Pakistan : తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కరాచీ పోర్టును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి అప్పగించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి, వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వ వాణిజ్య లావాదేవీలపై క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు.
Pakistan : రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమతుల్యత, కనిష్ట విదేశీ ద్రవ్య నిల్వలతో ప్రభుత్వాన్ని నడపడం పాకిస్తాన్ కు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కరాచీ పోర్ట్ టెర్మినల్స్ (కెపిటి)ని యుఎఇకి చెందిన కంపెనీకి అప్పగించాలని ప్రతిపాదించినట్లు ఆఫ్ఘనిస్థాన్ ఖామా ప్రెస్ తెలిపింది. ఎమర్జెన్సీ ఫండ్స్‌ని సేకరించేందుకు గత ఏడాది ఆమోదించిన చట్టం ప్రకారం ఇది మొదటి వాణిజ్య లావాదేవీగా గురిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన AD పోర్ట్స్ గ్రూప్ కరాచీ పోర్ట్‌లోని 4 బెర్త్‌లను 50 సంవత్సరాల పాటు లీజుకు తీసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కరాచీ పోర్ట్ ట్రస్ట్ (KPT)తో రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సోమవారం సమావేశానికి అధ్యక్షత వహించారు. కరాచీ పోర్ట్ ట్రస్ట్ (KPT), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మధ్య వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఒక కమిటీ అవసరమని సమావేశం నిర్ధారించిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదికలో పేర్కొంది.
కరాచీ పోర్ట్ టెర్మినల్స్‌ను బదిలీ చేయడానికి UAE నియమించిన ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్రభుత్వ ఒప్పందాల ప్రకారం ముసాయిదా ఆపరేషన్, నిర్వహణ, పెట్టుబడి అభివృద్ధి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చర్చల కమిటీకి అధికారం ఉందని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో ఒప్పందం గడువు ముగియడంతో దేశానికి అత్యవసరంగా అదనపు నిధులు అవసరం. ఇందుకోసం పోర్టును యూఏఈకి అప్పగించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మొదట్లో పాకిస్థాన్‌కు రుణం ఇచ్చేందుకు యూఏఈ నిరాకరించింది. దీంతో బలవంతంగా షేర్లను అమ్మవలసి వచ్చింది. అయితే తర్వాత 1 బిలియన్ డాలర్లు ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే పాకిస్థాన్‌కు యూఏఈ ఇంకా ఈ డబ్బును విడుదల చేయలేదు. ఈ ల్యాండ్‌మార్క్ డీల్ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది.ఈలోగా పాకిస్తాన్‌కు పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం అవసరం. ఈ రకమైన చిన్నచిన్న లావాదేవీలు తక్షణ అవసరాలను మాత్రమే తీర్చగలవు. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లేదా భద్రత విషయంలో టెర్మినల్‌లను వెనక్కి తీసుకునే హక్కు పాకిస్థాన్‌కు ఉందన్న విషయం గమనించాలి.
రాజకీయ అనిశ్చితి, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ దివాలా అంచున ఉంది. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం చారిత్రక రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన ఆహార పదార్థాలు, నిత్యవసరాల జాబితాలోకి పాల ధర కూడా చేరిపోయింది. లీటరు పాల ధర రూ.200 పలకడం దేశంలో ఇదే తొలిసారి. పాల విక్రయదారులు లీటరు పాల ధరను రూ.190 నుంచి రూ.210కి పెంచినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా కోడి మాంసం కిలో ధర రూ.700 నుంచి రూ.800కి ఎగబాకింది. కొద్ది రోజుల క్రితం ఈ రేటు రూ.620 నుంచి రూ.650. మధ్యలో ఉంది. ఒక్క వారంలోనే చికెన్ ధర రూ.120కి పైగా పెరిగింది. బోన్ లెస్ చికెన్ కిలో ధర రూ.900 నుంచి రూ.1000కి పెరిగింది.