‘2022 నాటికి అందరికి సొంతిల్లు’ ... కేంద్ర ఆర్థిక మంత్రి...

By Sandra Ashok KumarFirst Published Jan 24, 2020, 11:37 AM IST
Highlights

ప్రత్యేకించి ఇంటి ఆస్తి ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుతున్నారు. ఇప్పటివరకు ‘2022 నాటికి అందరికి సొంతిల్లు’ లక్ష్య సాధనలో భాగంగా కొన్ని బడ్జెట్లలో కేంద్ర ఆర్థిక మంత్రి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. 

న్యూఢిల్లీ: కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఒకటో తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. ఆమె సమర్పించే మలి విడుత బడ్జెట్ ప్రతిపాదనలపై సామాన్యులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. 

ప్రత్యేకించి ఇంటి ఆస్తి ఆదాయంపై పన్ను మినహాయింపు కోరుతున్నారు. ఇప్పటివరకు ‘2022 నాటికి అందరికి సొంతిల్లు’ లక్ష్య సాధనలో భాగంగా కొన్ని బడ్జెట్లలో కేంద్ర ఆర్థిక మంత్రి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇంటి యజమానులపైనా, అర్హులైన ఇంటి కొనుగోలుదారులపైన భారాన్ని తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిఫారసులు వెళ్లాయి.

also read ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం చర్యలు...బ్యాంకుల విలీనాలు...

దీనివల్ల రియాల్టీ రంగానికి లబ్ధి చేకూరుతుందన్న సంకేతాలు ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్లలో నిధుల కొరతతో హౌసింగ్, రియాల్టీ రంగానికి కష్టకాలం మొదలైంది. ఇప్పటికే ఇళ్ల కొనుగోళ్లు జాప్యం కావడంతో వివిధ వెంచర్లలో భారీగా ఇళ్ల అమ్మకాలు నిలిచిపోయాయి.

ఫలితంగా ఇళ్ల కొనుగోళ్లు జరుగక రియాల్టీ సంస్థల యజమానుల గుండెలు గుభిల్లుమంటున్నాయి. రియాల్టీ రంగంలో సమస్యలతోపాటు ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థల్లో ద్రవ్య లభ్యత అంశాలు దేశీయంగా ఆర్థిక మంద గమనానికి, ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు, రియాల్టీ సంస్థల పునరుద్ధరణకు ఇటు కేంద్రం, అటు ఆర్బీఐ ఒకే సమయంలో పలు సంస్కరణలు అమలులోకి తెచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో 2020 మార్చిలోగా ఇంటి కోసం రూ.45 లక్షల వరకు ప్రజలు తీసుకున్న రుణాలపై రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వడ్డీపై పన్ను రాయితీ కల్పించారు. రూ.45 లక్షల రుణాలపై వచ్చే ఐదేళ్ల వరకు సీలింగ్ మినహాయింపు ఇచ్చే అవకాశాలు కావాలని కోరుతున్నారు. 

నేషనల్ హౌసింగ్ బోర్డు సాయంతో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ (హెచ్ఎఫ్సీ) లో రూ.30 వేల కోట్ల ఫండ్ అందుబాటులో ఉంచారు. తద్వారా హెచ్ఎఫ్సీ నిధుల కొరత నుంచి బయట పడింది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న చిన్న పాటి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధుల మద్దతు అందించేందుకు నిబంధనలను సవరించారు. 

దీంతో అత్యున్నత రేట్ గల హెచ్ఎఫ్సీలు కూడా తక్కువ వడ్డీరేటుపై భారీగా రీ ఫైనాన్స్ పొందేందుకు అర్హత లభించింది. అసెట్ లియబిలిటీ మిస్ మ్యాచ్ అంశాలను పరిష్కరించేందుకు రీ ఫైనాన్సింగ్ చేయడానికి గల 7/10 ఏళ్ల గడువును 15/20 ఏళ్లకు పెంచాలి. 

also read రైళ్లలో వినోదానికి టీవీలు కావాలని... ప్యాసింజర్ల డిమాండ్లు !!

పీఎఫ్, ఇన్సూరెన్స్, డెట్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దీర్ఘకాలికంగా ఇంటి రుణాలు పొందేందుకు అవకాశాలు కల్పించాలి. చిన్న శ్రేణి హెచ్ఎఫ్సీలకు నేషనల్ హౌసింగ్ బోర్డు గ్యారంటీ కల్పించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.రుణాలపై 10 నుంచి 15 శాతం బీమా కల్పించాలని కోరుతున్నారు.

ఎల్ఐజీ (తక్కువ ఆదాయం గ్రూప్) ఇళ్లకు అర్హులైన వారి వార్షికాదాయం రూ.6 లక్షల వరకు సీలింగ్ ఉంది. దీని కింద ఇల్లు కొనుగోలు చేసుకున్న వారికి పూర్తిగా వడ్డీపై ఆదాయం పన్ను రాయితీ కల్పించాలని కోరుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయంలో అనిశ్చితి వల్ల ఇంటి రుణాలు ఆశిస్తున్న వారికి ఆర్ధిక సంస్థలు ప్రత్యేకించి ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రూ.25 లక్షల వరకు ఇంటి రుణాలను వన్ టైం రీస్ట్రక్చరింగ్ చేసుకునేందుకు అనుమతించాలని ఆర్బీఐని అభ్యర్థిస్తున్నారు.ఈడబ్ల్యూఎస్ లేదా ఎల్ఐజీ సెగ్మెంట్లలో రూ.10 నుంచి రూ.15 లక్షల రుణాలు పొందిన వారికి దేశవ్యాప్తంగా ఒక్కశాతం స్టాంప్ డ్యూటీ విధించడం గానీ, పూర్తిగా స్టాంప్ డ్యూటీ రద్దు చేయడం గానీ చేయాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి. 

click me!