త్వరలో భారత్ ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరిస్తుందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ దశాబ్దాన్ని రిలయన్స్-మైక్రోసాప్ట్ భాగస్వామ్యం నిర్దేశిస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీలో చెప్పారు.
భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశం ఎంతో దూరంలో లేదని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సోమవారం ముంబైలో జరిగిన ఫ్యూచర్ డీకోడ్ సీఈఓ 2020 సమ్మిట్‌లో సంభాషించిన అంబానీ డిజిటల్ సేవల్లో భారత్ అగ్రగామిగా నిలవనుందని చెప్పారు.
వేగంగా మొబైల్ నెట్ వర్క్ విస్తరణ
మొబైల్ నెట్‌వర్క్ విపరీతంగా పెరుగడంతోపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరిస్తున్నదని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారత్‌లో మొబైల్ నెట్‌వర్క్ సేవలు భారీగా విస్తరిస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. రిలయన్స్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఈ దశాబ్దాన్ని నిర్వచించనుందన్నారు. సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవలను అంబానీ ప్రశంసించారు.
జియో ఆవిష్కరణతో దేశంలోకి డిజిటల్ విప్లవం
ముఖ్యంగా జియో ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చామని ముఖేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జియో ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించగలగడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. జియోకు ముందు దేశంలో డేటా వేగం 256 కేబీపీఎస్ అయితే, జియో తరువాత ఇది 21 ఎంబీపీస్‌గా ఉండడం విశేషమని ముఖేశ్ అంబానీ అన్నారు.
జీబీ డేటా ఖర్చు రూ.500 నుంచి రూ.12-14కి తగ్గింపు
గతంలో జీబీకి అయ్యే ఖర్చు రూ.300 నుంచి 500 మధ్యలో ఉండగా, ప్రస్తుతం ఆది రూ.12-14 మధ్యలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒక దశలో ఒక్క జీబీ డాటాకు రూ.10,000 చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 380 మిలియన్ల మంది జియో 4జీ టెక్నాలజీకి వలస వచ్చారని ముకేశ్ అంబానీ చెప్పారు.
ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా భారత్
ఈ క్రమంలో భారతదేశం "ప్రీమియర్ డిజిటల్ సొసైటీ" గా అవతరించే దశలో ఉందన్నారు. అలాగే ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలవనుందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇందులో తనకెలాంటి సందేహం లేదనీ, అయితే ఇది ఎప్పుడు జరుగుతుందా అనేదే చర్చ అన్నారు.
ట్రంప్‌కు భిన్నమైన భారతావని ఆవిష్కారం
ప్రస్తుత దేశ పర్యటనలో అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సందర్శనల కంటే భారతదేశం చాలా భిన్నంగా ఉందని ముఖేశ్ అంబానీ తెలిపారు. ప్రత్యేకించి మొబైల్ కనెక్టివిటీ ఒక కీలకమైన మార్పు అని తెలిపారు. తరువాత తరం భారత్ కంటే విభిన్నమైన దేశాన్ని మన చూడబోతోందన్నారు.
1992లో భారత్ ఆర్థిక వ్యవస్థ 300 బిలియన్ డాలర్లు
1992లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు 300 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ..ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నదని ముకేశ్ అంబానీ అన్నారు. ఆర్థిక మూలాలు దృడంగా ఉన్నాయని, టెక్నాలజీ రంగం కూడా అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ప్రపంచ టెలికం రంగంలో చెరగని ముద్రవేశాయన్నారు.
ఇలా రిలయన్స్ క్రమంగా ఎదిగిన తీరు
తన తండ్రి ధీరుభాయ్ అంబానీ 50 ఏండ్ల క్రితం రూ.1,000 మూలధనంతో రిలయన్స్‌ను ప్రారంభించిన విషయాన్ని ముకేశ్ అంబానీ గుర్తుచేశారు. ప్రారంభంలో చిన్న స్థాయి సంస్థగా ఆరంభమైన రిలయన్స్.. ఆ తర్వాతి క్రమంలో చిన్న స్థాయి నుంచి అతిపెద్ద సంస్థగా అవతరించింది.
భారతీయ సంస్థలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: సత్యనాదెళ్ల
భారతీయ సంస్థలు సొంత సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో ఆయన దేశీయ కార్పొరేట్ సీఈవోలనుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించాలని పిలుపునిచ్చారు.
టెక్నాలజీ సామర్థ్యం పెంపుతోనే సత్ఫలితాలు
గడిచిన దశాబ్దంలో మొబైల్ ఆధారిత టెక్నాలజీల రాకను చూశామన్న ఆయన వీటిని కొందరే అందిపుచ్చుకోగలిగారని సత్య నాదెళ్ల అన్నారు. సాంకేతిక మార్పులను వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని, టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
సైబర్ సెక్యూరిటీ వల్ల లక్ష కోట్ల డాలర్ల నష్టం
సైబర్ సెక్యూరిటీ సమస్యలను ఆయా సంస్థలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల లక్ష కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఉపేక్షించదగినది కాదన్నారు.
దివ్యాంగులకు ఆదుకునేందుకు చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్-ఎస్బీఐ
కాగా, దివ్యాంగులు ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్-ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చేతులు కలిపాయి. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ఇరు సంస్థలు ముందుకొచ్చాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఉద్యోగాలు వచ్చేలా సహకరించనున్నాయి. తొలి ఏడాది 500లకుపైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.