అక్కడ బెయిల్ దొరకలేదు.. ఇక్కడ సస్పెన్షన్ వేటు.. గుణతిలకకు షాక్‌ల మీద షాక్‌లు..

By Srinivas MFirst Published Nov 7, 2022, 2:19 PM IST
Highlights

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకని వెళ్లి అక్కడ ఓ యువతిని రేప్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న లంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు   షాకుల మీద షాకులు తాకుతున్నాయి. 
 

శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు వరుస షాకులు తగులుతున్నాయి.  ఇప్పటికే అతడిమీద అత్యాచార ఆరోపణలు వచ్చి సిడ్నీలో ఊచలు లెక్కపెడుతుండగా  ఆదివారం అతడికి మరో రెండు షాకులు తాకాయి. ఆదివారం అతడిని బెయిల్ పిటిషన్ ను సిడ్నీ  కోర్టు రద్దు చేయగా.. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీ) గుణతిలకకు కోలుకోలేని షాకిచ్చింది. అతడిని అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. 

ఈనెల 5న గుణతిలకను శ్రీలంక ఉండే టీమ్ హోటల్ లో అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు.  తర్వాత అతడిని సిడ్నీ లోని స్థానిక  కోర్టులో హాజరుపర్చారు. అతడి తరఫు న్యాయవాది గుణతిలక బెయిల్ పిటిషన్ పెట్టుకోగా  దానిని  కోర్టు తిరస్కరించింది.   దీంతో  గుణతిలక మరికొన్నాళ్లు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు. 

గుణతిలక అరెస్టు నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అతడిపై కఠిన చర్యలకు దిగింది.  అతడిని దేశవాళీతో పాటు జాతీయ జట్టులో ఏ ఫార్మాట్ కూ ఆడకుండా  సస్పెండ్ చేసింది.  ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఆస్ట్రేలియా అధికారులకు గుణతిలక రేప్ విషయంలో తాము అన్ని విధాల సహకరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా..  ఓ యువతిపై అత్యాచారం చేశాడనే ఫిర్యాదుల మేరకు పోలీసులు.. గుణతిలకను అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ తో శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు ఇంటికి బయలుదేరగా గుణతిలక మాత్రం ఆస్ట్రేలియాలోనే ఆగిపోవాల్సి వచ్చింది.  మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ హోటల్ కు వచ్చిన పోలీసులు..  గుణతిలకను అదుపులోకి తీసుకున్నారు. 

టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన జట్టులో గుణతిలక కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో క్వాలిఫై రౌండ్ ఆడిన లంక.. తాము ఆడిన తొలి మ్యాచ్ (నమీబియా) లో గుణతిలక ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి  వైదొలిగాడు. 

టోర్నీ నుంచి వైదొలిగినా గుణతిలకను టీమ్ మేనేజ్మెంట్ శ్రీలంకకు పంపలేదు.  అతడు ప్రస్తుతం జట్టుతోనే ఉన్నాడు. జట్టుతో ఉన్న  గుణతిలక.. డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతిని కలిసి ఆ తర్వాత తనపై అత్యాచారం చేసినట్టు ఆస్ట్రేలియా మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది.  సిడ్నీకి చెందిన 29  ఏండ్ల  ఓ యువతిని డేటింగ్ యాప్ లో కలిసిన గుణతిలక ఆపై ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  ఆ క్రమంలో అతడు ఆమెను లైంగికంగా వేధించాడని  సదరు యువతి సిడ్నీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 2న ఆ యువతిపై గుణతిలక అత్యాచారానికి పాల్పడ్డట్టు అందులో పేర్కొంది.

31 ఏండ్ల ఈ లంక క్రికెటర్.. ఆ జట్టు తరఫున  3 టెస్టులు,  47 వన్డేలు,  45 టీ20లు ఆడాడు. టెస్టులలో 299, వన్డేలలో  1,601, టీ20లలో  741 పరుగులు సాధించాడు. వన్డేలలో రెండు సెంచరీలు కూడా చేసిన  గుణతిలక.. పార్ట్ టైం బౌలర్ గా కూడా లంక జట్టుకు సేవలందించాడు.  ఈ టోర్నీలో లంక.. ఐదు మ్యాచ్ లలో 2 మాత్రమే గెలిచి  మూడింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

click me!