ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు బీమా కవరేజీ కవచం అందుబాటులోకి రానున్నది. సోమవారం ప్రామాణిక కొవిడ్-19 ఆరోగ్య పాలసీ ఆవిష్కరణ అయ్యే అవకాశం ఉంది. ఆ పాలసీ ప్రీమియం రూ.2000-రూ.3000 మధ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడిన వారికి కనీస రక్షణ కల్పించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆదేశాల మేరకు ప్రత్యేక బీమా పాలసీ సోమవారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ‘కొవిడ్-19 స్టాండర్డ్ ఇండివిడ్యువల్ బెనిఫిట్ బేస్డ్ హెల్త్ పాలసీ’ అనే పేరుతో రానున్న ఈ పాలసీకి ప్రీమియం ఇంకా ఖరారు కాలేదు.
అయితే రూ.5 లక్షల ప్రయోజనం అందించడానికి రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య ప్రీమియం నిర్ణయించే ఆస్కారం ఉంది. బీమా కంపెనీలన్నీ పాలసీలో ఉపయోగించే పదజాలం ఒకేలా ఉండే స్టాండర్డ్ పాలసీ ఇది.
ప్రయోజనాలు విస్తరించుకునేందుకు యాడ్ ఆన్ కవరేజీలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ పాలసీ కింద లభించే పరిహారం రూ.5 లక్షలకే పరిమితం అవుతుంది. హాస్పిటలైజేషన్ ఖర్చులు అంతకు మించితే ఆ అదనపు వ్యయాలు పాలసీదారుడే భరించుకోవాలి.
ప్రస్తుతం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రియలన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు కొవిడ్-19కి రక్షణ కల్పిస్తున్నా, వాటిని గ్రూప్ పాలసీలు లేదా బెనిఫిట్ ప్లాన్లుగానే అందచేస్తున్నాయి.
also read
కొవిడ్-19 ఆరోగ్య అవసరాలకు బీమా రక్షణ కల్పిస్తుంది. ఒక బీమా కంపెనీ నుంచి మరో బీమా కంపెనీకి ఎలాంటి అవరోధాలు లేకుండా మారే అవకాశం ఉంటుంది. మూడు నెలల పసికందు నుంచి 65 ఏళ్ల వరకు కవరేజీ లభిస్తుంది.
ఇన్సూరెన్స్ కవరేజీకి ఏడాది కాల పరిమితి ఉంటుంది. తదుపరి ప్రతి ఏడాది రెన్యువల్‌కు అవకాశం కల్పిస్తారు. ఎనిమిదేళ్లు దాటితే క్లెయిమ్‌పై బీమా సంస్థల అభ్యంతరాలు చెల్లవు.
పాలసీదారులు క్రమం తప్పకుండా 8 ఏళ్లు ప్రీమియం కడుతూ ఉన్నట్లైతే ఆ తర్వాత నుంచి ఆరోగ్య బీమా కంపెనీలు కస్టమర్ల నుంచి వచ్చే క్లెయిమ్‌ల విషయంలో విభేదించే అవకాశం ఉండబోదని స్పష్టం చేస్తూ ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఒకవేళ ఏ కంపెనీ నిబంధనలైనా ఇందుకు విరుద్ధంగా ఉన్నట్టయితే 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెన్యువల్ చేసే పాలసీలన్నింటి కాంట్రాక్టులోనూ తగు సవరణలు చేయాలని తేల్చి చెప్పింది. వ్యక్తిగత ప్రమాద బీమా, దేశ/విదేశీ ప్రయాణాలకు తీసుకున్న బీమా పాలసీలు మినహా మిగతా పాలసీలన్నింటిలోనూ నిబంధనావళి ఒకేలా ఉండేలా చూసే లక్ష్యంతో ఈ సవరణ ప్రతిపాదించినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది.