ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న భారతీయుడు ఎవరో తెలుసా..ఏకంగా 1869 కోట్ల రూపాయల జీతం

By Krishna Adithya  |  First Published Aug 18, 2023, 6:19 PM IST

తమిళనాడుకు చెందిన ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. ఆయన 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీకి నాయకత్వం వహిస్తున్నాడు. అతను యునైటెడ్ స్టేట్స్ లో  భారతీయ మూలవాసులకు ఒక గర్వకారణం. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతే కాదు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి కూడా కావడం విశేషం. అతని విజయం భారతదేశానికి గర్వకారణం. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు సూపర్ రిచ్ బిలియనీర్ అయ్యాడు. అతను ఎవరో తెలుసుకుందాం. 


ఈ భారతీయ వ్యక్తి మరెవరో కాదు, Google CEO సుందర్ పిచాయ్.  జూన్ 10, 1972 న తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో  సుందర్ పిచాయ్ జన్మించాడు, అతని అసలు పేరు పిచాయ్ సుందర్ రాజన్. అతను తన 10వ తరగతిని చెన్నైలోని అశోక్ నగర్‌లోని జవహర్ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్, మద్రాస్‌లోని వాన్ వాణి స్కూల్‌లో పూర్తి చేశాడు. IIT ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు.  తమిళ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్  తల్లి పేరు లక్ష్మి, ఆమె స్టెనోగ్రాఫర్, అతని తండ్రి రగునాథ్ పిచాయ్ బ్రిటిష్ కంపెనీ GECలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు. అతని తండ్రికి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉత్పత్తి చేసే తయారీ ప్లాంట్ కూడా ఉంది

2022లో సుందర్ పిచాయ్ జీతం 226 మిలియన్ డాలర్లు. అంటే రూ.1869 కోట్లు. ఈ మొత్తంలో 218 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్ అవార్డు కూడా ఉంది. 2019 లో, అతను 281 మిలియన్ డాలర్ల మొత్తం అందుకున్నాడు. 

Latest Videos

పిచాయ్ తన స్నేహితురాలు అంజలి పిచాయ్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె స్వస్థలం రాజస్థాన్‌లోని కోట. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. హురున్ సంపన్నుల జాబితా ప్రకారం, 2022లో అతని నికర విలువ 1310 మిలియన్ డాలర్లు అంటే రూ.10215 కోట్లు. అదే సంవత్సరం అతను తన నికర విలువలో 20 శాతం కోల్పోయిన తర్వాత ఈ మొత్తం మిగలడం విశేషం. 

ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జీలో ఇంజినీరింగ్ పట్టా తరువాత అతను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్స్ సైన్స్‌లో MS చేసాడు. ఆ తర్వాత వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. అతను Google Chrome అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2008లో కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందారు. 

నాలుగు సంవత్సరాల తరువాత, అతను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2014లో, అతను ప్రాడక్టు హెడ్‌గా పదోన్నతి పొందాడు. 2015లో గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2019 లో, అతను మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ CEO అయ్యాడు.చాలా కంపెనీలు పిచాయ్‌ను సీఈవోగా నియమించుకోవడానికి ముందు ఆలోచించాయి. అయితే, అతని భార్య గూగుల్ నుండి వైదొలగవద్దని సూచించడం విశేషం.  2022లో, భారత ప్రభుత్వం సుందర్ పిచాయ్‌ని  పద్మభూషణ్‌తో సత్కరించింది. ఇది దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం. 

సుందర్ పిచాయ్, అంజలి పిచాయ్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్. ఖరగ్‌పూర్‌లోని ఐఐటీలో కలిసి చదువుకున్నప్పుడు వీరు క్లాస్ మేట్స్ , వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. సుందర్ పిచాయ్ కు క్రికెట్, ఫుట్‌బాల్ రెండూ చాలా ఇష్టమైన ఆటలు.

click me!