లాక్ డౌన్‌తో ఆటోమొబైల్ రంగం విలవిల: రూ.1.25 లక్షల కోట్ల నష్టం

By Sandra Ashok Kumar  |  First Published May 2, 2020, 11:23 AM IST

లాక్‌డౌన్‌తో వాహన రంగం విలవిలలాడింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల విక్రయాలు లేక ఆటోమొబైల్ సంస్థలు ఉసూరుమన్నాయి. ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ అంచనా ప్రకారం ఆ రంగానికి ఏప్రిల్ నెలలో రూ.1.23 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పన్నులు, సుంకాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి కూడా కోత పడింది.


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలంతో పూర్తిగా కుదేలైన వాటిలో ఆటోమొబైల్‌ రంగం ఒకటి. లాక్‌డౌన్‌ వల్ల దేశీయ వాహన రంగానికి రూ.1.25 లక్షల కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లవచ్చని అంచనా. ఎందుకంటే, లాక్‌డౌన్‌తో ఆటో పరిశ్రమకు రోజుకు రూ.2,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) ఇప్పటికే ప్రకటించింది.

ఈ నెల మూడవ తేదీతో ముగియాల్సిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు  అంటే ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించారు. మొత్తం 54 రోజుల లాక్‌డౌన్‌లో ఈ పరిశ్రమ నష్టం సుమారు రూ.1.25 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.

Latest Videos

లాక్ డౌన్ వల్ల ఆటోమొబైల్ రంగానికి నష్టం వాటిల్లడమే కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కొత్తగా వాహనాల కొనుగోలుపై కేంద్రం విధించే జీఎస్టీ, రిజిస్ట్రేషన్‌ ట్యాక్స్‌, మోటార్‌ బీమాపై జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ వినియోగంపై ఎక్సైజ్‌ సుంకం కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. 

లాక్‌డౌన్‌తో వాహన తయారీదారులు, వాటిపై ఆధారపడిన విడిభాగాల కంపెనీల ఉత్పాదక ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. తత్ఫలితంగా కేంద్రానికి ఈ రంగం నుంచి వసూలయ్యే జీఎస్టీ ఆదాయంలో రూ.38,000 కోట్ల వరకు గండిపడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. రాష్ట్రాలు సైతం రూ.19వేల కోట్ల మేర పన్ను ఆదాయం కోల్పోవచ్చని సమాచారం.  

కొన్ని ప్రాంతాల్లోని వాహన ప్లాంట్లలో ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. కానీ, కంపెనీలు మాత్రం కార్యకలాపాలను ప్రారంభించడానికి వెనకాడుతున్నాయి. విడిభాగాల కొరత, షోరూమ్‌లు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడం, ఇప్పటికే డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోవడం, కొనుగోలుకు కస్టమర్లు ముందుకు రాకపోవడం ఇందుకు కారణాలు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశాకే అన్ని విభాగాలను ఏకకాలంలో పునఃప్రారంభించే యోచనలో ఆటో కంపెనీలున్నాయని తెలుస్తున్నది. ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల్లో కార్యకలాపాలను ఒకేసారి ప్రారంభించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రంగ అసోసియేషన్లు సియామ్‌, ఫాడా, ఏసీఎంఏ కోరాయి. 

కరోనా దెబ్బతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 50 శాతం పైగా క్షీణించవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొత్తానికి ఆటో సేల్స్‌ 2010 నాటి కనిష్ఠ స్థాయికి పడిపోవచ్చని అంచనా. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హ్యుండాయ్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌, స్కోడా ఇండియా తదితర ఆటో కంపెనీలు తమ వాహనాల విక్రయాల కోసం డిజిటల్‌ బాటను ఎంచుకున్నాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక వాహనాన్ని డెలివరీ చేస్తామంటున్నాయి. మిగిలిన సంస్థలు కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరించే అవకాశం ఉంది. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం తప్పనిసరిగా మారింది. దాంతో కస్టమర్ల కొనుగోళ్ల ట్రెండ్స్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. తత్ఫలితంగా వాహన కంపెనీలకు డిజిటల్‌ మార్గంలో విక్రయాలు ప్రాథమిక అవసరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. 

click me!