'అర్థ శ‌తాబ్దం' మూవీ రివ్యూ & రేటింగ్!

By Surya Prakash  |  First Published Jun 11, 2021, 3:43 PM IST

‘C/O కంచరపాలెం’ సినిమాతో నటుడిగా పరిచయమైన కార్తీక్ రత్నం హీరోగా, కృష్ణ ప్రియ హీరోయిన్ గా పరిచయం అవుతూ, దర్శకుడిగా రవీంద్ర పుల్లే చేసిన తొలి ప్రయత్నం ‘అర్ధ శతాబ్దం’.


 సమాజంలోని అసమానతలు ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రాలు  ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా వేజెళ్ల సత్యనారాయణ, మాదాల  రంగారావు,టి కృష్ణ వంటి దర్శకులు తర్వాత కుల వ్య‌వ‌స్థ‌, వ‌ర్గ పోరాటం, రాజ్యాంగం.. వంటి  విషయాలపై సాధికారికంగా ఆర్.నారాయణ మూర్తి తప్ప ఎవరూ తెలుగు తెరపై  మాట్లాడలేదు. అయితే ఇప్పుడు  ఆ విషయాలపై చర్చను లేవదీసే దిసగా ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు  విషయాలను తెరపై చూపించడంలో సఫలమయ్యాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

Latest Videos

undefined

2003 సిరిసిల్ల అనే  ఊళ్ళో జరిగే క‌థ ఇది. ఆ ఊరు ఎప్పుడూ కులాల‌, మ‌తాల గొడ‌వ‌ల‌తో అట్టుడుకుతూనే ఉంటుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ కీ, ప్రెసిడెంట్ కావాల‌నుకునే వ్య‌క్తికీ మ‌ధ్య ఎప్పుడు  తగువే.  ఆ ఊరిలో కృష్ణ (కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు.అతనికి  చిన్నప్పటి నుంచి పుష్ష (కృష్ణ ప్రియ‌) అంటే చాలా ఇష్టం.   మూగ‌గా ఆరాధతో రోజులుల  గడుపుతూంటాడు. కానీ పుష్ష ఈ వన్ సైడ్ లవర్  ని ప‌ట్టించుకోదు.. గుర్తించదు. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు.  అదే టైంలో 15 రోజుల్లో తనకి దుబాయ్ వెళ్లే ఆఫర్ వస్తుంది. దాంతో తను వెళ్లే లోపు తన ప్రేమని చెప్పాలనుకుంటాడు. 

ఇక  పుష్ష రోజూ వెళ్లే దారిలో.. ఓ షాపు ఉంటుంది.ఆ ఆవ‌ర‌ణ‌లో.. గులాబీ మొక్కకి పువ్వు పూస్తే.. త‌ల‌లో పెట్టుకోవాల‌న్న‌ది పుష్ష కోరిక‌. అయితే ఆ మొక్కకి పూలు పుయ్యవు. దాంతో ఆ మొక్క‌కి పూలు పూయించి, ఆ పువ్వు.. త‌న చేతుల‌తో పుష్ష‌కి ఇచ్చి, మ‌న‌సులోని మాట చెప్పాల‌ని కృష్ణ ఆరాట‌ం. దాంతో ఆ మొక్క‌ని చాలా జాగ్రత్తగా సాకుతాడు. చివరకు ఆ మొక్క‌కి మొగ్గ తొడిగి, పువ్వు పూసే స‌మ‌యానికి ఎవ‌రో కోసుకుని వెళ్లిపోతారు. దాంతో ఆ ఊరిలో గొడ‌వ మొద‌ల‌వుతుంది. చివ‌రికి ఊరంతా రావణ కాష్టం అవుతుంది. అసలు పువ్వుకు, గొడవలకు సంభందం ఏమిటి..చివరకు పుష్పకు తన ప్రేమను తెలియజేశాడా?ఇందులో నవీన్ చంద్ర,సాయికుమార్ పాత్రలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎనాలసిస్..

ఒక పువ్వు వ‌ల్ల ఒక ఊరిలో గొడవలు, అన‌ర్థాలు జ‌రుగుతాయనే విషయం ఇంట్రస్టింగే. అయితే దాన్ని ఏ జానర్ లో చెప్పాము అనేది ముఖ్యం. వ్యంగ్యాత్మకంగా కథనం నడిపితే బాగుండేది. విప్లవ భావాలు, వర్గ పోరాటం, శ్రమదోపిడి, కులాల మధ్య గొడవలు అన్ని ఒకే సారి చూపేయలనే తాపత్రయంలో తాము కథ,కథనం ఎలా నడుపుతున్నామనే విషయం మర్చిపోయారు. సినిమా తెరపై ఎమోషన్ గా ఉండాలి. అలాగే దాని తయారిలో సైన్స్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఎమోషన్ ని సరిగ్గా బ్లెండ్ చేయగలగాలి. అది మిస్సైంది.ఫస్ట్ హఫ్ అంతా కథ ఏమి కదలదు. కేవలం పుష్పను కృష్ణ ఇష్టపడటం, చైల్డ్ హుడ్ మెమరీస్ తో సాగుతుంది. హీరో  వన్‌సైడ్‌ లవ్‌ పెద్దగా ఏమి అనిపిపంచదు. అలాగే అసలు విషయం లోకి రాకుండా కథని సాగతీయటం విసిగిసిస్తుంది. అసలు కృష్ణ,పుష్పల వన్ సైడ్ లవ్ ట్రాకే 50 నిముషాలు సాగుతుంది. అంతకు మించిన సాగతీత ఏముంటుంది ఈ డిజిటల్ యుగంలో. ఓటీటిలో చూసే సినిమాలో.

