“మా మూడో ప్రపంచం గురించి వింటారా? ”

By Siva Kodati  |  First Published Apr 1, 2020, 3:45 PM IST

మనందరం ‘ఒకటి’, ‘రెండూ’ అనే చూస్తున్నాం గానీ ‘మూడో సంగతి’ ఒకటి ఉంటుందన్న అవగాహన లేకుండా పోతోంది. ఆడా మగా తప్పా మూడో జెండర్ ఒకటుందని, ఆ జెండర్ తాలూకు విషయాల్లో ఎవరికీ పెద్దగా అవగాహన లేకుండా పోతోంది. 


“మా మూడో ప్రపంచం గురించి వింటారా? ”

-  రచన ముద్రబోయిన

Latest Videos

 

మనందరం ‘ఒకటి’, ‘రెండూ’ అనే చూస్తున్నాం గానీ ‘మూడో సంగతి’ ఒకటి ఉంటుందన్న అవగాహన లేకుండా పోతోంది. ఆడా మగా తప్పా మూడో జెండర్ ఒకటుందని, ఆ జెండర్ తాలూకు విషయాల్లో ఎవరికీ పెద్దగా అవగాహన లేకుండా పోతోంది. నిజానికి ప్రకృతిలోనే ఎంతో వైవిధ్యం ఉంది. సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సు కూడా ఎన్నో రంగుల కాంబినేషన్. కానీ, మానవులనగానే సమాజం స్త్రీ పురుషులనే ప్రధానం అనుకుంటోంది.

కానీ ప్రకృతిలో మూడో జెండర్ ఒకటుంది. అందులోనూ ఎంతో వైవిధ్యత ఉన్నది. ఆ విషయాల పట్ల అవగాహన అందరిలోనూ పెరగవలసి ఉంది. పెంచవలసిన ఆవశ్యకతా ఎంతో ఉన్నది. అదృష్టవశాత్తూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఎలాంటి దుస్థితిలో బతుకుతున్నా నిరాశ పడకుండా ఎంతో సాహసంతో కొందరు ఆ దిశగా గొప్ప కృషి చేస్తున్నారు. అందులో తెలుగునాట రచన ముద్రబోయిన ఒక చక్కటి చైతన్యవంతమైన కార్యకర్త, ముఖ్య నాయకులు. అమె తమదైన మూడో ప్రపంచం ఎలా ఉన్నదో మనకు వివరిస్తున్నారు.  

 

 

రచన గారు హైదరాబాద్ వాస్తవ్యులే. తాను 2014లో ఏర్పడిన తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి వ్యవస్థాపక సభ్యులు, ‘ట్రాన్స్ విజన్’ అన్న యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహుకులు కూడా. ఆమె డబుల్ పీజీ హోల్డర్.

కరోనా కట్టడి నేపథ్యంలో వారి ప్రత్యేక సమస్యలేమిటో నలుగురికీ వివరించమని కోరినప్పుడు తమ సమస్యలను అర్థం చేసుకోవాలంటే ముందస్తుగా అసలు తామెవరో, తమ హక్కుల గురించి జరిగిన ప్రయత్నాలేమిటో, తమకోసం ఏర్పడిన చట్టంలోని లోసుగులేమిటో కొంత అవగాహన ఉండాలన్నారు.

 

 

అలాగే ట్రాన్స్ జెండర్ వ్యక్తుల తాలూకు విభిన్నతలు, మూలాల గురించి ప్రస్తావించక తప్పదన్నారు.  వాటిని వివరంగా పంచుకుంటూనే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తమ కమ్యూనిటి సమస్యలు, పరిష్కారాల గురించి కూడా ఆవిడ వివరించారు.

ఇప్పటికే అంచులకు నెట్టివేయబడిన అణగారిన వర్గాలు, తమ వంటి సమూహాలు ‘సోషల్ డిస్టెన్స్’ అన్న పదాన్ని వివక్షా పూరితమైన పదంగానే చూస్తాయని చెప్పారు. అందుకు బదులు ‘ఫిజికల్ డిస్టెన్స్’ అనడం మంచిదని సూచించారు. వారితో జరిపిన సుదీర్ఘ సంభాషణ మన ప్రాపంచిక దృక్పధాన్నికాస్తయిన మార్చవచ్చని ఆశిస్తూ, ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు చదవండి....

*ముందు మీ గురించి, మీ సంస్థాపరమైన కార్యక్రమాల గురించి చెబుతారా?

-తప్పకుండా. నేను ట్రాన్స్ జెండర్ రైట్స్ యాక్టివిస్ట్ ను. 2014లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తర్వాత మేమంతా కలిసి ఒక కలెక్టివ్ ఏర్పాటు చేశాం. దానికి తెలంగాణ హిజ్రా ఇంటర్ సెక్స్ ట్రాన్స్ జెండర్ సమితి (THITS)  అన్న పేరు పెట్టాం. అది రిజిస్టర్డు సంస్థ కాదు, దానికి ఫండింగ్ కూడా లేదు. కానీ, ఆ కలెక్టివ్ కిందనే మేమంతా పని చేస్తున్నాం.

 

 

2014లోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది కదా. ఐతే, రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కొన్ని మాసాల దాకా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ ఏర్పడలేదు. ఐతే, రాష్ట్ర ఏర్పాటులో మేమూ పాల్గొన్న వాళ్ళంగా, బతుకమ్మ బోనాలు ఆడిన వాళ్ళంగా మా గళాన్ని వినిపించాలని భావించాం. అందుకనే 2015లో మేం ‘స్వాభిమాన సభ’ అని ధర్నాచౌక్ దగ్గర ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మూడు వేల దాకా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు హాజరయ్యారు. 

