ఇతర మెట్రో నగరాల కంటే మన హైదరాబాద్‌ బెస్ట్‌

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2019, 6:06 PM IST
Highlights

దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో హైదరాబాద్ నగరంలో మాత్రమే సకల వసతులు ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్, ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ, మైట్రో రైలు సౌకర్యం కలిసివచ్చే అంశాలు కానున్నాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం హస్తిన అంటే ఢిల్లీ ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైల్లో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్‌)లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, పటిష్ఠ భద్రత, కాస్మోపాలిటన్‌ కల్చర్‌.. అన్నింటికీ మించి స్థిర ప్రభుత్వం ఉండటం హైదరాబాద్ నగరానికి కలిసొచ్చే అంశాలు!

ఈ ఏడది జనవరి - సెప్టెంబర్‌ మధ్య నగరంలో 40 లక్షల గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్‌ అద్దెలు తొమ్మిది శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 ఇళ్లు అమ్ముడయ్యాయి. 190 మిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. ఏ నగర అభివృద్ధికైనా కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి.

అందుకే కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్‌ జోన్‌ అభివృద్ధికి త్వరలోనే లుక్‌ ఈస్ట్‌ పాలసీని తేనున్నది.

కాస్మోపాలిటన్‌ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్‌ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్‌ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్‌ లయన్‌ కిరణ్‌ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్‌ మార్క్‌ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారన్నారు. 

ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో చిక్కుకున్నది. అయితే ఇది తాత్కాలికం అని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని అంచనా వేస్తున్నారు.

కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్‌ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్‌ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్‌ ఎండీ ఎస్‌ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటు త్రిబుల్‌ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును మన భాగ్య నగరం బీట్‌ చేయడం ఖాయమని పేర్కొన్నారు.
 

click me!