లాక్ డౌన్ వల్ల మన దేశీయ ఆర్థిక వ్యవస్థ రోజుకు రూ.35 వేల కోట్ల చొప్పున.. 21 రోజుల్లోనే రూ.7.44 లక్షల కోట్ల మేరకు కునారిల్లుతుందని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ హెచ్చరించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. అది ప్రాణ నష్టమే కాదూ.. ఆర్థికంగానూ భారీగానే నష్టాన్ని కలిగిస్తున్నది. ఈ మహమ్మారి ధాటికి దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ నడుస్తుండగా, దీనివల్ల జీడీపీకి కోలుకోలేని పెద్ద దెబ్బే తగులుతున్నది.
రోజుకు రూ.35,400 కోట్లు (సుమారు 4.64 బిలియన్ డాలర్లు) భారత్ నష్టపోతున్నదని అక్యూట్ రేటింగ్స్ అండ్ రిసెర్చ్ లిమిటెడ్ గురువారం అంచనా వేసింది. మొత్తం ఈ 21 రోజుల లాక్‌డౌన్ కాలానికే రూ.7.44 లక్షల కోట్ల (సుమారు 98 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లవచ్చునని చెప్పింది.
కరోనా దెబ్బకు మునుపెన్నడూలేని విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వ్యాపారాలు, పారిశ్రామికోత్పత్తి, రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థకు పెను నష్టం వచ్చిపడిందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అక్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పరిస్థితి భారత్‌తోపాటు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిపై ఉందన్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-జూన్ మధ్య జీడీపీపై కరోనా ప్రభావం ఉంటుందని, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంపైనా కనిపిస్తుందని అంచనా వేసింది.
మొత్తానికి ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతం అవుతున్న భారత్‌ను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. కరోనా వైరస్ ఉధృతి వల్ల ఈ ఏడాది ప్రపంచ జీడీపీ దాదాపు ఒక శాతం పడిపోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
ఇంతకుముందు 2020లో గ్లోబల్ జీడీపీ 2.5 శాతంగా నమోదు కావచ్చని పేర్కొన్నది. అయితే వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆ అంచనాను ఇప్పుడు 0.9 శాతం తగ్గించింది. కానీ ప్రపంచ జీడీపీ 1.6 శాతానికి పరిమితం చేసింది.
అంతర్జాతీయ వాణిజ్యాన్ని, రవాణా వ్యవస్థను ఈ విశ్వమారి దారుణంగా దెబ్బతీసిందని వెల్లడించింది. 2009లో ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో గ్లోబల్ జీడీపీ 1.7 శాతంగా ఉండగా, ఇప్పుడు అంతకంటే తక్కువకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తుండటం గమనార్హం.
లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల దేశీయంగా మరోవైపు వాయు కాలుష్యాన్ని తగ్గింది. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి వాయునాణ్యతలో గణనీయ మార్పు కనిపించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) తెలిపింది. మార్చి 29 నాటికి దేశవ్యాప్తంగా 91 నగరాల్లో పరిస్థితి మెరుగైందని వెల్లడించింది.
సాధారణంగా రవాణా, పరిశ్రమలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లు, నిర్మాణ పనులు, వ్యర్థాల కాల్చివేత, రోడ్లపై ఉండే దుమ్ము వంటివి గాలి కాలుష్యానికి ప్రధాన కారకాలు. జనతా కర్ఫ్యూ, 21 రోజుల లాక్‌డౌన్ వల్ల అత్యవసర విభాగాలు మినహా అన్నీ మూతపడ్డాయి.
దీంతో గాలిలోకి కలుషితం కావడం తగ్గిపోయి, వాయు నాణ్యత పెరిగిందని పీసీబీ వెల్లడించింది. జనతా కర్ఫ్యూకు ముందురోజు (మార్చి 21న) దేశవ్యాప్తంగా 54 నగరాల్లో మాత్రమే వాయు నాణ్యత ‘బాగుంది, సంతృప్తికరం’ స్థాయిల్లో ఉండేది. మార్చి 29 నాటికి నగరాల సంఖ్య 91కి పెరిగింది.
ఇందులో 61 నగరాల్లో గాలి నాణ్యత ‘సంతృప్తికరం’గా ఉండగా, 30 నగరాల్లో ‘బాగుంది’ స్థాయికి చేరింది. ముఖ్యంగా జనతా కర్ఫ్యూకు ముందు 9 నగరాల్లో గాలికాలుష్యం తీవ్రంగా ఉండగా, ప్రస్తుతం అవన్నీ మెరుగుపడ్డాయని పీసీబీ వెల్లడించింది.