ఇక్కడ ఒక మాట. సుప్రీం కోర్టు జడ్జ్ మెంట్, దాని ముఖ్యమైన సూచనలు కాస్త చెబుతారా?

2014లో సుప్రీం కోర్టు జడ్జి మెంట్ ప్రకారం, అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు - ఆడ, మగ, ట్రాన్స్ – ఈ మూడింటిలో ఎదో ఒకదాన్ని క్లెయిమ్ చేసుకోవొచ్చు. అలాగే, ‘ట్రాన్స్’(జెండర్ల) వ్యక్తుల్లో కూడా ట్రాన్స్ పురుషులు, ట్రాన్స్ స్త్రీలు, ఇంటర్ సెక్స్ వ్యక్తులు, శివ సత్తులు, ఇలా కూడా వివిధ కేటగిరిలున్నాయి. వీటిలో తామేమిటో గుర్తించుకోవచ్చు. మేల్, ఫీమేల్ గా కూడా గుర్తించుకోవొచ్చు. ఇది జడ్జిమెంట్ ఫస్ట్ ప్రిన్సిపల్.

 

 

వాళ్ళంతట వాళ్ళు తామేమిటో గుర్తించుకునే స్వేఛ్చ ఇచ్చిన జడ్జిమెంట్ ఇది.  ట్రాన్స్ జెండర్ వ్యక్తుల ఐడెంటిటి అన్నది స్వచ్ఛందం. ఏ డాక్టరు కూడా వీరు ‘ఇదీ’ అని సర్టిఫై చేయనవసరం లేదు. ఫిజికల్ స్క్రీనింగ్ అస్సలు చేయకూడదు. ఆపరేషన్ కూడా ముఖ్యం కాదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అందుకనే ఈ జడ్జిమెంట్ ను ‘థర్డ్ జెండర్ జడ్జిమెంట్’ అని కూడా కొన్ని రోజులు అన్నారు.

ఇక, సుప్రేం కోర్టు జడ్జి మెంట్ లో ప్రధాన సూచన ఏమిటంటే, ఒక్క మాటలో - ఇన్నేళ్ళుగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు రాజ్యంగ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంగీకరించడం. మేం సమాజంలో వెలి వేయబడ్డామని ఒప్పుకోవడం, మమ్మల్ని దూరంగా ఉంచారని అంగీకరించడం. ఇది పెద్ద విజయం. ఆ అంగీకారంతోనే - ఇక, ఇప్పటినుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే అమలులో ఉన్నాయో వాటన్నిటిలో మాకు అవకాశం కల్పించాలని ఆ తీర్పు స్పష్టంగా పేర్కొంది.

 

 

విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, ఆరోగ్యం, తదితర అనేక అంశాలను వివరంగా పేర్కొంటూ వీటన్నిటిని అందిస్తూ మా అభివృద్దీ సంక్షేమం గురించి పట్టించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐతే, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో పేర్కొన్న ఏ అంశాన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆచరణలోకి తేలేదు.

దాంతో మేం ‘స్వాభిమాన సభ’ ఎర్పాటు చేశాం. అలాగే ట్రాన్స్ జెందర్ల కలెక్టివ్ ఏర్పాటు చేసి, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఆదేశాలను తప్పక అమలు చేయాలని పోరాడుతున్నాం. అలాగే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు రాజ్యంగా విరుద్దంగా ఉందని, దాన్ని సవరించాలంటూ రకరకాల రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాం.  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం, ఆ బిల్లుకు ముందరి నేపథ్యం కాస్త వివరించండి!

-2014లో తిరుచ్చి శివ అనే డీ.ఎం.కె ఎంపి మొదటిసారిగా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశ పెట్టారు. అయన ప్రవేశ పెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది కూడా. ఇది సుప్రీం కోర్టు జడ్జి మెంట్ తర్వత జరిగిన మంచి ప్రయత్నం. దాదాపు ఆ జడ్జిమెంట్ లో ఉన్నవే ఈ బిల్లులోనూ పొందుపరిచారు. కానీ, రాజ్యసభలో పాస్ అయిన ఈ బిల్లు లోకసభలోకి రాలేదు.

 

 

కానీ, 2016లో బీజేపి ప్రభుత్వం ఒక సపరేట్ బిల్లును డ్రాఫ్ట్ చేసి అమలులోకి తీసుకొచ్చింది. అది పూర్తిగా వ్యతిరేకించేలా ఉంది. అందులో మొట్టమొదట వ్యతిరేకించాల్సిన విషయం, ఎవరైనా ట్రాన్స్ జెండర్ వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే డాక్టర్ స్క్రీనింగ్ (ఫిజికల్ స్క్రీనింగ్) తప్పనిసరి. ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కే  వ్యతిరేకం.

ఇదొక్కటే కాదు, అందులో మొత్తం 27 వ్యతిరేకించే విషయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది, ఎవరైనా భిక్షాటన చేసినా, చేయడానికి వేరే వారిని పంపినా వారికి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అన్నారు. కానీ, విద్య గురించి, ఉద్యోగాల గురించి ఎటువంటి రిజర్వేషన్లు సూచించలేదు. కానీ, అంతకు ముందు వెలువరించిన సుప్రేంకోర్టు జడ్జి మెంట్ లో మమ్మల్ని ఓబిసి కేటగిరి కింద గుర్తిస్తూ రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా సూచించింది.

అంటే, చదువుకోవడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు కల్పించకపోగా ఉన్న వృత్తులు కూడా చేసుకోకూడదని చెప్పడం కొత్త బిల్లులోని ప్రధాన అడ్డంకి. అందుకే 2016 నుంచి ఆ బిల్లును రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేం ఆందోళన చేపట్టాం. దాంతో ఆ బిల్లు తిరిగి స్టాండిగ్ కమిటి వెళ్ళింది.

2018 దాకా మేమంతా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం.  ప్రతిపక్షాల సహకారం తీసుకుని ఒత్తిడి తెచ్చాం. కానీ, బిజీపి ప్రభుత్వం ఎప్పుడైతే రెండో తడవ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఎటువంటి మార్పులు చేయకుండా ఆ బిల్లును పాస్ చేసింది. లోకసభ, రాజ్యసభలో పాస్ చేయడమే కాక, దాన్ని చట్టం కూడా చేసేసింది.

దాంతో అప్పటి నుంచీ ఆ చట్టం రాజ్యాంగబద్దతను ప్రశ్నిస్తూ మేం వివిధ రూపాల్లో పోరాడుతున్నాం. బయటే కాదు, మా హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా కోర్టులో కూడా సవాల్ చేస్తూ వస్తున్నాం. ఇదీ ప్రస్తుత స్థితికి ముందరి నేపథ్యం.

అన్నట్టు, ఇంత పోరాడుతున్నారు కదా. మీ తరఫున చట్టసభల్లో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?  

లేరు. ఒక్కరూ కూడా లేరు.

మరి, మొత్తం దేశంలో లేదా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా  తెలంగాణలో ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంఖ్య ఎంత ఉంటుంది? సరైన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ ప్రకారం మొత్తం ఐదు లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఐదు లక్షల్లో నలభై వేల మంది దాకా చిన్న పిల్లలు ఉన్నారని అంటున్నారు. మరి, చిన్నపిల్లల్ని ఎలా ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగా గుర్తించారో మాకర్థం కాలేదు. అదలా ఉంచితే, వారు చెబుతున్న అయిదు లక్షల సంఖ్య కూడా చాలా తక్కువనే చెప్పాలి.

దానికి ఖచ్చితంగా ఐదారు రెట్లు ఎక్కువ మంది ఉంటారని మా అభిప్రాయం. మళ్ళీ జనాభా లెక్కల సేకరణ చేయనందున ప్రస్తుత సంఖ్య తెలిసే అవకాశం లేదు. ఐతే, తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసింది. వారి లెక్కల ప్రకారం మా సంఖ్య 2,200 మంది. ఐతే, అ రికార్డ్స్ కూడా కరెక్టు అనలేం. ఆ సర్వే కూడా సరైనది కాదని ప్రభుత్వమే నీట ముంచేసింది కదా.

నిజానికి ఒక్క హైదరాబాద్ లోనే ట్రాన్స్ జెండర్ వ్యక్తులు రెండు వేల దాకా ఉంటారు. మొత్తం తెలంగాణలో కనీసం పది వేలమంది దాకా ఉంటారు. ఈ సంఖ్య కూడా కేవలం రోజువారి కనిపించే ట్రాన్స్ మహిళలు. ఎవరైతే బిక్షాటన చేసుకుంటూ బజార్లలో రైళ్ళలో తిరుగుకుంటూ కనబడతారో వారి సంఖ్య ఇది. ఇంకా కనబడకుండా ఉండేవారు రాష్ట్రంలో లక్షలాది మందే ఉంటారు

కనబడాలంటే చాలా కష్టం. అటువంటి అనుకూలమైన వాతావరణం కుటుంబంలో లేదు, సంఘంలోనూ లేదు. చదువుకునే వెసులుబాటు, ఉద్యోగం చేసే అవకాశమూ లేదు. అటువంటి వాతావరణమేదీ లేనందున చాలా మంది గుప్తంగానే ఉండిపోయారు. అసలు జనాభా తెలియడం చాలా కష్టం.

ఇక్కడో విషయం. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల గురించి వాడకానికి సరైన పదం ఏమిటి? అసలు మిమ్మల్ని ఏమని సంభోధించాలి? మీ మధ్య ఉన్న తేడాల గురించి ఎలాంటి అవగాహన ఉండాలి?  

తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ మా అస్తిత్వాన్ని నిర్వచించే సరైన పదం అంటూ లేదు. భాష విషయంగా కూడా మేం వివక్షకు గురవుతున్నాం. ‘కొజ్జా’ అన్న పదం తిట్టుగా వాడటం మనం చూస్తున్నదే. అది ఒక రకమైన బూతుగా మారిపోవడం అందరికీ తెలిసిందే. ‘హిజ్రా’ అన్న పదం నిజానికి ఒక కమ్యూనిటి. అది కల్చరల్ ఐడెంటిటీ చెప్పేది. గురు శిష్య పరంపర తాలూకు చైన్ -వ్యవస్థ గురించి చెప్పేది అది.

పిల్లలు పుట్టినప్పుడు గానీ, పెళ్లి సమయంలో గానీ ఆడి, పాడి ఆశీర్వాదం ఇవ్వడం, ఇచ్చినవి తీస్కోవడం - అలా హిజ్రాలది ఒక వ్యవస్థ. కానీ, హిజ్రాలు కాకుండా కూడా ట్రాన్స్ జెండర్ వ్యక్తులూ ఉన్నారు. ఇండిపెండెంట్ గా బతికే వాళ్ళూ ఉన్నారు. వీరందరి గురించి చెప్పడానికి ‘ట్రాన్స్ జెండర్’ అన్నఇంగ్లీషు పదమే కాస్త సరైన అర్థంలో వాడుకలో ఉన్నది.

 

 

ఇక, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల్లో భేదాల గురించిన వివరాల్లోకి వెళితే, రెండు రకాల జననాంగాలు ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఇంటర్ సెక్స్ వల్ పీపుల్ అంటాం. వీళ్ళు మూడు రకాలు. ఒకటి, అసలు జననాంగాలే లేని వాళ్ళు. రెండో రకంలో వారికి రెండు రకాల జననాంగాలూ ఉంటాయి. మూడో విధానంలో ఒకటి బయట ఉంటుంది, ఒకటి లోపల ఉంటుంది.

కానీ, రెండూ ఉంటాయి లేదా రెండూ ఉండకుండా ఉంటాయన్నాను కదా. ఇలాంటి వాళ్ళలో సర్జెరీ చేసి కరెక్టు చేయడం, తర్వాత వాళ్ళు ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగా గానీ, మెల్, ఫెమేల్ గా గాని గుర్తింపులో ఉంటారు.

ఇట్లా -హిజ్రాలు, ఇంటర్ సెక్స్ వ్యక్తులు, ట్రాన్స్ జెండర్లు. అందులో ట్రాన్స్ విమెన్ ట్రాన్స్ మన్- ఇలాంటి విభజన ఉంది.

*ఇంటర్ సెక్స్ వల్ పీపుల్ గురించి మరోసారి వివరించండి?

ఉదాహరణకు నేను బయలాజికల్ గా మెల్ గా పుట్టాను. ఆలోచనలన్నీ సైకలాజికల్ గా ఫిమేల్ గా ఉన్నాయనుకోండి. అప్పుడు నేను ట్రాన్స్ విమెన్ అవుతాను. అలానే, పుట్టినప్పుడు ఆడపిల్లగా జన్మించినా సైకలాజికల్ గా నేను మగాడిగా ఫీల్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు నేను ట్రాన్స్ మెన్ ను. నా వరకు నేను ట్రాన్స్ విమెన్ ని.

కాగా, మా బాడీలో ఏం పార్ట్స్ ఉన్నాయన్నది వేరే విషయం. ఇట్లా- మెల్, ఫిమేల్ విభజన చేసుకుంటాం. ఇక్కడే ప్రభుత్వం చెప్పిన స్క్రీనింగ్ విషయంలో మాకు సమస్య ఎదురవుతోంది. డాక్టర్ల దగ్గర ఇంతటి అవగాహన లేదు. వాళ్ళు ఫిజికల్ కండిషన్ తప్పా సైకలాజికల్ స్టేటస్ ను గమనంలోకి తీసుకోరు.

మరి హిజ్రాలను ఎలా అర్థం చేసుకోవాలి?

వాళ్ళు మామూలుగానే ట్రాన్స్ విమన్లు. అంటే, పుట్టడం మొగవారిగా పుట్టి మానసికంగా ఆడవాళ్ళుగా ఉంటారు. 

మొత్తంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తుల్లో చదువూ సంధ్య ఎలా ఉంటోంది? కష్టపడి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు?చాలా తక్కువ అనే చెప్పాలి. చిన్నప్పటి నుంచే వేరుగా బిహేవ్ చేస్తారన్న భావం ఏర్పడటంతో వారు చదువు దాకా వెళ్ళే పరిస్థితి ఉండదనే చెప్పాలి.

 

 

బడికి కొంతకాలం వెళ్ళినా వారిని తోటి పిల్లలు గేలి చేయడం, ఆ పిల్లాడు లేదా ఫలానా పిల్ల తేడాగా ఉన్నట్టు టీచర్లు కూడా చెప్పుకోవడం, బడి స్థాయిలోనే వివక్షకు గురవడం, ఇంటా బయటా అందరూ తిడుతూ ఉండటం - ఇవన్నీ వారిని మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తాయి.

ఈ పరిస్థితి రోజు రోజుకూ పెరిగిపోవడంతో, ‘అయ్యో! నేను తప్పు చేస్తున్నానా? నేనేమైనా రాంగా?’ అన్నట్లు ఉంటుంది వారి మానసిక ధోరణి. దాంతో చాలా మంది చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోతారు. అలా పారిపోవడం కారణంగా ఎడ్యుకేషన్ లో 80 నుంచి 90 శాతం దాకా డ్రాపౌట్స్ ఉంటాయి.  

మరి కుటుంబాల నుంచి బయటకు వచ్చిన వారు ఎలా బతుకుతున్నారు? ఏమవుతున్నారు? వీళ్ళందరిని మనం ఎలాంటి దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి? గేలి చేయబడుతున్న వీరంతా మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా! అయినా ఎందుకింత వివక్ష?

నేనంటాను. మనం వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ప్రతి పాలిటిక్స్ కూడా... రాజకీయం కూడా జెండర్ చుట్టూ అల్లుకున్నదే అని గ్రహించాలి. ఈ జెండర్లను ఎప్పుడు కూడా సమాజం బైనరీ గానే చూసింది. బైనరీ అంటే ఒకటి, రెండులోనే చూసింది. ఐతే మగా లేదా ఆడ. ఈ రెండు జెండర్లు ఉన్నాయనే భావంతోనే సమాజం చూస్తోంది. చెబుతోంది. అలాగే ఫాలో అవుతోంది. దాన్ని మించిన జెండర్ అవగాహన పెంచుకోక పోవడం వల్లే మూడో జెండర్, దాని చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియడం లేదు.

