కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న రంగాల్లో రిటైల్ రంగం కూడా ఉంది. నిత్యావసర సరుకుల బిజినెస్ అయినా దాదాపు 40 రోజులు దుకాణాలు మూసివేయడంతో రిటైల్ రంగానికి రూ.5.50 లక్షల నష్టం వాటిల్లిందని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ (కెయిట్) తెలిపింది. ప్రభుత్వం ఆదుకోకుంటే రిటైల్ రంగం కోలుకోవడం కష్టమేనని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల రిటైల్ రంగానికి ఇంతకు ముందు ఎన్నడూ లేని నష్టాలు వస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్కొంది. ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 30 వరకు విధించిన లాక్‌డౌన్ వల్ల రిటైల్ వ్యాపార రంగం రూ.5.5 లక్షల కోట్ల మేరకు నష్ట పోయిందని వెల్లడించింది. మనదేశంలోని 20 శాతం మంది రిటైలర్లు షాపులను శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఉందని ఆందోళన ప్రకటించింది.
రిటైల్ రంగాన్ని బతికించడానికి వీలైనంత వెంటనే ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఏఐటీ లేఖ రాసింది. ఏడు కోట్ల రిటైల్ వ్యాపారులు ఉన్న 40 వేల వ్యాపార సంఘాలతో సీఏఐటీని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ రిటైల్‌రంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టిందని, ప్రభుత్వ సాయం లేకుండా ఈ నష్టాల నుంచి బయటపడటం అసాధ్యమని స్పష్టం చేసింది.
‘మనదేశంలో ఏడు కోట్ల రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీరిలో 1.5 కోట్ల మంది ట్రేడర్లు మరికొన్ని నెలల్లోపే తమ షాపులను మూసుకునే పరిస్థితులు ఉన్నాయి. వీరిపై ఆధారపడి వ్యాపారం చేసే మరో 75 లక్షల మంది వ్యాపారులు షటర్లకు తాళాలు వేయడం తప్పకపోవచ్చు’’ అని సీఏఐటీ నేత ఒకరు వివరించారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తాము వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
also read చైనాకు మరో ఎదురు దెబ్బ... వెయ్యి కంపెనీలు బయటకు?
రిటైల్ సెక్టార్‌ను నిలబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని సీఏఐటీకి చెందిన మరో నాయకుడు విమర్శించారు. ‘నాన్ కార్పొరేట్ సెక్టార్ బాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ సాయం ప్రకటించలేదు. మనదేశం జీడీపీలో రిటైల్ సెక్టార్ వాటా 40 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు ఉద్యోగుల్లో మూడింట ఒకవంతు రిటైల్ సెక్టార్‌లోనే పనిచేస్తారు. వర్కర్లు అందరికీ తప్పనిసరిగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ బ్యాంకులు మాత్రం యథావిధిగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. బిల్డింగ్ ఓనర్లు కిరాయి కట్టాలంటూ బలవంతం చేస్తున్నారు’ అని ఆయన వివరించారు.
లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ లిక్కర్ షాపులు తెరవడాన్ని సీఏఐటీ తప్పుబట్టింది. 40 రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌తో తగ్గిన కరోనా కేసులు మద్యం దుకాణాలను తెరవడం వల్ల మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వల్ల షాపులను మూసేయడం, వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం వల్ల గ్లోబల్‌గా రిటైల్ సెక్టార్‌కు ఈ ఏడాది 2.1 లక్షల డాలర్ల నష్టం వస్తుందని తాజా అధ్యయనం తెలిపింది ఈ నష్టం నుంచి బయటపడటానికి రిటైలర్లకు కనీసం నాలుగేళ్లు పడుతుందని న్యూ ఫారెస్టర్ రిపోర్ట్ తెలిపింది.
ముఖ్యంగా భారత్, జపాన్ దేశాల రిటైలర్లు తీవ్రంగా నష్టపోతారని న్యూ ఫారెస్టర్ నివేదిక వెల్లడించింది. వైరస్ ప్రభావం మరో ఏడు నెలల వరకు ఉండొచ్చని, ఆ తరువాత కూడా అమ్మకాలు ఆశించినట్టుగా ఉండవని స్పష్టం చేసింది. నాన్–ఎసెన్షియల్ వస్తువుల అమ్మకాలు మరీ తక్కువగా ఉంటాయని ఫారెస్టర్ వివరించింది