సెమీకండక్టర్ హబ్ గా భారత్ : సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ కామెంట్స్

By Arun Kumar P  |  First Published Sep 11, 2024, 6:24 PM IST

సెమీకాన్ ఇండియా 2024ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశాన్ని సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ఇది తొలి అడుగని పీఎం పేర్కొన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.


ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యోగి ప్రభుత్వం సెమీకాన్ ఇండియా 2024 నిర్వహిస్తోంది. ఇవాళ (బుధవారం)  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సెమికాన్ ఇండియాను ప్రారంభించారు. నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... సెమీకండక్టర్‌లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు అన్నారు. భారతదేశానికి చిప్ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదు, కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చే ఒక సాధనమని పేర్కొన్నారు. కాబట్టి దేశంలోని విద్యార్థులను, నిపుణులను సెమీకండక్టర్ పరిశ్రమకు సిద్ధం చేయడంపై దృష్టి సారించామన్నారు.

Latest Videos

తమ ప్రభుత్వ విధానాల కారణంగా చాలా తక్కువ కాలంలోనే ఈ రంగంలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో భారత్ పురోగతి సాధించేలా చూస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే పూర్తి సెమీకండక్టర్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. పర్యావరణానికి హానీ చేయకుండానే ఈ ప్రక్రియ కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 

 ప్రపంచంలోని ప్రతి పరికరంలోనూ భారతదేశంలో తయారయిన చిప్ ఉండాలని ప్రతి ఒక్కరు కలగనాలి... దాన్ని నిజం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా అవతరించడానికి అవసరమైన చర్యలన్ని ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీ విషయంలో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు కూడా అదిగమించేలా భారత్ ప్రయత్నిస్తోందని అన్నారు.

  మీరు సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నారు : మోదీ 

 సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఈ గొప్ప కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 8వ దేశం భారత్ అని పీఎం మోదీ తెలిపారు. సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నారంటూ యూపీ ప్రభుత్వాన్ని కొనియాడారు పీఎం. 

 భారతీయుల అద్భుతమైన ప్రతిభను ప్రపంచ దేశాలు త్వరలోనే తెలుసుకుంటారని పీఎం మోదీ అన్నారు. డిజైనింగ్ ప్రపంచంలో 20 శాతం ప్రతిభ భారతదేశం నుండి వస్తుంది...  ఇది నిరంతరం విస్తరిస్తోందన్నారు. దాదాపు 85,000 మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్&డి నిపుణులతో కూడిన సెమీకండక్టర్ శ్రామికశక్తిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.దేశంలోని విద్యార్థులను, నిపుణులను సెమీకండక్టర్ పరిశ్రమకోసం సిద్ధం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఇటీవలే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మొదటి సమావేశాన్ని నిర్వహించినట్లు ప్రధాని తెలిపారు. ఈ ఫౌండేషన్ భారతదేశ పరిశోధనా వ్యవస్థకు కొత్త దిశను,  కొత్త శక్తిని అందిస్తుందన్నారు. అంతేకాకుండా భారతదేశంలో రూ. 10 లక్షల కోట్లతో ప్రత్యేక పరిశోధన నిధిని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి చొరవల ద్వారా సెమీకండక్టర్ తో పాటు సైన్స్ రంగాలలో ఆవిష్కరణల పరిధి విస్తృతం కానుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

 ఈ చిన్న చిప్ భారతదేశంలో గొప్ప పాత్ర పోషిస్తోంది : మోదీ

సెమీకండక్టర్ల విషయంలో భారత ప్రభుత్వ విధానాలు,  పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాల గురించి పీఎం మోదీ వివరించారు. ప్రస్తుతం దేశంలో సంస్కరణలను ఆహ్వానించే ప్రభుత్వం వుంది...అలాగే దేశం అభివృద్ది దిశగా నడుస్తోంది... దేశంలో మంచి మార్కెట్ వుంది... ఈఈ మూడు అంశాలు సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయన్నారు ప్రధాని మోదీ. 

భారతదేశానికి చిప్ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదు, కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇది ఒక సాధనమని అన్నారు. నేడు భారతదేశం చిప్‌లకు అతిపెద్ద వినియోగదారుగా వుందన్నారు. ఈ చిప్‌తోనే  ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించామన్నారు. ఈ చిన్న చిప్ నేడు భారతదేశ అభివృద్దిలో గొప్ప పాత్ర పోషిస్తోందన్నారు

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా కరోనా వంటి మహమ్మారి సమయంలో కుప్పకూలిపోయాయి..కానీ భారత్ లోని బ్యాంకులు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశంలోని యూపిఐ, రూపే కార్డ్, డిజిలాకర్ నుండి డిజియాత్ర వరకు వివిధ రకాల డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారతీయుల రోజువారీ జీవితంలో భాగమయ్యాయని అన్నారు. నేడు భారతదేశం అన్ని రంగాలలోనూ స్వయం సమృద్ధి సాధిస్తోందని అన్నారు. నేడు భారతదేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది... అంటూ ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను ముందుకు నడిపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించనుందని అర్థమవుతోందని మోదీ తెలిపారు. 