ఉదాహరణకు ప్రకృతి ఉంది. ఇంద్ర ధనుస్సులోనే ఎన్నో రంగులు ఉన్నాయి. ఆ రంగుల్లో కూడా ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి. అట్లా ప్రకృతే విభిన్నంగా ఉన్నప్పుడు, ఎన్నో వర్ణాలతో కలిసి ఉన్నప్పుడు జెండర్ ఒక్కటి ఎట్లా రెండుగానే ఉంటుంది. ఆ జెండర్ కూడా ప్రకృతిలో భాగం. సెక్స్ కూడా భాగమే కదా. అది కూడా విభిన్నంగా ఉంటుంది. దానికి తార్కాణమే ఇంటర్ సెక్సువల్ పీపుల్. రెండు జననంగాలతో పుట్టిన వాళ్ళు. వీళ్ళు కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతిలోనే విభిన్నత్వం ఉంది. కానీ, మానవుడు తన వెసులుబాటు కోసం జెండర్లను రెండుగా డివైడ్ చేశాడు.  

 

 

ఎప్పుడైతే సమాజం రెండుకు పరిమితమైందో, ఐతే మగా లేకపోతే ఆడా అన్నట్టుగా మారిందో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు విభిన్న జెండర్ లో ఉన్నా ఒప్పుకోని స్థితి ఏర్పడింది. వారి మానసికత భిన్నంగా ఉన్నప్పటికీ ఐతే ఈ రెండు జెండర్లలో ఇమడాలి తప్పా తమకంటూ విభిన్నంగా బతికే వెసులుబాటు లేకుండా పోయింది. ఇక్కడే వివక్షతకు మూలం దాగి ఉంది.  

ఇదంతా నేను ముందు చెప్పినట్లు, ఆడా, మగా... బాయ్, గర్ల్...అని చూడటంతో, ప్రతిదీ ఒకటి రెండులోనే డివైడ్ చేసి చూడటంతో, ప్రకృతిలో భాగమైన మేం సమాజానికి వికృతంగా కనబడటం మొదలైంది. అవహేళన, వివక్షతకు గురవడం సాధారణంగా మారింది. చివరకు, మా సంక్షేమం కోసం ఏర్పడిన బిల్లు కూడా మాకు వ్యతిరేకంగా రూపొందడానికి కారణమైంది.

మీరన్నట్టు, ఒకటి - రెండుగా విడవడ్డ సమాజంలో ఈ థర్డ్ జెండర్లు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు? వారి పట్ల వివక్ష ఎలా ఉంది? 

వివక్ష బహుముఖాలు. బహురూపాలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మాకు చదువు లేదు. దాంతో ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు మాకు ఉపాధి ఉండదు. దాంతో నిస్సహాయంగా జీవించక తప్పదు. అనివార్యంగా రెండు విధాలుగా జీవిక పొందే స్థితిలోకి నెట్టి వేయబడినాం. అందులో ఒకటి, భిక్షాటన. రెండోది సెక్స్ వర్క్. ఈ రెండూ అనివార్యంగా చెపట్టినవే. మాకోసం ఏదీ లేనప్పుడు, ఎవరూ నిలబడనప్పుడు ఎంచుకున్న అనివార్య జీవన విధానంగా ఈ దుస్థితిని చూడాలి.

మాకంటూ ఎలాంటి హక్కులు లేనప్పుడు, ఆస్థి హక్కూ అసలే లేనప్పుడు, వంశ పారంపర్యంగా ఎటువంటి భరోసా దక్కని స్థితిలో ఈ రెండు పనులను చేపట్టిన థర్డ్ జెండర్లు ఆ కూపం నుంచి భయట పడేందుకు, అలాగే, ఆ దుస్థితిలోకి కొత్తగా మరెవరూ రాకుండా చేరకుండా ఉండేందుకు ఇటు సమాజానికి మా పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మా సంక్షేమం, అభివృద్ది చర్యల కోసం చర్యలు తీసుకోమని కోరుతున్నాం. పోరాడుతూ వస్తున్నాం.

*ఇలాంటి స్థితిలో మీ జీవన శైలి ఎలా ఉంటుంది? అసలు ఎక్కడుంటారు? మీ నివాసాలు? మీకున్న సౌకర్యాలేమిటి? రేషన్ కార్డులు, అధార్ కార్డుల సంగతి ఏమిటి?

మా నివాసం అన్నది ఒక బృందంగా ఉంటుంది. అందరం కలిసి ఒక్క చోట ఉంటాం. ఒక ఫ్యామిలీ లాగ ఉంటాం. సాధారణంగా పది మంది చొప్పున ఒక ఫ్యామిలీగా ఉంటాం. అందరం పొద్దున్నే కలిసి భిక్షాటనకు వెళతాం. వెళ్లి వచ్చింది సమానంగా పంచుకుంటాం.

భార్యా పిల్లలు అన్న భాధ్యతలేవీ లేవు గనుక దొరికింది సమానంగా పంచుకుంటాం. ఎవరికీ వారు బతకటమే మాకున్న లక్ష్యం. అంతకన్నా గొప్ప ఆలోచనలకూ స్కోప్ ఉండదు. ఒకవేళ చనిపోతే, ఉన్నది ఏదైనా శిష్యులకు ఇచ్చి పోవడమే. గురు శిష్యుల సంగతి తర్వాత చెబుతాను.

