ఇన్ ఫ్లూ ఇంజ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

By Arun Kumar PFirst Published Oct 19, 2019, 8:31 PM IST
Highlights

ఇన్ ఫ్లూ ఇంజ వ్యాధిపై  అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ విశాఖపట్నం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యాధి సోకిన తర్వాత చికిత్స పొందడం కాకుండా ముందస్తుగానే ఈ వ్యాధి సోకకుండా  ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో డాక్టర్లు వివరించారు.  

విశాఖ : 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, బాలింతలకు, ఏడాదిలోపు వయసున్న చిన్నారులు త్వరితగతిన ఇన్ ఫ్లూ ఇంజ వ్యాధి బారిన పడతారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిబారిన పడకుండా ఆరోగ్యంగా వుండొచ్చని  అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ విశాఖపట్నం బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్. పి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 101 సంవత్సరముల ఫ్లూ నియంత్రణ సందర్భంగా భారతీయ శిశు వైద్య పరిషత్ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 

త్వరితగతిన తగు చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చన్నారు. ఇది సోకిన 72 గంటల్లోగా సరైన వ్యాధి నిర్ధారణ, వైద్యం అందించడం ద్వారా రోగాన్ని నయం చేయవచ్చని డాక్టర్ తెలిపారు.

అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్. బి. కాశీ మాట్లాడుతూ...ఈ వ్యాధి క్రిముల ద్వారా మానవాళికి సోకుతుందన్నారు. ఊపిరితిత్తుల, గొంతు, ముక్కు,  శ్వాస నాళాలకు అంటువ్యాధిగా వ్యాపించి కణాల్లోకి చొరబడి వ్యాధికారక క్రిములు విడుదల చేస్తుందని....ఇలా ఇది మానవాళికి వ్యాప్తి చెందుతుందన్నారు. 

అసోసియేషన్ కోశాధికారి డాక్టర్. పి .ఏ .వి. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.... ఈ ఫ్లూ సోకిన వారికి తల బాధ, కండరముల నొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం మొదలగు లక్షణాలు ఉంటాయన్నారు. తగు చికిత్స చెయ్యకపోతే నిమోనియాకు దారి తీసి ప్రాణాలకే ముప్పు ఏర్పాడే అవకాశం ఉందన్నారు. కొంతమందిలో ఇది మరింత వేగంగా వ్యాపించి ఆరంభ దశలోనే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుందన్నారు. 

అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్.ఆర్ .అచ్చం నాయుడు మాట్లాడుతూ... హెచ్ వన్,ఎన్ వన్, హెచ్ టు, యన్ టు క్రిమి వల్ల అంటువ్యాధిగా మారుతుందన్నారు.   సంయుక్త కార్యదర్శి డాక్టర్. సతీష్ మాట్లాడుతూ.... వ్యాధిగ్రస్తులు ఇతరులకు దూరంగా ఉంచడం , బయట సంచరించకుండా కేవలం ఇంటి వద్దే ఉండాలన్నారు.  ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యకర అలవాట్లు పెంపొందించుకొని మంచి నిద్ర, ద్రవాహారం తీసుకోవాలని సూచించారు.  

click me!
Last Updated Oct 19, 2019, 8:31 PM IST
click me!