లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐటీ రంగాన్ని ఆదుకోవాలని నాస్కామ్ ప్రభుత్వాన్ని కోరింది. బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వడానికి అనుమతించాలని, తద్వారా బీపీఎం, బీసీసీల్లో ఉద్యోగాల కోత లేకుండా చూడచ్చని పేర్కొంది.
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రం అమలులోకి తెచ్చిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ఐటీ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) అభ్యర్థించింది.
బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనాలు మాత్రమే ఇవ్వడానికి అనుమతించడం ద్వారా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం), గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగాల కోత పడకుండా నివారించవచ్చని సూచించింది.
లాక్‌డౌన్ వల్ల ఈ విభాగాలు 70 శాతం మంది ఉద్యోగుల సేవలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాయని నాస్‌కామ్ తెలిపింది. 20 శాతం మందికి ప్రాజెక్టులు లేవనుకుంటే, వీరందరికీ పూర్తి వేతనాలు ఇవ్వడం భారమవుతుందని పేర్కొంది.
అందువల్ల చట్టబద్ద చెల్లింపులతో పాటు కనీస వేతనాలకు అనుమతినిస్తే, బీపీఎం, జీసీసీ విభాగాల్లో ఉద్యోగ కోతలు లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వానికి వివరించింది. కంపెనీ జాబితాలో ఉద్యోగిగా పేరున్నా, లాక్‌డౌన్ కాలానికి వేతనం లేకుండా కొనసాగించేలా బ్రిటన్ తరహా పథకం ప్రవేశ పెట్టాలని కోరింది.
also read వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్...
ఈ సమయంలో ప్రభుత్వమే ఉద్యోగికి 50 శాతం వేతనం చెల్లిస్తుంది. ఈ నెల 15 లోగా ప్రభుత్వం విధానం నిర్ణయం ప్రకటిస్తే బీపీఎం, జీఐసీ విభాగాల్లో బెంచికి పరిమితమైన ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోరని నాస్కామ్ వెల్లడించింది.
వచ్చే మూడు నెలల పాటు పీఎఫ్ వాటాను సంస్థలు చెల్లించకుండా ఇచ్చిన నిబంధనల్లో 100 ఉద్యోగులు, 90 శాతం మంది వేతనం రూ.15000లోపు ఉండటం అనే షరతులు తొలగించి, అందరికీ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
అమెరికాకు చెందిన ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజంట్ 2020 వృద్ధి అంచనాలను ఉపసంహరించుకుంది. ఈ సంస్థకు భారత్‌లో సుమారు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు.
ఐటీ, బీపీఎం పరిశ్రమలో 40 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 10 లక్షల మంది ఫైనాన్స్, అక్కౌంటింగ్, పేరోల్, ప్రోక్యూర్ మెంట్, హెచ్ఆర్, సప్లయ్ చెయిన్, లీగల్ తదితర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
జీఐసీ విభాగాల్లోనూ తమ ప్రధాన సంస్థలకు ఇటువంటి సర్వీసులే అందిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యం కుప్పకూలితే, ఈ రంగాలకు ఉన్న డిమాండ్ పడిపోతుంది. కనుక సుమారు నాలుగు లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది.