ఆటోమొబైల్ విక్రయాలకు నిరాశ... మారుతి & మహీంద్రాకు మాత్రమే గ్రోత్

By Sandra Ashok Kumar  |  First Published Jan 2, 2020, 10:12 AM IST

2019 చివరి నెల డిసెంబర్ కూడా ఆటోమొబైల్ సంస్థలకు ఊరటనివ్వలేదు. కాకపోతే ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే సింగిల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. మిగతా సంస్థల సేల్స్ 2018తో పోలిస్తే తగ్గిపోయాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు ఎన్ని రకాల ఆఫర్లు, రాయితీలు అందించినా వినియోగదారులు వాటి వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
 


న్యూఢిల్లీ: వాహన విక్రయ సంస్థలకు డిసెంబర్‌ నెల కూడా షాకిచ్చింది. విక్రయాల్లో రెండు సంస్థలకు తప్పా మిగతా సంస్థలకు నిరాశనే మిగిల్చింది 2019. అమ్మకాలను పెంచుకోవడానికి భారీగా రాయితీలు ఇచ్చినా కొనుగోలు దారులు మాత్రం వీటివైపు కన్నెత్తి చూడనేలేదు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకితోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేసుకున్నాయి. హ్యుండాయ్‌, టయోటా, టాటా మోటార్స్‌, ఈవీ కమర్షియల్‌లకు మాత్రం నిరాశ తప్పలేదు. 

సాధారణంగా ఏడాది చివరి నెలలో అమ్మకాలు తగ్గుతుంటాయి. కానీ మహీంద్రా, మారుతి సుజుకి కంపెనీలు మాత్రం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గత నెలలో మారుతి 1,24,375 యూనిట్ల కార్లను దేశవ్యాప్తంగా విక్రయించింది. 2018లో ఇదేనెలలో అమ్ముడైన 1,21,479లతో పోలిస్తే 2.4 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.

Latest Videos

undefined

also read విపణిలోకి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌.. 9శాతం అధిక మైలేజీ.. ధరెంతంటే?!

కాంపాక్ట్‌ సెగ్మెంట్లో మారుతి సుజుకికి చెందిన కొత్త వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, సెలేరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ అమ్మకాలు 51,346 యూనిట్ల నుంచి 65,673 యూనిట్లకు పెరిగాయి. ఇక మహీంద్రా కంపెనీ దేశీయ అమ్మకాలు డిసెంబర్ నెలలో ఒక శాతం పెరిగి 36,690 యూనిట్ల నుంచి 37,081 యూనిట్లకు చేరుకున్నాయి. 

తమ ఔట్‌లుక్‌కు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నాయని, వాహనాల నిల్వలు కూడా సౌకర్యవంతమైన స్థాయిలో ఉన్నాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ అమ్మకాలు, మార్కెటింగ్ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా తెలిపారు. బీఎస్‌-6 వాహనాలను తీసుకువచ్చేందుకు సర్వసన్నద్ధం అయినట్టు ఆయన చెప్పారు. గత నెల, మొత్తం ఏడాదిలోనూ కంపెనీ పనితీరు ఆశాజనకంగా, ఆమోదయోగ్య స్థాయిలోనే ఉన్నదని విజయ్‌ రామ్‌ నక్రా తెలిపారు.

నూతన సంవత్సరంలో బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయనుండటంతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటామని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ అమ్మకాలు, మార్కెటింగ్ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా నమ్మకాన్ని వ్యక్తంచేశారు. 

డిసెంబర్ నెలలో హ్యుండాయ్‌ దేశీయ అమ్మకాలు 9.8 శాతం తగ్గి 42,093 యూనిట్ల నుంచి 37,953 యూనిట్లకు పడిపోయాయి. మొత్తమ్మీద గతేడాది సంస్థ 5.10 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2019 దేశీయ ఆటోమోటివ్‌ పరిశ్రమకు సవాలుగా మారిందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ కంపెనీ వివిధ విభాగాల్లో నాలుగు కొత్త కార్లను విడుదల చేసినట్టు హ్యుండాయ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) తరుంగ్‌ గార్గ్‌ తెలిపారు. 

గత ఏడాదిలో కంపెనీ దేశీయంగా మొత్తం 5,10,260 కార్లను విక్రయించింది.గతేడాది ఆటోమొబైల్‌ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నదని, ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని హెచ్‌ఎంఐఎల్‌ డైరెక్టర్‌ తరుంగ్‌ గార్గ్‌ తెలిపారు.
 
దేశీయ మార్కెట్లో డిసెంబర్ నెలలో మొత్తం టాటా మోటార్స్ వాహనాల అమ్మకాలు 12 శాతం తగ్గి 50,440 యూనిట్ల నుంచి 44,254 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం ప్యాసెంజర్‌ వాహనాల అమ్మకాలు అంతకు ముందు ఏడాది డిసెంబర్ నెలతో పోల్చితే 10 శాతం తగ్గి 14,260 యూనిట్ల నుంచి 12,785 యూనిట్లకు చేరాయి.
 
ఎంజీ మోటార్స్ డిసెంబర్ నెలలో 3,021 వాహనాలను విక్రయించింది. ఇక టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ దేశీయ అమ్మకాలు డిసెంబర్ నెలలో 45 శాతం తగ్గి 11,836 యూనిట్ల నుంచి 6,544 యూనిట్లకు చేరాయి. 2019లో ఈ కంపెనీ మొత్తం 1,26,701 వాహనాలను విక్రయించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే అమ్మకాలు 16.36 శాతం క్షీణించాయి.

also read సుజుకి నుండి కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్...ధర ఎంతో తెలుసా...

హోండా కార్స్ సంస్థ డిసెంబరులో ఈ కంపెనీ దేశీయంగా 8,412 కార్లను విక్రయించింది. 2018లో ఇదే నెలతో పోల్చితే అమ్మకాలు 36 శాతం తగ్గాయి. తాము అంచనా వేసిన విధంగానే అమ్మకాలు నమోదయ్యాయని, బీఎస్‌ - 4 వాహనాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్‌ గోయల్‌ తెలిపారు.

హీరో ఎలక్ట్రిక్‌ వెనక్కి
ద్విచక్ర విద్యుత్‌ వాహన తయారీలో అగ్రగామి సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ రూ.700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను మరో ఏడాది వాయిదావేసింది. విద్యుత్‌ వాహనాల వాడకాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్‌-2 పథకం విఫలం కావడంతో ఈ పెట్టుబడులపై వెనక్కి తగ్గినట్లు కంపెనీ ఎండీ నవీన్‌ ముంజల్‌ తెలిపారు. 

ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య దేశీయంగా కేవలం 3000 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, అంతక్రితం ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 48,671లతో పోలిస్తే 93.84 శాతం పడిపోయాయి. ఫేమ్‌-1లో తక్కువ వేగంతో నడిచే వాహనాలపై రూ.17 వేలు, వేగంతో నడిచే వాహనాలపై 22 వేల రూపాయల సబ్సిడీ ఇచ్చింది. కానీ ఏప్రిల్‌ 1, 2019 నుంచి అమలులోకి వచ్చిన ఫేమ్‌-2తో ఈ రాయితీ రూ.20 వేలకు పరిమితం చేసింది.
 

click me!