మాకంటూ తలదాచుకునేందుకు స్థిరమైన షెల్టర్ ఉండదు. పని చేసుకునేందుకు స్థిరమైన ఉపాధి ఉండదు. ఎవరూ దగ్గరకు రానీయరు. ప్రభుత్వాలూ అంతే. తాము అమలు చేసే ఏ సంక్షేమ పథకమూ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా మాకు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి.

 

 

ఆయా పథకాల లబ్ది దారులుగా ఉండాలంటే అందుకు మాకంటూ సరైన చిరునామా ఉండాలి. రేషన్ కార్డు, అధార్ కార్డులు ఉండాలి. వాటితోనే అన్ని సంక్షేమ పథకాలూ లింక్ చేయబడి ఉన్నందువల్ల మేం కనీస సహాయానికి ఇంకా అర్హులం కాలేదు. మరి, మాకు సహాయం లభించడం ఎట్లా అన్నది సమస్య.    

ఉదాహరణకు పది పన్నెండేళ్ళ వయసులో మైనర్ గా ఉన్న ఒక పిల్లాడు ఇంట్లోంటి పారి పోయి వచ్చేస్తాడు. వచ్చాక పేరు మార్చు కుంటాడు. జెండర్ మార్చుకుంటాడు. పాత పేరు, జెండర్, పాత నివాసంతో సంబంధమే ఉండని ప్రత్యేక పరిస్థితి వీళ్ళది. వారి పాత డాక్యుమెంట్స్ ఎలా ఉన్నా, వాటిని ఎలాగో సంపాదించినా అవి ఈ కొత్త జీవితానికి పనికిరావు. దాంతో సమస్య వస్తోంది.

చదువుకున్న వారి పరిస్థితీ అంతే. నేను డబుల్ పీజీ చేశాను. నా సర్టిఫికేట్లలో నా పాత పేరే ఉంటుంది. రచన అని ఉండదు. అట్లాంటప్పుడు ఆధార్ కార్డు నా పేరిట పొందడం గానీ, నేను ఎంచుకున్న జెండర్ ఐడెంటిటితో దాన్ని సాధించడం గానీ, ఆ కార్డుతో నేనన్న చోట సంక్షేమ పథకాలు పొందడం గానీ సాధ్యం కాదు.

ఆధార్ కార్డు లేనప్పుడు బ్యాంక్ అకౌంట్ గానీ, ప్యాన్ కార్డు గానీ ఎలా పొందుతాం? ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిని ప్రభుత్వానికి అర్థం చేయించి ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగా మాకంటూ పైన చెప్పిన సౌకర్యాలు పొందడం ఎంత కష్టమో ఊహించండి.

*ఇలాంటి స్థితిలో రాష్ట్రంలో లేదా హైదరాబాద్ లో అధార్ కార్డు సంపాదించుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందంటారు?

వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అంతే. ఐతే ఇక్కడో విషయం. ఇవన్నీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినవి అని మీరు గమనించాలి. మేం కుటుంబంలో లేరు. ఉన్న వాళ్ళు సమూహంగా ఉన్నా కూడా దాన్ని కుటుంబం అనలేం. ప్రభుత్వం మా ఉనికిని కుటుంబంగా గుర్తించదు.

అలాంటప్పుడు రేషన్ కార్డు రాదు. దాంతో ప్రతిదీ బయటి నుంచే కొనుక్కోవాలి. ఇలా ఎంతో భారం పడుతోంది. మనం అనుకుంటాం, వాళ్ళు భిక్షాటన చేసి బాగా సంపాదిస్తారని. రోజుకు వెయ్యు రూపాలనుకోండి. నెలకు ముప్పయ్ వేలు వస్తాయి కదా అనుకుంటారు.

 

 

ఐతే, మాకు ఇండ్లు అద్దెకు దొరకడం చాలా కష్టం. స్లమ్స్ లో దొరికినా మిగితా వాళ్ళతో పోలిస్తే మా దగ్గర అద్దె బాగా వసూలు చేస్తారు. అంతేకాదు, ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేయాల్సిందే. ఇలాంటి సమసలెన్నో ఉంటాయి. దాంతో మా ఉనికి, ఐడెంటిటికి తేలిగ్గా ప్రూఫ్ సంపాదించలేం.

ఐతే, ఆధార్ కార్డు విషయంలో ప్రభుత్వం మాకొక వెసులు బాటు ఇచ్చింది. గురువు ఉంటే పది మంది శిష్యులుంటారు కదా! అధికారులు అక్కడికే వచ్చి ఆధార్ కార్డు ఇస్తారు. అలా కొందరికి ఇచ్చారు.

*అన్నట్టు, ఈ గురువు అనే పదం వాడుతున్నారు? వీళ్ళు ఎవరు?  

మా కమ్యూనిటిలో ముఖ్యంగా హిజ్రాల్లో ఎవరైతే అందరికీ ఒక మార్గం చూపిస్తారో వారిని గురువు అని సంబోధిస్తాం. ఒక్కమాటలో మాకు బ్రతుకు దెరువు చూపేవారని అర్థం. అది బిక్షాటన కావొచ్చు, సెక్స్ వర్క్ కావొచ్చు, ఒక రకంగా మాకు పని చూపేవారే మా గురువులు. ఒక్కో గురువు దగ్గర ఏడుగురో, పది మందో ఉండటం సాధారణం. ఒక ఫ్యామిలీ వలే ఉంటారు.

