పెట్రోల్, డీజిల్ కార్ల కంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాలతోనే బ్రేక్స్, టైర్స్ ఉద్గారాలు అధికంగా ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పార్టికులేట్ మ్యాటర్స్ ఎక్కువగా వాతావరణంలో కలుస్తున్నాయని తెలిపింది.
Electric Vehicles: పర్యావరణ మార్పులు, భూతాపం గురించి ఈ మధ్య కాలంలో చర్చ ఎక్కువగా జరుగుతున్నది. అన్ని దేశాలు భూతాపాన్ని కట్టడి చేయడానికి నిర్ణయాలు తీసుకోవాలని పలుమార్లు చర్చలు చేశాయి. కొన్ని టార్గెట్లు కూడా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలని చెబుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది వ్యక్తిగతంగా కూడా పర్యావరణ మార్పులపై అవగాహన పెంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గారు. తద్వార పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి తన వంతు పాత్ర నిర్వహిస్తున్నట్టు భావిస్తున్నారు. కానీ, ఈ అభిప్రాయాలను తాజాగా ఓ అధ్యయనం తోసిపుచ్చింది. అసలు శిలాజ ఇంధనాల కంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే కాలుష్యం ఎక్కువగా వెలువుడుతున్నదని, కాలుష్య కణాలు వాతావరణంలో ఎక్కువగా కలుస్తున్నాయని పేర్కొంది.
ఉద్గారాలను విశ్లేషించే ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ తాజాగా ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఓపెన్ ఎడిటోరియల్‌లో ప్రచురితమైంది. బ్రేక్స్, టైర్ల నుంచి వెలువడే కాలుష్యంపై ఈ అధ్యయనం చర్చింది.
ఆధునిక గ్యాస్ పవర్డ్ వాహనాల కంటే కూడా ఎలక్ట్రానిక్ వాహనాల ద్వారా బ్రేకుల నుంచి, టైర్ల నుంచి ఎక్కువ కాలుష్య కణాలు వస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఇది ఎంత తేడా ఉన్నదంటే.. సాంప్రదాయ వాహనాలతో పోలిస్తే.. 1850 రెట్లు ఎక్కువగా ఈవీల నుంచి వెలువడుతున్నట్టు అంచనా వేసింది.
Also Read: Sandeshkhali Violence: ప్రధాని మోడీని కలిసిన బాధిత మహిళలు.. ‘ఇంకా వేధిస్తున్నాడు’
ఎలక్ట్రానిక్ వాహనాల్లో భారీ బ్యాటరీలు ఉంటాయి. వాటి వల్ల కారు బరువు పెరుగుతుంది. సాంప్రదాయ కార్లలోని ఇంజిన్‌ల కంటే ఈ బ్యాటరీలు ఎన్నో రెట్లు ఎక్కువ బరువుగా ఉంటాయి. తద్వార ఈవీల టైర్లు వేగంగా అరిగిపోతాయి. తద్వార హానికార రసాయనాలు ఈ టైర్ల నుంచి ఎక్కువగా వాతావరణంలో కలుస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. టైర్లను సింథటిక్ రబ్బర్‌తో తయారు చేస్తారు. ఈ సింథటిక్ రబ్బర్ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది.
సాధారణంగా వాహనాల నుంచి కాలుష్య ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ వాహనాల టెయిల్ పైప్ నుంచి వెలువడే ఉద్గారాలను చర్చిస్తారు. పర్యావరణంపై ప్రభావాన్ని పరిశీలించేటప్పుడు ఆ టెయిల్ పైప్‌తోపాటు బ్రైక్స్, టైర్స్ నుంచి వచ్చే ఉద్గారాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ అధ్యయనం సూచించింది.