పోనీ సెకండాఫ్ లో ఇంటర్వెల్ అయ్యాక అయినా సినిమా పరుగెడుతుందా అంటే అదీ ఉండదు. గొడవలు, అల్లర్లుతో నిండిపోయింది. ఆ గొడవల నుంచి ఆ ప్రేమ జంట తప్పించుకోవటం అనేది ఒకటే మనకు ఈ సినిమా పూర్తిగా చూడాలనించాలి అనిపించే ఏకైక ఎలిమెంట్. అంతకు మించి ఏమీ లేదు. అలాగే సెకండాఫ్ లో హీరో కృష్ణ..పుష్పను తీసుకొచ్చి ఎందుకు వీథుల్లో తిప్పుతాడో తెలియదు. ఇలా ఫస్టాఫ్ లో పసలేని ప్రేమ కథతో అక్కడే తిప్పి తిప్పి కథని సాగదీస్తే, సెకండాఫ్ లో రన్ టైం తగ్గించాలనే ప్రయత్నంలో భాగంగా సంభందం లేకుండా సీన్స్ ఎడిట్ చేసారు. దాంతో చాలా చోట్ల లింక్ లు తెగిపోయి అతుకుల బొంతలా తయారు చేశారు. న‌క్స‌లిజం, రాజ్యాంగం అంటూ చాలా బ‌ల‌మైన అంశాలు కథలో మేళ‌వించినా,  వాటిని ప్రేక్ష‌కుడికి అర్థ‌మ‌య్యేలా, అర్థం చేసుకునేలా... చెప్ప‌లేక‌పోయాడు.

టెక్నికల్ గా ..
మొదటి సినిమాలోనే అనేక విషయాలను చెప్పేయాలనుకుని తయారుచేసుకున్న కథ డైరక్టర్ ని దెబ్బకొట్టింది.మంచి డైలాగ్స్ రాసుకున్నప్పటికీ సీన్ ని, డైలాగులను కలిపి ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ చేయలేకపోయారు.ఎమోషనల్ గా కనెక్ట్ కానీ పాత్రలు బోర్ కొట్టిస్తాయి. స్క్రీన్ ప్లే ఎక్కడా ఇంటెన్స్ లేకుండా చాలా స్లోగా సాగడం, ప్రేక్షకులని వావ్ అనిపించే మోమెంట్స్ లేకపోవడంతో సినిమాని చివరదాకా చూడటం కష్టమనిపిస్తుంది. 

 ఇక హైలెట్స్ లో వేణు, వెంకట్ ఆర్ శాఖమూరి, అస్కర్ ల సినిమాటోగ్రఫీ బాగుంది.. 90ల నాటి కథకి సరిపోయే విజువల్స్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ విజువల్స్ కి నఫల్ రాజా ఐస్ అందించిన మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా యాప్ట్. హీరోగా చేసిన కార్తీక్ రత్నం,తొలిపరిచయమైన కృష్ణప్రియ కూడా బాగా చేసారు. కీలక పాత్రల్లో కనిపించిన నవీన్ చంద్ర, సాయి కుమార్, అజయ్, శుభలేఖ సుధాకర్ లు బాగా చేసినా, కథలో వారి పాత్రలు కరెక్ట్ గా డిజైన్ చేయలేదు.

ఫైనల్ థాట్

అర్దవంతంగా లేదు,అర్ద శతాబ్దం క్రిందటి సినిమా ఇప్పుడు చూస్తున్నట్లు అనిపించింది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

ఎవరవెరు...
 బ్యానర్‌: ఆర్‌ఎస్‌ క్రియేషన్స్‌ 
నటీనటులు: కార్తీక్‌ రత్నం, నవీన్‌ చంద్ర, సాయికుమర్‌, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్‌, ఆమని తదితరులు 
 సంగీతం: నఫల్‌ రాజా 
 సినిమాటోగ్రఫీ: అఖేర్‌, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఈజే వేణు 
 ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్ 
ఆర్ట్‌: సుమిత్‌ పటేల్‌ 
 నిర్మాత: చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ 
కథ, దర్శకత్వం: రవీంద్ర, పుల్లె 
ఓటీటి : ఆహా
విడుదల తేది: 11,జూన్ 2021

click me!