కరోనా నియంత్రణపై ఈయూ, అమెరికాతో పోల్చొద్దు.. కిరణ్ మజుందార్

By narsimha lode  |  First Published May 3, 2020, 12:59 PM IST

అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో పోలిస్తే భారత్‌లోనూ జూన్‌-జులైల్లో కరోనా వైరస్‌ మరింత విస్తరిస్తుందని అంచనాలు వేయడం ఏమాత్రం సరికాదని  బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు.


న్యూఢిల్లీ: అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో పోలిస్తే భారత్‌లోనూ జూన్‌-జులైల్లో కరోనా వైరస్‌ మరింత విస్తరిస్తుందని అంచనాలు వేయడం ఏమాత్రం సరికాదని  బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు. ఆ దేశాలతో పోలిస్తే భారత్‌లోని పరిస్థితులు భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. 

కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం భారతదేశానికి మేలు చేసిందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. కఠిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏ దేశానికీ అందనంత దూరంలో నిలిచామని తెలిపారు.  

Latest Videos

యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలు, అమెరికాలో నమోదైన కొవిడ్‌-19 కేసుల గణాంకాల ఆధారంగా భారత్‌లో నమోదయ్యే కేసులపై అంచనాకు రావడం సరికాదని కిరణ్ మజుందార్ షా తెలిపారు. సామాజిక నిర్మాణం విషయంలో పాశ్చాత్య దేశాలకు, భారత్‌కు తేడా ఉందని స్పష్టం చేశారు.

విదేశాల కంటే కూడా కరోనా వ్యాప్తిని ఇప్పటివరకు భారత్‌ సమర్థంగా నియంత్రించిందని కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 500 ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఇటలీలో 9000, బ్రిటన్‌లో 6,700 కేసులున్నప్పుడు లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించారు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఈ దేశాలు లాక్‌డౌన్‌ విధించినప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందనే విషయం అర్థం చేసుకోవచ్చునని కిరణ్ మజుందార్ షా తెలిపారు. భారత్‌లో మాత్రం ఆ స్థాయిలో లేదన్నారు. 

కరోనా వ్యాప్తి నియంత్రణకు భారత్‌ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. ఉదాహరణకు క్వారంటైన్‌, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, నిఘా, కఠిన ఆంక్షల అమలు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. 

చాలా దేశాలు ఇలాంటి చర్యలేవీ చేపట్టలేదని బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా చెప్పారు. ప్రాథమిక దశలోనూ ఎటువంటి అలక్ష్యాన్ని భారత్‌ ప్రదర్శించలేదని, అందుకే ఈ విషయంలో భారత్‌ను మనం అభినందించాలని పేర్కొన్నారు.

also read:అవసరాలకు మించి డేటా వినియోగం అబద్దం: షియోమీ

లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర కూడా అద్భుతం అని కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. ఇలా కఠినమైన చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏ దేశానికీ అందనంత దూరంలో నిలిచిన భారత్‌ను యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికాలతో పోల్చి కేసుల సంఖ్యను అంచనా వేయడం సబబేనా? అని ప్రశ్నించారు.

‘పాశ్చాత్య దేశాల్లో ఇళ్లల్లో చనిపోయిన వృద్ధుల సంఖ్యను ఓ సారి చూడండి. చాలా చాలా ఎక్కువ. ఇటలీ కావచ్చు లేదా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కావచ్చు.. ఐరోపాలోని ఏ దేశమైనా చూడండి. ఎంత మంది వృద్ధులు వాళ్ల ఇళ్లలో మరణించారో గమనించండి. భారత్‌లో అటువంటి పరిస్థితి లేదు’ అని కిరణ్ మజుందార్ షా తెలిపారు.

‘ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వృద్ధుల మరణాలు ఇక్కడ చోటుచేసుకోలేదు. అందుకే పాశ్చాత్య దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా చేసుకొని వేస్తున్న లెక్కలను, అంచనాలను నేను అంగీకరించడం లేదు’ ని కిరణ్ మజుందార్ షా వెల్లడించారు.

‘దేశవ్యాప్తంగా ఒక జిల్లాను రెడ్‌ జోన్‌గా వర్గీకరించడం కంటే చిన్న చిన్న రెడ్‌ జోన్లను ఏర్పాటు చేయడం మంచిది. ఎందుకంటే జిల్లాలు విస్తీర్ణపరంగా పెద్దవిగా ఉంటాయి. రెడ్‌ జోన్లు చిన్నవిగా ఉంటే ఆర్థిక ప్రగతి పుంజుకోవడమే కాకుండా.. సరఫరా అవరోధాలు తగ్గించినట్లు అవుతుంది’ అని కిరణ్ మజుందార్ షా అన్నారు.

‘ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిస్తే మేలు. కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా అధికారులకు వదిలేయాలి. పరీక్షలు చేయడం దగ్గర నుంచి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, క్వారంటైన్‌ చేయడం, చికిత్స అందించడం వరకు అన్ని బాధ్యతలను వాళ్లకే అప్పగించాలి’ అని కిరణ్ మజుందార్ షా చెప్పారు.

’కరోనా వైరస్‌ వ్యాప్తిని వేగంగా నియంత్రించడమే కాకుండా, ప్రభావ తీవ్రతకు అడ్డుకట్ట వేయొచ్చు. దీంతో పాటు ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు తక్షణమే ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలి’ అని బయోకాన్ ఇండియా అధినేత పేర్కొన్నారు.
 

click me!