పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మొదటి సారిగా కొత్త యూపీఐ యూజర్ కు చెల్లింపు జరిపే సమయంలో రూ.2 వేలు మాత్రమే పంపేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ?
దేశంలో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ చెల్లింపుల్లో మోసాలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. అయితే దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఆన్ లైన్ చెల్లింపుల్లో మోసాన్ని అరికట్టేందుకు ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటిసారిగా ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన లావాదేవీకి కనీస సమయాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. ఇక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మొదటి లావాదేవీ రూ.2 వేల కంటే ఎక్కువ ఉండకూడని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు గంటల తరువాత ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల డిజిటల్ చెల్లింపుల్లో కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుందని అనుకుంటున్నప్పటికీ.. పెరుగుతున్న సైబర్ మోసాలను తగ్గించేందుకు ఇది అవసరమని అధికారులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే ఇలాంటి నిబంధనలు ఇప్పటికే కొన్ని అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం, ఒక వినియోగదారుడు కొత్త యూపీఐ అకౌంట్ తయారు చేసినప్పుడు.. మొదటి 24 గంటల్లో గరిష్టంగా రూ .5,000 పంపించే అవకాశం మాత్రమే ఉంది. అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విషయంలో లబ్ధిదారుడు యాక్టివేట్ చేసిన తర్వాత మొదటి 24 గంటల్లో రూ .50,000 (పూర్తి లేదా భాగాలలో) బదిలీ చేసేందుకే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం అమలు చేయాలనుకుంటున్న మార్పుల ప్రకారం.. ఒక వినియోగదారుడు ఇంతకు ముందు ఎప్పుడూ లావాదేవీలు జరపని కొత్త వినియోగదారుడికి రూ .2,000 కంటే ఎక్కువ మొదటి చెల్లింపు చేసే అవకాశం ఉండదు. ఆ యూజర్ కు మళ్లీ ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరపాలంటే నాలుగు గంటలు వేచి ఉండాల్సిందే.
ఇదిలా ఉండగా... 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ పేమెంట్ విభాగంలో బ్యాంకులు అత్యధిక మోసాలను చూశాయని ఆర్బీఐ వార్షిక నివేదిక 2022-23 తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం మోసం కేసుల సంఖ్య 13,530, ఇందులో మొత్తం రూ .30,252 కోట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 49 శాతం లేదా 6,659 కేసులు డిజిటల్ పేమెంట్ - కార్డు లుదా ఇంటర్నెట్ - కేటగిరీ ద్వారానే జరిగాయి. అయితే ఆర్థిక సైబర్ మోసాలు, ద్రవ్య నష్టాలను త్వరగా నివేదించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ 4 సీ) డెవలప్ చేసిన ఆన్ లైన్ సిస్టమ్ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ సీ ఎఫ్ఆర్ఎంఎస్) ఏప్రిల్ 2021 లో ప్రారంభమైనప్పటి నుండి రూ .602 కోట్ల లావాదేవీలను అడ్డుకుంది.