లో రావటంతో డ్రామా పుట్టేందుకు కానీ, నడిపేందుకు కానీ సమయం సరిపోలేదు. దాంతో డైరక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టత కొరవడింది.
టెక్నికల్ గా...
ఈ సినిమా టెక్నికల్ గా చిన్న సినిమా స్దాయికి ఓ మెట్టు పైనే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. పెద్ద సినిమా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారు. కొన్ని పాటలు వింటానికి బాగానే ఉన్నా చూడ్డానికి కిక్ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. అంటే ఆ టైమ్ లోనే పాపం ఆ సంగీత దర్శకుడు కు కాస్తంత సినిమా ఇంట్రస్ట్ గా అనిపించి ఉండి ఉండవచ్చు. కెమెరా వర్క్ ..సినిమాకు క్వాలిటీ ఫిలిం లుక్ తెచ్చింది. ఎడిటింగ్ మాత్రం చాలా చోట్ల ఈ సినిమాని ఇంక ఏం చెయ్యలేం అని వదిలేసినట్లు అనిపించింది.
నటీనటుల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో నలుగురిలో ఒకరిగా తెలుగు వారికి పరిచయమైన సాయి సుశాంత్ రెడ్డి హీరోగా చేసారు. ఫరవాలేదనిపించాడు. గుర్తించుకోదగ్గ ఫెరఫార్మెన్స్ ఇవ్వలేదు. డైరక్టర్,స్క్రిప్టు ఆ అవకాసం ఇచ్చినట్లు లేరు. , చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి జస్ట్ ఓకే అన్నట్లున్నారు. తణికెళ్ల భరణి వంటి సీనియర్స్ కూడా ఈ సినిమాని మోయలేకపోయారు. ప్రియదర్శి వంటి కమిడియన్ కూడా ఏమీ చెయ్యలేకపోయారంటే ఈ సినిమా ఏ స్దాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఫైనల్ థాట్....
ఈ సినిమాలో హీరో పాత్ర దురదృష్టవంతుడు. సినిమా చూసాక..మనకు కూడా వాడి దురదృష్టం అంటుకుందని అర్దమవుతుంది.
Rating:1/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
బ్యానర్: సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం
నటీనటులు: సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి, ప్రియదర్శి,మకరంద్ దేశ్ పాండే తదితురులు
సంగీతం: జోష్ బి
ఎడిటర్: గౌతం రాజు
సమర్పణ :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ
నిర్మాత :విశ్వాస్ హన్నూర్ కార్
రన్ టైమ్: 2 గంటల 12 నిముషాలు
విడుదల తేదీ: డిసెంబర్ 03, 2020
ఓటీటి: అమెజాన్ ప్రైమ్