బంగారానికి కరోనా వైరస్...కొనేవారు లేక తగ్గిన పసిడి డిమాండ్...

By Sandra Ashok KumarFirst Published Apr 17, 2020, 12:13 PM IST
Highlights

కరోనా కష్టాల ప్రభావం బంగారం మీద పడుతున్నది. 2020లో పుత్తడి వినియోగం సగానికి తగ్గనున్నదని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పండగలు, పెళ్లిళ్ల కొనుగోళ్లకు లాక్‌డౌన్‌ అడ్డంకిగా నిలిచింది. 
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో కష్టాలు ప్రజలకే కాదు పసిడికీ తాకుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కొనేవారు కరువై బంగారం బిత్తరచూపులు చూస్తోంది. ఈ ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గనుందని అఖిల భారత బంగారు ఆభరణాల మండలి చైర్మన్ ఎన్‌ అనంత పద్మనాభన్‌ అన్నారు. గత సంవత్సరం 690.4 టన్నుల పసిడి వినిమయం జరిగింది. 

2020లో పసిడి వినియోగం 1991 తర్వాత (మూడు దశాబ్దాల) కనిష్ఠ స్థాయి 350-400 టన్నులకు పడిపోవచ్చని పద్మనాభన్‌ అంచనా వేశారు. కరోనా దెబ్బకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయింది. 

ముఖ్యమైన పండగలు, వివాహ మహోత్సవాల సీజన్‌లో దేశం లాక్‌డౌన్‌ కావడంతో ఈ ఏడాదికి పసిడి కొనుగోళ్లు భారీగా క్షీణించనున్నాయని ఆభరణాల తయారీ వర్తకులు అంటున్నారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. మళ్లీ పొడిగించాలా..? వద్దా..? అనేది అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా ఆభరణాలకు పెద్దగా డిమాండ్‌ కన్పించకపోవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలంటున్నాయి. వ్యాపారులకు ఆదాయం నిలిచిపోయింది. ఉద్యోగాలు, జీతాల కోతలతో వేతన జీవులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది. 

ఈ గడ్డుకాలంలో ప్రజలు విలాస వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వినియోగం పడిపోవడంతో దేశంలోకి పసిడి దిగుమతులు తగ్గనున్నాయి. దాంతో వాణిజ్య లోటు కాస్త తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది. 

also read దేశీయ కంపెనీల్లో చైనా సంస్థల పెట్టుబడులపై ‘సెబీ’ నజర్...

ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కంటే దిగుమతుల కోసం చెల్లింపులు అధికంగా ఉండటాన్ని వాణిజ్య లోటు అంటారు. వాణిజ్య లోటు తగ్గడం వల్ల కరెంట్‌ ఖాతా లోటు కూడా తగ్గుతుంది. తద్వారా రూపాయి మారకం రేటుకు కొంత మద్దతు లభిస్తుంది. 

లాక్‌డౌన్‌కు ముందు కూడా మన దేశంలో పసిడి వినియోగం గణనీయంగా తగ్గింది. దాంతో జనవరి-మార్చి త్రైమాసికానికి బంగారం దిగుమతులు 55 శాతం తగ్గాయి. గరిష్ఠ స్థాయి ధరలే ఇందుకు ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 

కరోనా సంక్షోభంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. దీంతో భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోటెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు)  బంగారం 1,750 డాలర్ల స్థాయికి చేరుకుంది. 

దీనికితోడు డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి బలహీనపడింది. దాంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చుకున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆభరణ దుకాణాలు, బులియన్‌ స్పాట్‌ మార్కెట్లు మూతపడినా.. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో మాత్రం గోల్డ్‌ ట్రేడింగ్‌ కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.47 వేల ఎగువకు చేరింది. జూన్‌ కాంట్రాక్ట్‌ రేటు 10 గ్రాములకు రూ.47,327గా నమోదైంది. 

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పసిడిలోకి పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,850 డాలర్లకు ఎగబాకవచ్చు. దేశీయంగా ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ రేటు రూ.50 నుంచి రూ. 55 వేలకు చేరుకోవచ్చని బులియన్ మార్కెట్ అంచనా వేశాయి. 
 

click me!