లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీడీపీపై రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం...

By Sandra Ashok Kumar  |  First Published May 4, 2020, 1:09 PM IST

కరోనా ‘లాక్ డౌన్’ వల్ల భారతదేశంలో జీడీపీపై ప్రతి రోజూ రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇండియాలోని స్టార్టప్ సంస్థల్లో 31 శాతం (246కి పైగా స్టార్టప్‌లు లేఆఫ్స్ ప్రకటించాయి. ఎంఎస్ఎంఈ రంగం భారీగా దెబ్బ తిన్నది. 


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగదీస్తున్నది. దీని ధాటికి గత 40 రోజులుగా సాగిన లాక్‌డౌన్‌ పీరియడ్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.24 లక్షల కోట్ల (320 బిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లినట్టు ఓ నివేదిక అంచనా వేసింది.

దీని ప్రకారం ప్రతి రోజు రూ.60,000 కోట్ల (800 కోట్ల డాలర్లు) నష్టం వాటిల్లినట్టు స్పష్టమవుతున్నదని డేటా ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. లాక్‌డౌన్‌ ప్రభావం ట్రావెల్‌, మొబిలిటీ రంగాలపై తీవ్రంగా ఉన్నదని తెలిపింది.

Latest Videos

దీని ఫలితంగా ఓయో, ఓలా, మేక్‌మైట్రిప్‌ లాంటి సంస్థల ఆదాయం గణనీయంగా క్షీణించిందని ‘డాటాల్యాబ్స్‌' నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం కూడా కరోనా మహమ్మారి దాడితో తల్లడిల్లుతున్నది. 

ఎంఎస్ఎంఈ రంగంలోని అనేక చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని పరిశ్రమలు అతితక్కువ మంది కార్మికులతో పనిచేస్తున్నాయి. ఫలితంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆదాయానికి భారీగా గండిపడినట్టు కరోనా స్టార్టప్ ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది.

also read  ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌కు కరోనా దెబ్బ...ఆచితూచి వ్యూహాత్మకంగా ముందుకు..

మరికొన్ని రంగాల్లోనూ కరోనా వైరస్‌ మృత్యుఘంటికలు మోగించగా.. సరఫరాల వ్యవస్థలో ఏర్పడిన అవాంతరాలతో తయారీరంగం తీవ్రంగా నష్టపోతున్నది. అయితే ప్రస్తుతం వినియోగదారుల స్వభావంలో వచ్చిన మార్పులు కొన్ని రంగాల ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. 

హైపర్‌లోకల్‌ డెలివరీలు, మీడియా అండ్‌ కంటెంట్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి సేవలతోపాటు ఇతర టెక్‌ అప్లికేషన్లకు అకస్మాత్తుగా డిమాండ్‌ పెరుగడమే ఇందుకు కారణం అని డేటా ల్యాబ్స్ తెలిపింది. దీని ఫలితంగా మున్ముందు కొన్ని దేశీయ స్టార్టప్‌ల ఆదాయం మరింత పెరిగే అవకాశమున్నదని తెలుస్తోంది.

కరోనా ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని డేటా ల్యాబ్స్ అంచనా వేసింది. భారతదేశంలోని 31 శాతం స్టార్టప్ సంస్థలు లేఆఫ్ ఎంచుకుని వ్యయాలు తగ్గించుకునే పనిలో పడ్డాయి. 

2019 ఆర్థిక సంవత్సరంలో భారత స్టార్టప్ సంస్థల్లో పని చేసిన ఉద్యోగులకు 1.25 బిలియన్ల డాలర్ల లబ్ధి చేకూరింది. 246కి పైగా భారత స్టార్టప్ సంస్థలు లేఆఫ్ ప్రకటించాయి. 278 స్టార్టప్ సంస్థలు నియామకాల్లో కోత విధించడం మొదలు పెట్టాయి

భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత మరో దఫా కరోనా మహమ్మారి దాడి చేయనున్నదని పేర్కొన్నది డేటా ల్యాబ్స్. దీనివల్ల దేశీయ జీడీపీ మరింత పతనం కానున్నదని అంచనా వేసింది.
 

click me!