మోదీ ముద్దు.. భారత్ వద్దు: ఆపిల్‌పై ట్రంప్ హెచ్చరిక..

By Sandra Ashok Kumar  |  First Published May 16, 2020, 10:36 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాయే వేరు. ఆయన చెప్పిందే వేదం.. కరోనా నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావిస్తున్న టెక్ దిగ్గజం ‘ఆపిల్‘ వంటి సంస్థలు తిరిగి అమెరికాలోనే ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని, లేదంటే పన్నుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.


వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నఅగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంకుచిత భావాలు.. ప్రపంచీకరణతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశల్నీ చిదిమేస్తున్నాయి. స్వదేశీ రక్షణ పేరుతో ఆపత్కాల స్నేహ సూత్రాలను సైతం మరిచి ప్రవర్తిస్తున్న ట్రంప్‌.. పన్నులను ఎక్కుపెడుతూ అమెరికాయేతర దేశాల ప్రయోజనాలను కాలరాస్తున్నారు.

ఇందుకు చైనా నుంచి భారత్‌సహా ఇతర దేశాలకు వెళ్లిపోతున్న అమెరికా సంస్థలకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రేకులు వేయడమే నిదర్శనం. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అమెరికాతోపాటు పలు దేశాల సంస్థలు చైనా నుంచి బయటకు రావాలని చూస్తున్న విషయం తెలిసిందే. 

Latest Videos

ఈ క్రమంలోనే అమెరికా కంపెనీలు తిరిగి స్వదేశానికే రావాలని, లేనిపక్షంలో కొత్తకొత్త పన్నులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ హెచ్చరించారు. ఇది చైనా నుంచి భారత్‌కు ఆపిల్‌ రాకను అడ్డుకుంటున్నది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్‌.. చైనా నుంచి భారత్‌, ఐర్లాండ్‌కు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చూస్తున్న సంగతి కూడా తెలిసిందే. 

‘ఇండియాకు వెళ్తామని ఆపిల్‌ చెప్తున్నది. ఇదే జరిగితే ఆ సంస్థకు పన్ను పోటు తప్పదు’ అని అయితే ఫాక్స్‌ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ అన్నారు. అమెరికాకు కాకుండా చైనా నుంచి మరే దేశానికి తమ ప్లాంట్లను తరలించినా.. వాటికి కొత్త పన్ను విధానం ఉంటుందని తేల్చేశారు. 

also read కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ స్టార్టప్ సంస్థ...

అలాగే అమెరికాకు వచ్చే సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయనీ ట్రంప్ సెలవిచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా సంస్థలు స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, అమెరికన్‌ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాకాక వేరే దేశాలకు వెళ్తామంటే ఊరుకోబోని ఆయన హెచ్చరించారు. 

చైనా నుంచి బయటకు వస్తున్న విదేశీ సంస్థలను ఆకట్టుకోవాలన్న భారత్‌ ఆశల్ని ట్రంప్‌ ఆదిలోనే చిదిమేస్తున్నారు. దీంతో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఊతమిస్తూ మోదీ సర్కార్ సిద్ధం చేస్తున్న ప్రణాళికలు అయోమయంలో పడ్డాయి. నిజానికి కరోనా వైరస్‌ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాకు భారత్‌ అండగా నిలిచింది. 

ఈ మహమ్మారి నియంత్రణకు వినియోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధాన్ని భారత్ సరఫరా చేసింది. అయినా ట్రంప్‌  విశ్వాసాన్ని చూపలేకపోతున్నారు. ఒడ్డుకు చేరాక తెప్ప తగలేసే దుర్నీతినే అనుసరిస్తున్నారు. తనకు నష్టం వస్తుందనిపిస్తే చైనా, భారత్‌ అన్న తేడాలు ఉండవని, అంతా ప్రత్యర్థులేనని అహంకారం ప్రదర్శిస్తున్నారు.

తమ దేశం నుంచి భారత్‌, ఇతర సరిహద్దు దేశాలకు వెళ్తున్న సంస్థలను అడ్డుకునేందుకు చైనా కుట్రలకు తెరతీసింది. దేశ సరిహద్దుల్లో సైన్యం ద్వారా దాడులు, దురాక్రమణలకు తెగబడుతున్నది. లడఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో గత మూడు వారాలుగా నెలకొన్న ఉద్రిక్తతలు ఇందుకు నిదర్శనం కానున్నాయి.

నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్‌, మలేషియా దేశాల సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. కరోనా నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు కనీసం వెయ్యి సంస్థలు వెళ్లిపోతున్నాయన్న అంచనాలతో చైనా ఈ కుట్రలకు పాల్పడుతున్నది. పొరుగు దేశాల్లో అలజడులు చెలరేగితే తమ దేశం నుంచి ఏ సంస్థా వెళ్లదన్న దురాలోచనతో చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నది.
 

click me!