కీలక నిర్ణయం... రిజిస్ట్రేషన్ శాఖలో నూతన సంస్కరణలు

By Arun Kumar PFirst Published Oct 14, 2019, 8:54 PM IST
Highlights

ఏపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ సంస్కరణలపై అవగాహన కార్యక్రమం కర్నూల్ జిల్లాలో జరిగింది. ఇందులో పాల్గొన్న రిజిస్ట్రేషన్ అడిషనల్ ఐజి ఎం. ఉదయ భాస్కర్ రావు ఈ సంస్కరణల గురించి వివరించారు.  

కర్నూల్: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి తావు లేకుండా, పారదర్శకతను ప్రాధాన్యత ఇస్తూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా క్రయ, విక్రయాలు జరిగేలా సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఏపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలను  రిజిస్ట్రేషన్ అడిషనల్ ఐజి ఎం. ఉదయ భాస్కర్ రావు వెల్లడించారు. కర్నూల్ లోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 అమ్మకం, కొనుగోలుదారుల డాక్యుమెంట్లు రాసుకునేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా కృష్ణా ,విశాఖ జిల్లాలో అమలు చేస్తోందన్నారు. అక్కడ సత్ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. 

నవంబర్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త విధానం అమలు కానుందని పేర్కొన్నారు. అనేక రకాల నమూనాలను సవరించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని సూచించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో వర్క్ షాప్ పబ్లిక్ డేటా ఎంట్రీ,  దస్తావేజుల రచనపై అవగాహన కల్పించామన్నారు.

 ప్రజలు సులభమైన రీతిలో నమూనా దస్తావేజులు ఆన్ లైన్లో చేసుకునే విధంగా సులభంగా భూములు, స్థలాలు, భవనాలు, అమ్మకం, తనఖా సంబంధించిన రిజిస్ట్రేషన్లకు 16 రకాల డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లీషులో రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ అందుబాటులో ఉంచామన్నారు. నూతన విధానం వల్ల దస్తావేజుల తయారీ కోసం దళారులను చెల్లించాల్సిన అవసరం లేదని నేరుగా ప్రజలే దస్తావేజులు ఆన్లైన్లో నమోదు చేయవచ్చని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యం...కాటసాని రాంభూపాల్ రెడ్డి 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రిజిస్ట్రేషన్ శాఖ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులు సైతం  సులువుగా రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్తి భూమిని అమ్మే వారికి, కొనే వారికి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. 

ఒకరి పేరుతో ఉన్న భూమి మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉదయ భాస్కర్ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక రమా ప్రియ నగర్ లో డబుల్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ అయ్యాయని... పూర్తిగా విచారించి, పేదలకు న్యాయం జరిగేలా వారి భూమికి భద్రత కల్పించాలన్నారు. 

 "దళారీ వ్యవస్థ తో సామాన్య ప్రజలు ఇబ్బందులు..  హఫీజ్ ఖాన్" 

సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు.  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. అధికారులందరూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా సేవ చేయాలన్నారు.  ఇష్టారాజ్యంగా లేకుండా బాధ్యతతో విధులు  నిర్వహిస్తే ఎటువంటి సమస్యలు రావన్నారు. ప్రజలు వారంతట వారే దస్తావేజులు తయారు చేసుకోవడం సులభ పద్ధతిలో కలదన్నారు. 

ఈ కార్యక్రమంలో  రిజిస్టర్ మరియు స్టాంపుల టెక్నికల్ డైరెక్టర్ శ్రీకాంత్, రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖ జిల్లా అధికారి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 
 
 

click me!