మన దేశపు వంటలను ఇంగువ లేకుండా ఊహించుకోలేము. ఎన్ని మసాలాలు వేసినప్పటికీ, ఇంగువ వేస్తే వచ్చే ఘుమ ఘుమ మరొక మసాలా దినుసుకు రాదు. అయితే దురదృష్టవశాత్తూ మన దేశంలో ఇంగువ పంట ఎక్కువగా పండదు. ఈ నేపథ్యంలో మన దేశ శాస్త్రవేత్తలు ఇంగువ పంటను పెంచేందుకు చేసిన ప్రయోగాల్లో సఫలీకృతులు అయ్యారు.
ఇంగువకు భారతీయ వంటలలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. వంటల రుచిని పెంచడంలో ఇంగువ పెద్ద పాత్ర పోషిస్తాయి. చిటికెడు ఇంగువ వేస్తే చాలు, వంటకి కొత్త రుచి వస్తుంది. ఇంగువ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇంగువ మందుల్లో కూడా ఉపయోగించబడుతుంది. ఇంగువకు ఇంత అవసరం ఉన్నా, ఇంగువకు ఇంత డిమాండ్ ఉన్నా మనదేశంలో ఇంగువ పంట చాలా తక్కువ. అయితే భారతదేశం సైతం ప్రస్తుతం ఇంగువను పెద్ద ఎత్తున పండించేందుకు సిద్ధం అవుతోంది.
హిమాలయాల 11000 అడుగుల ఎత్తులో అసఫోటిడా పంట: భారతీయ వంటకాల్లో ఇంగువ ముఖ్యమైన మసాలా అయినప్పటికీ, ఇంగువను ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఇంగువ సాగుపై పరిశోధనలు చేస్తున్నారు. పాలంపూర్‌లోని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ విత్తనాలను భారత్‌కు తీసుకొచ్చి ప్రయోగాలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కొంతమంది రైతులు ఇంగువ సాగు గురించి శిక్షణ పొందారు. ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్ నుండి ఇంగువ విత్తనాలను తీసుకురావడం ద్వారా పంటను పండించడానికి ప్రోత్సహించారు. 2020లో హిమాచల్ ప్రదేశ్‌లో తొలిసారిగా 11000 అడుగుల ఎత్తులో ఇంగువ చెట్లను నాటారు. దాదాపు 3 సంవత్సరాల శ్రమ తర్వాత, శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ లోయలో ఇంగువ చెట్లను పెంచడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ఇంగువ మొక్కలు బాగా పెరిగి రెండేళ్లలో పంట చేతికి వచ్చింది. హిమాచల్ మాత్రమే కాదు, ఉత్తరాఖండ్, లడఖ్, కిన్నౌర్, జంజెలిలోని కొండ ప్రాంతాలు కూడా ఇంగువ సాగుకు అనువైన ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 హెక్టార్లలో 47 వేల ఇంగువ చెట్లను సాగు చేశారు.
భారతదేశంలోనే ఇంగువ అత్యధిక వినియోగం: భారతదేశం ప్రపంచంలోనే ఇంగువ అతిపెద్ద వినియోగదారు. మన దేశంలో ఏటా దాదాపు 1500 టన్నుల ఇంగువ వినియోగిస్తున్నారు. ఈ మొత్తం ఇంగువ ధర 940 కోట్లకు పైగానే ఉంటుంది. భారతదేశం ఇంగువలో 90 శాతం ఆఫ్ఘనిస్తాన్ నుండి, 2 శాతం ఇరాన్ నుండి, 8 శాతం ఉజ్బెకిస్తాన్ నుండి దిగుమతి చేసుకుంటుంది.
ఇంగువ సాగుకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ఇంగువ ధర రూ.30 వేల నుంచి 40 వేల వరకు పలుకుతోంది. ఇంగువ దాని విత్తనాన్ని సాగు చేసిన 5 సంవత్సరాలలోపు పొందవచ్చు. ఒక మొక్క దాదాపు అర కేజీ ఇంగువను పండుతుంది. ఇంగువ సాగుతో రైతులకు కూడా మేలు జరుగుతుంది. లాహౌల్‌లోని క్వారింగ్ గ్రామంలో తొలిసారిగా ఇంగువ పంటను సాగు చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇంగువ తోటల పరిమళం ప్రారంభం కావడంతో కొత్త ఆశలు చిగురించాయని స్థానికులు చెబుతున్నారు.