టీమిండియా క్రికెటర్లను గాడిలో పెట్టడానికి 4 దశల ప్రణాళిక, మొదలైన ఫేజ్-1

By Sree s  |  First Published May 16, 2020, 10:41 AM IST

బీసీసీఐ భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు కోసం నాలుగు దశలతో కూడిన బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. లాక్‌డౌన్‌లో క్రికెటర్ల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ కోసం ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో కోచ్‌లు, సహాయక సిబ్బంది ఓ జట్టుగా పని చేస్తున్నారు. 


మార్చి 14, 2020న దక్షిణాఫ్రికాతో భారత్‌ వన్డే సిరీస్‌ రద్దుగా ముగిసింది. అప్పట్నుంచి భారత క్రికెటర్లు ఎవరూ మైదానంలో కనిపించటం లేదు. కోహ్లిసేన సుమారుగా 60 రోజులకుపైగా హోమ్ క్వారంటైన్‌లో కొనసాగుతోంది. క్రికెట్‌ లేకుండా ఇంటి వద్దనే ఉంటున్న ఈ సమయం ప్రొఫెషనల్స్‌కు ప్రమాదకరం. 

అందుకే బీసీసీఐ భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు కోసం నాలుగు దశలతో కూడిన బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. లాక్‌డౌన్‌లో క్రికెటర్ల శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ కోసం ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో కోచ్‌లు, సహాయక సిబ్బంది ఓ జట్టుగా పని చేస్తున్నారు. 

Latest Videos

కొన్ని రోజుల క్రితమే బీసీసీఐ ఓ యాప్‌ను రూపొందించింది. కోచ్‌లు, క్రికెటర్లను అనుసంధానం చేస్తూ లాక్‌డౌన్‌ వేళ ఫిట్‌నెస్‌, టెక్నికల్‌ అంశాలపై అవగాహనకు ఇది తోడ్పడుతుంది. నాలుగు దశల ప్రణాళిక అమలు ఇప్పటికే మొదలైంది. 

లాక్‌డౌన్‌ సమయంలో సహా తర్వాత సైతం భారత క్రికెటర్లు ఈ ప్రణాళికను అనుసరించనున్నారు. ' ఇది దశల వారీ ప్రక్రియ. బోర్డు కార్యదర్శి జైషా రోజువారీ ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. 

ఈ ప్రణాళి కను నాలుగు దశలకు విభజించాం. క్రికెటర్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ దలకు.. ఆన్‌లైన్‌లో నిపుణుల సేవలు అందిస్తున్నాం. డైట్‌ను పర్యవేక్షిస్తున్నాం. ప్రతి రోజు ఫిట్‌నెస్‌ సెషన్లు నిర్వహిస్తున్నాం. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే భారత క్రికెటర్లు అందుబాటులోకి స్టేడియాల్లోకి వెళ్లి ఫీల్డ్‌ ట్రైనింగ్‌లో భాగం కానున్నారు' అని బీసీసీఐ కోశాధికారి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ కుమార్‌ ధుమాల్‌ పేర్కొన్నాడు.

ఫేజ్- 1.... సంపూర్ణ లాక్ డౌన్ : 

బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టు కలిగిన క్రికెటర్లు అందరికీ ఓ ప్రశ్నావళిని పంపించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్య వివరాలు సహా అందుబాటులోని శిక్షణ సదుపాయాలపై అవగాహన కోసం బోర్డు ఈ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. 

భారత పేస్‌ విభాగంలో మహ్మద్‌ షమి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు. దీంతో అతడు బయటకి (పొలాల్లోకి) శిక్షణ, పరుగు తీసేందుకు వెసులుబాటు ఉంది. మరో సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇరుక్కున్నాడు. అతడికి చిన్నపాటి జిమ్‌ మాత్రమే అందుబాటులో ఉంది. 

ఈ వివరాలతో టీమ్‌ ఇండియా ఫిజియోథెరపిస్ట్‌లు నితిన్‌ పటేల్‌, నిక్‌ వెబ్‌లు ఫిట్‌నెస్‌ ప్రణాళిక రూపొందిస్తారు. భారత క్రికెటర్లు, కోచ్‌లతో పాటు ఫిజియోథెరపిస్ట్‌లకు సైతం యాప్‌ ప్రవేశం అందుబాటులో ఉంచారు. 

' క్రికెటర్లతో ప్రతి రోజు సంభాషణలు కొనసాగుతున్నాయి. రోజువారీ శిక్షణ కార్యక్రమాలపై కొన్నిసార్లు గంటల వారీ పర్యవేక్షణ జరుగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు విడిగా ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ శిక్షణ సిబ్బందితో జాతీయ జట్టు కోచింగ్‌ సిబ్బంది సెషన్లలో పాలుపంచుకుంటున్నారు. దీంతో అన్ని స్థాయిల్లో ఏకతా భావం ఏర్పడేందుకు దోహదం అవుతోంది' అని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. 

ఫిజియోథెరపికి వచ్చేసరికి ప్రతి రోజు ఆన్‌లైన్‌ సెషన్లు నిర్వహిస్తున్నారు. వారాంతరం నివేదికలు బోర్డుకు పంపిస్తున్నారు. చీఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌, సహచరుడు యోగేశ్‌ పర్మార్‌లు ఈ సెషన్లను పర్యవేక్షిస్తున్నారు.

ఫేజ్- 2.... పాక్షిక లాక్‌డౌన్‌ : 

పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన వెంటనే శిక్షణ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. క్రికెటర్లను అందుబాటులోని స్టేడియాలకు తీసుకువస్తారు. నైపుణ్య ఆధారిత శిక్షణ ఆరంభం అవుతుంది. స్కిల్‌ ఆధారిత సెషన్లపై ఎన్‌సీఏ బృందం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. 

ఈ దశ ప్రణాళిక అమలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది. స్టేడియం వినియోగించుకునే వెసులుబాటు ఉన్న క్రికెటర్లకు ఈ దశ ముందే ఆరంభం అవుతుంది.

ఫేజ్- 3.... సాధారణ స్థితి : 

కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత భారత క్రికెటర్లు అందరికీ ఒక చోటకు చేర్చనున్నారు. ఎక్కడికి చేర్చాలనే వేదికపై మరో రెండుమూడు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలో మెట్రో నగరాల మధ్య రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఈ దశ ప్రణాళిక అమలు చేస్తారు.

ఫేజ్- 4.... క్రికెట్‌  షురూ:

కరోనా మహమ్మారి గండం నుంచి గట్కెక్కి క్రికెట్‌ సీజన్‌ పున ప్రారంభం అయ్యే సమయానికి భారత క్రికెటర్లను సరైన మార్గంలో ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. మైదానంలోకి సానుకూల దృక్పథంతో క్రికెటర్‌ అడుగుపెట్టే వాతావరణం సృష్టించేందుకు బీసీసీఐ ఈ నాలుగు దశల ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

click me!