ప్రతి రైతుకు రూ.67,500 పెట్టుబడి సాయం...: ఆర్థిక మంత్రి కొత్తలెక్కలు

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 9:15 PM IST
Highlights

కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులకు ఈ  పథకం ద్వారా కలిగే లాభాలను వివరించారు.  

రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని రూ.13500/- లకు పెంచామని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్ లో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని రూ.12,500/- నుంచి రూ.13500/- లకు పెంచామన్నారు. కేవలం 13,500 మాత్రమే కాదు ఈ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సహాయం కింద రూ.67,500/- అందచేస్తామని  చమత్కరించారు. 

ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసామో అది కచ్చితంగా అమల చేయాలన్న దృడ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వున్నారన్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన వాగ్దానం మేరకు రూ.12,500/- లకు అదనంగా మరో రూ.1000/-  పెంచి సహాయం అందించామన్నారు. ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు. 

తొలి విడతగా మే నెలలో ఖరీఫ్ కు ముందు రూ.7500/-  రెండో విడతగా అక్టోబర్ నెలలో రూపాయలు 4000/-  మలి విడతగా సంక్రాంతి సమయంలో 2 వేల రూపాయలు అందిస్తామని ఆయన తెలిపారు. రైతు బాగుంటే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 

డోన్ పట్టణంలో 26,868 మంది రైతులకు 20.97 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందుతోందన్నారు. డోన్ నియోజకవర్గం వర్షం మీదే ఆదారపడి ఉందని ఒక ఎకరాకి కూడా కేసి కెనాల్ నీరు పారే అవకాశం లేదన్నారు. భవిష్యత్తులో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నుండి చెరువులన్నీ నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ పంట పొలాల్లో సెంటు స్థలం కూడా నష్ట పోకుండా ఏ రైతుకు ఎంత మేర పొలం వస్తుందో ఆ మేరకు లెక్క కట్టి పక్క పట్టాదారు పుస్తకాలు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ పెన్షన్ మొత్తాన్ని రూ. 2250 కు పెంచామన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు వచ్చే ఉగాది నాడు ఇంటి పట్టాలు అందచేస్తామన్నారు. పిల్లలను బడులకు పంపించే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద వచ్చే జనవరి 26వ తేది నుండి రూ.14,500/-  అందించనున్నామన్నారు.  వచ్చే ఏడాది డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలను అందచేయనున్నట్లు అయన తెలిపారు.

డోన్ నియోజకవర్గంలో గుండాల క్షేత్రాన్ని ఒక కోటి రూపాయలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే టిటిడి కళ్యాణ మంటపం కూడా మంజూరైందన్నారు. 

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించుకునేలా అధికారులకు ఆదేశించామన్నారు. డోన్, బేతంచెర్లలో బిసి సంక్షేమ వసతి గృహాలను పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు ఉపయోగ పడేలా సమీకృత ల్యాబ్ ను ఏర్పాటు చేయబోతున్నమన్నారు.డోన్ లో గుండాయిజాన్ని తగ్గిస్తూ శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్నామని బుగ్గన వివరించారు. 

click me!