అది అంత ఈజీ కాదు.. : ఆర్‌సీ భార్గవ

By Sandra Ashok KumarFirst Published Jul 6, 2020, 11:56 AM IST
Highlights

భారతదేశాన్ని తయారీ రంగంలో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంపొందించడం సవాలేనని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. చిత్తశుద్ధితో పని చేస్తే విజయం సాధించగలమన్నారు.
 

న్యూఢిల్లీ: భారతదేశాన్ని తయారీ రంగంలో అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యం గలదిగా తీర్చి దిద్దడం, సామాజిక న్యాయంతో వర్థిల్లే సమాజం నిర్మించడం చాలా కష్టమని మారుతి సుజుకీ చైర్మన్‌ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. పారిశ్రామికంగా పోటీ సామర్థ్యం పెంచుకునే విషయంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏడు దశాబ్దాల సమయం వృధా చేయడం వల్ల సమస్యలు సంక్లిష్టమయ్యాయని ఆయన విశ్లేషించారు.

సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాసం పెరుగుతూనే ఉన్నదని, దేశంలో నెలకొన్న విభిన్న పరిస్థితులు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా లేవని ‘‘పోటీ సామర్థ్యం సాధన : భారత్‌కు ఒక సాధకుని గైడ్‌’’  పేరిట రచించిన పుస్తకంలో  ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం జీడీపీలో తయారీరంగం వాటా కేవలం 15 శాతంగా ఉండడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

దీని వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించడం ఒక సుదూర స్వప్నంగానే ఉన్నదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో పాటు చిత్తశుద్ధితో దేశాభివృద్ధి కోసం కలసికట్టుగా పని చేసినట్టయితే పోటీ సామర్థ్యం సాధించడం ఇప్పటికీ సాధ్యమేనని భార్గవ అభిప్రాయపడ్డారు.

పోటీ సామర్థ్యం పెంచుకోవడంలో దేశంలోని ప్రతీ ఒక్కరి పాత్ర కీలకమేనని, పౌరులందరూ తమ శక్తిసామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించాల్సి ఉంటుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అలాగే రాజకీయ, ప్రభుత్వ, అధికార, న్యాయ, పారిశ్రామిక వ్యవస్థలన్నింటిలోనూ విశ్వసనీయత పెరగాలని, ఈ విశ్వాస కల్పనకు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలందరూ చొరవ తీసుకుని అందరిలోనూ చైతన్యం పెంచాలని సూచించారు.

also read 

ప్రజల విశ్వాసం పొందినప్పుడే ఈ విజయం సాధించగలుగుతామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. శక్తివంతమైన సరఫరాల వ్యవస్థ కూడా చాలా అవసరమని, ఇందుకోసం ప్రపంచ స్థాయి విడిభాగాల తయారీదారులను భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించాలని భార్గవ సూచించారు. వారిని ఆకర్షించేందుకు ఒక ప్రత్యేక, అనుకూల పథకం రూపొందించడం కూడా అవసరమని చెప్పారు.  

ఇదిలా ఉంటే దేశంలోని పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కార్ల డిమాండు అధికంగా ఉన్నట్టు అతి పెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకీ చెబుతోంది. కొవిడ్‌-19 ప్రభావంతో పట్టణ ప్రాంతాలు అల్లాడుతుండగా గ్రామాల్లో ఆ మహమ్మారి వ్యాప్తి తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ అన్నారు.

రుతుపవనాలు కూడా సానుకూలంగా ఉండడం, రబీ పంటలు చేతికి రావడంతో పాటు ఖరీఫ్‌ పంట విస్తీర్ణం కూడా పెరగడం వల్ల గ్రామాల్లో కార్ల డిమాండు పెరిగిందని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. జూన్‌లో తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40 శాతంగా నమోదయిందని ఆయన చెప్పారు. 

పట్టణ ప్రాంతాల్లో  కస్టమర్ల సెంటిమెంట్‌ బలహీనంగా ఉన్నదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు.రాబోయే నెలల్లో అమ్మకాలు ఎలా ఉంటాయనేది చెప్పడం సాధ్యం కాదంటూ దీర్ఘ కాలంలో కొవిడ్‌ వ్యాప్తి ధోరణుల పైనే అవి ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు. 
 

click me!