చైనాకు మరో ఎదురు దెబ్బ... వెయ్యి కంపెనీలు బయటకు?

By Sandra Ashok Kumar  |  First Published May 6, 2020, 11:35 AM IST

పులిమీద పుట్రలా కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనాకు మరో ఎదురు దెబ్బ తగలనున్నది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన పలు సంస్థలు చైనా నుంచి ఉత్పాదక యూనిట్లను తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కసరత్తు చేపట్టింది. పారిశ్రామిక అవసరాల కోసం దేశవ్యాప్తంగా 4,61,589 హెక్టార్ల భూమితో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.  
 


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా కొనసాగుతున్న డ్రాగన్‌కు సుమారు వెయ్యి కంపెనీలు గుడ్‌బై పలుకబోతున్నాయి. వీటిలో అమెరికా, జర్మనీ తదితర ఐరోపా దేశాలకు చెందిన మొబైల్‌, ఎలక్ట్రిక్‌, సింథటిక్‌ ఫ్యాబ్రిక్స్‌, మెడికల్‌ పరికరాలు, టెక్స్‌టైల్‌ రంగాల సంస్థలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఈ మహమ్మారికి కారణమైన చైనాపై పాశ్చాత్య దేశాలు ఆగ్రహాంతో ఉన్నాయి. ఆయా దేశాల్లో ఉన్న తమ సంస్థలను అక్కడి నుంచి విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలు సైతం ప్రకటిస్తున్నాయి. 

Latest Videos

ఈ వెయ్యి సంస్థల్లో 300 కంపెనీలు భారత్‌లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రపంచ సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంచుకుంటున్నాయని, ఇక్కడ అన్ని అనుమతులు వెంటవెంటనే లభించడం, పెట్టుబడులను ఆకట్టుకోవడానికి మోదీ సర్కార్‌ తీసుకుంటున్న పాలసీ నిర్ణయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 

‘చైనాకు గుడ్‌బై పలుకబోతున్న వెయ్యి కంపెనీల్లో కనీసం 300 సంస్థల్నైనా భారత్‌కు రప్పించాలనుకుంటున్నాం.  ముఖ్యం గా దక్షిణ కొరియాకు చెందిన రెండు దిగ్గజాలు చైనా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. వీటిలో పోస్కో, హ్యుండాయ్‌ స్టీల్‌ ఉన్నాయి. అలాగే ఆపిల్‌ ఫోన్లను తయారు చేసే విస్ట్రన్‌ కార్పొరేషన్‌, పెగట్రాన్‌ కూడా చైనా నుంచి బయటకొస్తున్నాయి’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

also read 

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ తీసుకున్న కీలక నిర్ణయంతో విదేశీ కంపెనీలు భారత్‌కు బారులు తీరుతున్నాయి. గత సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్నును 25.17 శాతానికి తగ్గిస్తూ  తీసుకున్న నిర్ణయంతో విదేశీ కంపెనీలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. అలాగే నూతన తయారీ సంస్థలపై పన్ను 17 శాతం మాత్రమే విధిస్తున్నట్లు ప్రకటన కూడా సానుకూల అంశమే. 

చైనా నుంచి వైదొలుగుతున్న సంస్థలపై భారత్‌తోపాటు విదేశాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. తమ దేశంలో ప్లాంట్లు పెట్టండి రాయితీలు కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. వీటిలో వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా తదితర దేశాలు ఉన్నాయి. 

ఇక చైనా నుంచి వచ్చే సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 4,61,589 హెక్టార్ల భూమిని అనువైనదిగా గుర్తించి, ఈ స్థలాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఉన్న 1.15 లక్షల హెక్టార్ల ఇండస్ట్రీయల్‌ క్లస్టర్‌ కూడా ఉన్నది. 

అయితే, ఈ భూసేకరణకు సంబంధించి స్పందించడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి నిరాకరించారు. భూమితోపాటు నీరు, విద్యుత్‌, సరైన రవాణా వసతులు ఉన్నప్పుడే పెట్టుబడులు ఆకట్టుకోవడంతోపాటు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, ఎలక్ట్రికల్‌, ఫార్మా, మెడికల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, సౌర విద్యుత్‌ పరికరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కెమికల్‌, టెక్స్‌టైల్‌ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

click me!