ఆన్ లైన్ సేల్స్ పై నిషేధమా? క్లారిటీ లేని ఎన్నో అనుమానాలు...

By Sandra Ashok Kumar  |  First Published Apr 20, 2020, 11:23 AM IST

సడలింపుల ప్రారంభానికి ఒకరోజు ముందు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ పంపిణీ విషయమై ఈ-కామర్స్ సంస్థలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైలర్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
 


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మార్కెట్‌ జోరందుకున్నప్పటి నుంచి సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ కళ తప్పింది. ఈ-కామర్స్‌ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు.. రిటైలర్ల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు మొబైల్‌ ఫోన్స్‌, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర నాన్‌-ఎసెన్షియల్‌ అమ్మకాలకు అనుమతి ఇవ్వొద్దని, కేంద్రంపై రిటైలర్లు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. 

వారిని అనుమతిస్తే.. తమ షాపులూ తెరుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని స్థానిక వ్యాపారులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలకు కేంద్రం చెక్‌ పెట్టింది. లాక్‌డౌన్‌ నుంచి అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు వెసులుబాటు లభించిందనుకున్న ఈ-కామర్స్‌ సంస్థలకు కళ్లెం వేసింది.

Latest Videos

పప్పుదినుసులు తదితర ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి అత్యవసరాల సేవలు మినహా మిగతా వాటిని ఆపేయాలని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ తదితర ఆన్‌లైన్‌ సంస్థలను మోదీ సర్కార్ ఆదేశించింది. 

ఈ నెల 20 నుంచి మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, వాషింగ్‌ మెషీన్లు, రెడిమేడ్‌ దుస్తులు తదితర నాన్‌-ఎసెన్షియల్‌ సేల్స్‌ను కూడా ఈ-కామర్స్‌ సంస్థలు జరుపవచ్చని 15వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలన్నీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసేసుకున్నాయి. 

ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టం చేశారు. ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగించే వాహనాలు.. అవసరమైన అనుమతులతో మాత్రమే నడుస్తాయని తాజా ఆదేశంలో ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ నిర్ణయంపై ఎందుకు యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ బదులిస్తూ, వైరస్‌ ఉధృతి క్రమేణా పెరుగుతున్నదని, పరిస్థితులపై రోజువారీ సమీక్షలు జరుపాల్సి వస్తున్నదని తెలిపారు. కరోనా తీవ్రతతో నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తున్నదని చెప్పారు. 

also read అన్నీ పేటీఎంతోనే: స్టే ఎట్ హోం ఎస్సెన్షియల్ పేమెంట్స్

అందుకే ఈ-కామర్స్‌ నాన్‌-ఎసెన్షియల్‌ సేల్స్‌ లాక్‌డౌన్‌కు విఘాతమని భావించి గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. ఈ 20 నుంచి కరోనా ప్రభావం స్వల్పంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలించి అవసరమైన కార్యకలాపాలకు అనుమతులు ఇస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. 

అమెజాన్‌ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ ‘ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా అత్యవసరం కాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించడం అటు వినియోగదారులను, ఇటు చిరు వ్యాపారులను నిరాశపరిచింది. ఈ నిర్ణయం తయారీదారులనూ నిరాశకు గురిచేసింది’ అని వ్యాఖ్యానించారు. 

స్నాప్ డీల్ ప్రతినిధి మాట్లాడుతూ ‘ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సేవలు అందిస్తాం. ప్రజల అవసరాలను తీరుస్తాం. ఈ కష్టకాలంలో నిత్యావసరాలను కస్టమర్లకు చేరవేయడంలో మా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు’ అని పేర్కొన్నారు.

గోద్రెజ్‌ అప్లియన్సెస్‌ వ్యాపారాధిపతి కమల్‌ నంది ప్రతిస్పందిస్తూ ‘మార్చిలో 60 శాతం, ఏప్రిల్‌లో 100 శాతం ఆదాయాన్ని కోల్పోయాం. వేసవిలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు బాగా డిమాండ్‌ ఉంటుంది. ఈ-కామర్స్‌ వ్యాపారంపైనా ఆంక్షలు.. ఈ రంగాన్ని మరింతగా కుంగదీస్తున్నాయి’ అని చెప్పారు. 

అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రతినిధి మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. దేశీయ వర్తకుల సెంటిమెంట్‌కు విలువనిచ్చారు. సంప్రదాయ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించారు’ అని తెలిపారు. 

‘కిరాణా దుకాణాలను తెరిచే ఉంచాలి. ప్రజల రోజువారీ అవసరాలను ఇవే ఎక్కువగా తీరుస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోం డెలివరీ చాలామంది వినియోగదారులకు నిజంగా కలిసొచ్చే అంశం’ అని భారతీయ రిటైలర్ల సంఘం పేర్కొన్నది.

click me!