ఐతే, గురువులు కూడా విడిగా, ఇండిపెండెంట్ గా బతకాలనే చూస్తారు. వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. మాలో ఒకరు వారు. కాకపోతే మార్గదర్శి. దాంతో బిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ గురువు కూడా మాతో వస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు టైంకు వచ్చి కలుస్తారు. ఇట్లా ఉంటుంది. ఇవీ మా స్థితిగతుల వివరాలు. ఇదంతా మరో ప్రపంచం. బోధపడితే గానీ మమ్మల్ని అర్థం చేసుకోలేరు.

*మంచిది. ఇక ప్రస్తుత కరోనా నేపథ్యంలో కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? మీలో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించడం జరిగిందా?

లేరండి. ఎవ్వరూ అడ్మిట్ కాలేదు. క్వారంటైన్ లో కూడా లేరు.  ఇక, ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాలంటే, అంతా దిగ్బంధనం కావడంతో మేమూ కదిలే పరిస్థితి అసలే ఉండదు. మాకు బిక్షాటన అసాధ్యం. దాంతో రోజు గడవడం చాలా కష్టం.

 

 

ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని అందుకోవలన్నా కూడా ముందు వివరించినట్లు మాకు అసాధ్యమే. రేషన్ కార్డులు లేవు కదా. అందువల్ల దాతల సహాయం ఇప్పుడు తప్పనిసరి. వారి దయతో పప్పులు, ఉప్పులు, బియ్యం కొద్ది మందికి అందిస్తున్నాం. ఒక వ్యాన్ తీసుకుని హైదరాబాద్ నగరంలో దాదాపు రెండొందల మంది ట్రాన్స్ జెందర్ల వద్దకు వెళ్లి నిత్యావసర వస్తువులు అందించాం.

మరో విషయం. మాకు అకౌంట్లు ఉంటే ప్రభుత్వం రెండు వేల రూపాయలు జమ చేస్తాం అంది. కానీ, మాలో చాలామందికి అకౌంట్లు లేనందున ఆ అవకాశమూ మాకు ఉపయోగ పడట్లేదు.  నిజానికి ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు చాలా తక్కువ. ఐనా, ఆ మొత్తం కూడా అందుకునే పరిస్థితిలేని దుస్థితి మాది.

*ఈ సమయంలో ప్రభుత్వానికి మీ అభ్యర్ధణ ఏమిటి?

ఎదో రూపంలో ఇలాంటి అత్యవసర పరిస్థితిలో మాకు నిత్యావసర వస్తువులు అందించాలన్నదే మా అభ్యర్ధణ. బిక్షాటన లేదు గనుక బతుకాలంటే అవి మాకు అందాల్సిందే. అలాగే, చాలా మందికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలున్నాయి. మందులు కూడా కావాలి. వీటన్నిటికీ  డబ్బులు కావాలి. ప్రభుత్వం ఏ మేరకు సహాయం చేసినా మంచిదే.

*డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా?

డిమాండ్ కాదు గానీ ఒక ప్రమాదకరమైన విషయం మా జీవితాలపై పొంచి ఉంది. అమీర్ పెట్ లో కొన్ని పోస్టర్స్ కనిపించాయి. ‘ఎవరైనా కొజ్జా వాళ్ళు మీ షాపుల దగ్గరకు వస్తే పోలీసులకు పోన్ చేయమని’ అందులో ఉంది. ఎందుకటా అంటే, మా వల్ల కరోనా వస్తుందట. అలాంటి పుకార్లు పుట్టడం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

పొరబాటుగా మాలో ఎవరికైనా ఈ రోగం వస్తే అందరికీ మా నుంచే వచ్చిందంటారు. అటాక్ చేసి చంపినా చంపుతారు. మాబ్ లించింగ్ చేస్తారు. ఇలాంటి పోస్టర్లు ఎవరు వేశారో పోలీసులు తక్షణం విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయక తప్పడం లేదు. ప్రతీదీ ఈజీగా తీసుకోకుండా ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం.

కరోనా ఒక సాకు. మా వల్లే తమకు ఈ వ్యాధి సోకింది అనడంతోనే ఊరుకోరు. ‘వీళ్ళను కాలనీల్లోకి రానీయకూడదు. ఉండనివ్వ కూడదు. వీళ్ళ నుంచి ఇంకేం వస్తాయో’ అన్న భావన ప్రజల్లో వ్యాపించేలా చేస్తారు. అలాంటి ధోరణి ప్రభాలకుండా చూడటం కరోనా నేపథ్యంలో అతి కీలకం అని మా అభ్యర్ధణ.

 

 

నిజానికి ఇది వివక్షకు మరో తాజా ఉదాహరణ. కరోనా క్యారియర్స్ గా ట్రాన్స్ జెండర్లను పేర్కొనడం అంటే ముందు చెప్పినట్లు, సమాజానికున్న బైనరీ దృష్టే కారణం. లింగ వివక్ష, విభిన్న సెక్స్ పట్ల ఉన్న వ్యతిరేకత అనే చెప్పాలి.