 

నేడు సిలికాన్ దౌత్యం యుగం

క్లిష్టమైన ఖనిజాల సేకరణ గురించి పీఎం మోదీ మాట్లాడాారు. క్లిష్టమైన ఖనిజాల దేశీయ ఉత్పత్తి, విదేశాల నుండి సేకరణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.   క్లిష్టమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపు, బ్లాక్‌ల వేలం, మైనింగ్ వేలం వంటి వాటిపై వేగంగా పని జరుగుతోందన్నారు. అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్‌లో సెమీకండక్టర్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము కృషి చేస్తున్నామన్నారు.

ఇండియన్ ఇంజనీర్లు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా హైటెక్ చిప్‌లను మాత్రమే కాకుండా తదుపరి తరం చిప్‌లపై కూడా పరిశోధనలు చేసేలా IITలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ సహకారాన్ని కూడా మేము ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. చమురు దౌత్యాన్ని మీరు వినే ఉంటారు, నేడు సిలికాన్ దౌత్యం యుగం అని ఆయన అన్నారు.

ఈ ఏడాది భారతదేశం ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ యొక్క సప్లై చైన్ కౌన్సిల్‌కు వైస్ చైర్‌గా ఎన్నికైందని ప్రధాని తెలిపారు. క్వాడ్ సెమీకండక్టర్ సప్లై చైన్ ఇనిషియేటివ్‌లో కూడా మేము కీలక భాగస్వామిగా ఉన్నామన్నార. ఇటీవలే జపాన్, సింగపూర్‌తో సహా అనేక దేశాలతో ఒప్పందాలపై సంతకం చేశాము... ఈ రంగంలో అమెరికాతో కూడా భారతదేశం తన సహకారాన్ని నిరంతరం పెంచుకుంటోందని ప్రధాని మోదీ వివరించారు.

భారతదేశం సెమీకండక్టర్ చిప్‌లను మరియు వాటి తుది ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది : మోదీ

డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యం దేశానికి పారదర్శకమైన, సమర్థవంతమైన పాలనను అందించడమే. నేడు మనం దాని ప్రభావాన్ని చూస్తున్నామని పీఎం మోదీ అన్నారు. పదేళ్ల క్రితం మనం మొబైల్ ఫోన్‌లను అతిపెద్ద దిగుమతిదారులలో ఒకరిగా ఉండేవాళ్లం... నేడు మనం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉన్నామన్నారు.

భారతదేశం నేడు 5G హ్యాండ్‌సెట్‌లకు రెండవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని తాజా నివేదిక వెల్లడించిందని ప్రధాని తెలిపారు. రెండేళ్ల క్రితమే మనం 5G రోల్‌అవుట్‌ను ప్రారంభించాము... నేడు మనం ఎక్కడి నుండి ఎక్కడికో వచ్చాము. నేడు భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం 150 బిలియన్ డాలర్లకు పైగా విలువైనది... ఇప్పుడు మన లక్ష్యం మరింత పెద్దదని అన్నారు. ఈ దశాబ్దం చివరినాటికి మన ఎలక్ట్రానిక్స్ రంగాన్ని 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ప్రధాని తెలిపారు.దీని ద్వారా భారతీయ యువతకు దాదాపు 6 మిలియన్లు లేదా 60 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

భారతదేశ సెమీకండక్టర్ రంగం కూడా దీని ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో 100 శాతం భారతదేశంలోనే జరగాలనేది మా లక్ష్యం, అంటే భారతదేశం సెమీకండక్టర్ చిప్‌లను, వాటి తుది ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. మొబైల్ తయారీ అయినా, ఎలక్ట్రానిక్స్ తయారీ అయినా లేదా సెమీకండక్టర్లు అయినా, మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. సంక్షోభ సమయాల్లో కూడా ఆగని, తగ్గని, నిరంతరం కొనసాగే ప్రపంచాన్ని మనం సృష్టించాలనుకుంటున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితేంద్ర ప్రసాద్, పార్లమెంటు సభ్యుడు మహేష్ శర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ నుండి వచ్చిన ప్రపంచ నాయకులు, సీఈవోలు, నిపుణులు పాల్గొన్నారు.

click me!