పత్తికొండలో ఉద్రిక్తత... గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన టమోటా రైతులు

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 2:26 PM IST
Highlights

కర్నూల్ టమోటా రైతులు ఆందోళన బాట పట్టారు. తాము పండించిన పంటకు గిట్టబాటు ధర చెల్లించకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని  ఆరోపిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. 

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు గా తయారయింది టమోటా రైతన్న పరిస్థితి. మార్కెట్లో చూస్తే వ్యాపారులు టమోటా ఎక్కువ ధరకే  వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కానీ టమాటా పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కాదు కదా గిట్టుబాటు ధర కూడా దొరకట్లేదు. ఈ పరిస్థితిపై విసిగి వేసారిన రైతన్న పండించిన పంట గిట్టుబాటు ధర కోసం ఆందోళన బాట పట్టాడు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న తన పది రూపాయల సంపాదన కోసం రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు. స్థానిక ఎమ్మెల్యే నేరుగా వచ్చి తమకు న్యాయం చేస్తేనే కదులుతామని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పత్తికొండ గుత్తి ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిన అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.

 వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు మండిపడ్డారు. గురువారం ఉదయం నుండి జత 500 నుంచి 600 కొనుగోలు చేసి మధ్యాహ్నం నుండి టమోటా గంపలు మార్కెట్ కు ఎక్కువ రావడంతో దళారులు టమోటా ధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులు కోపోద్రిక్తులై రోడ్డెక్కారు. 

దాదాపు నాలుగు గంటల పాటు  రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. మూడు కిలోమీటర్ల మేర మంత్రాలయం నుండి బెంగళూర్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దళారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పత్తికొండ పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేస్తే గాని ఆందోళన విరమించేది లేదంటూ అన్నదాతలు చెప్పారు. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకొని వారు మరో ప్రత్యామ్నాయం చూసుకొని పోతుంటే...ప్రభుత్వ అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్టు సంఘటన స్థలానికి రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పగలనకా రాత్రనకా తాము కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటలు గిట్టుబాటు ధర లేక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక, పలువిధాలుగా రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాము. వర్షాలు బాగా పడి పంట చేతికి వచ్చే సమయానికి దళారుల చేతుల్లో రైతు నలిగిపోతున్నారు. బరువెక్కిన గుండెతో కన్నీళ్లు పెడుతున్నాము. రైతు కష్టాలు తీరవా...  మీరు చెబుతున్నట్లు రైతు ఎన్నటికీ రాజు కాలేడా అని ఆందోళనకు దిగిన రైతుల వాపోతున్నారు. 
 

click me!
Last Updated Oct 17, 2019, 2:26 PM IST
click me!