అన్నట్టు, ఇక్కడో విషయం చెప్పాలి. ముఖ్యంగా ట్రాన్స్ మెన్ లు ఇబ్బందుల గురించి కూడా చెప్పుకోవాలి. ముందే చెప్పినట్టు, వారు పుట్టుక కారణంగా స్త్రీలు. కానీ పురుషులుగా ఐడెంటిటి అవుతారు. వారి పట్ల కూడా వివక్షా ఎక్కువే. ‘మీరు మగరాయుళ్ళా’ అని హేళన చేస్తారు.

మనది పితృస్వామిక సమాజమే అయినా స్త్రీలు పురుషులుగా వ్యక్తం కావడంలో అంగీకారం లేకపోవడం కూడా వారిపట్ల హేళనకు ఒక కారణం. వారి మెల్ ఐడెంటిటి ని అంగీకరించకుండా, అవమానిస్తూ, ‘మీ అసలు స్థానం ఏమిటో చెబుతాం’ అంటూ కొందరు వారిపై రేప్ అటెంప్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇట్లా, అనేక విధాలా మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించే స్థితి ఉంది.

*మాటల్లో మీరు ‘సోషల్ డిస్టెన్స్’ అన్న పదాన్ని వ్యతిరేకించారు. మీ అభిప్రాయాన్ని వివరిస్తారా?

కరోనా సందర్భంగా వాడుకలో ఉన్న ‘సోషల్ డిస్టెన్స్’ అన్నది వివక్షతా పూరితమైన పదం. దాన్ని తిరస్కరించాలి. కరోనా నుంచి జాగ్రత్త వహించేందుకు ‘ఫిజికల్ డిస్టెన్స్’ పాటించాలి తప్పా ‘సోషల్ డిస్టెన్స్’ కాదు. ఇదివరకే అణగారిణ తరగతులను అంచులకు నెట్టేశారు.

అదే నిజానికి సోషల్ డిస్టెన్సింగ్. ఇలాంటి విపత్తుల సందర్భంలో చెలామణిలోకి వచ్చే పదం కూడా సమాజంలోని ఆధిపత్యపు పోకడను, అణిచివేత స్వభావాన్నే వ్యక్తం చేస్తుంది. ఆ పదాన్ని దూరం పెట్టాలి. మా కమ్యూనిటి పరంగానూ అది వివక్షతో చూసే పదమే. చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి గానీ ఇవన్నీ సమాజంలో వివక్షకు గురైన వారిని మరింత దూరంగా ఉంచేవే అని గ్రహించాలి.

*ఇక, మీ గురించి మరికొన్ని విషయాలు చెప్పండి. వ్యక్తిగత వివరాలు?

మాది హైదరాబాదే. నేను ఎంకాం చదివాను. ఎంఏ సోషల్ వర్క్ కూడా చేశాను. ముందే చెప్పినట్లు నేను ‘తెలంగాణ ట్రాన్స్ జెండర్ సమితి’ వ్యవస్థాపక సభ్యురాలిని. అలాగే, ‘ట్రాన్స్ విజన్’ అని ఒక యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాను.

అందులో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటి పై అవగాహన కోసం వీడియోలు చేసి పెడుతున్నాం. మాకు సంబంధించి ఆత్మగౌరవం పెంచే చారిత్రక, పురాణ ఘట్టాలు కూడా అందులో ఉంచుతున్నాం. ఈ ఛానల్ ప్రయత్నానికి లాడ్లీ అవార్డు కూడా వచ్చింది. (యూ ట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=5TuEYvXVhBc )

*చివరగా మీ భవిష్యత్ కార్యాచరణ?

ప్రస్తుతం సమాజంతో పాటు మేమూ మీలో భాగంగా కరోనా విపత్తు నుంచి బైట పడాలి. మీ అందరి సహకారంతో ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల సాధన కోసం మరింత పెద్ద ఎత్తున పోరాడాల్సి ఉన్నది.

ప్రభుత్వం ఆల్రెడీ ‘ట్రాన్స్ చట్టం’ రూపొందించింది. రూల్స్ తయారవుతున్నాయి కూడా. అవి ఎలా మాకు వ్యతిరకంగా ఉండబోతున్నాయో చూచాయగా వివరించాను కాబట్టి ప్రభుత్వ వ్యవస్థపై ఒత్తిడి తేవడానికి మేం శాయశక్తులా ప్రయత్నించాలి. లాబీయింగ్ చేయడం, ప్రతిపక్షాలను కూడగట్టి ఒత్తిడి తేవడం, కోర్టులకు వెళ్ళడం, ఈ పనుల్లో ఉన్నాం.

 

 

ఇప్పటికే సమిష్టి సహకారంతో మా జీవితాల్లో మార్పుకోసం ట్రాన్స్ జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. అందులో సంధ్య, సజయ, దేవి వంటి స్వచ్ఛంద సేవలో కృషి చేస్తున్న నాయకులెందరో ఉన్నారు. వారంతా మాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ హక్కుల సాధనలో భాగమయ్యారు. పోరాడుతున్నారు.

తక్షణం, దీర్ఘకాలికంగా ఉపకరించే అన్ని విషయాల్లో మేం పౌర సమాజం సహకారాన్ని కోరుతున్నాం. ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు అందిస్తారని, ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. (సహాయానికి ఈ లింక్ క్లిక్ చేయండి  http://lgbtq.co.in/covid-19-support-for-transgender-community-hyderabad/?fbclid=IwAR3SNAHNxM6fN_uz3iw54JHMkyrDL2HEMEzKhIk_ZhszOfjTC8Q38X5syt8 )

ఇంటర్వ్యూ: కందుకూరి రమేష్ బాబు

click me!