నో డౌట్..శాశ్వతంగా మూతే: టూరిజం కంపెనీలపై తేల్చేసిన బీఓటీటీ

By Sandra Ashok Kumar  |  First Published May 26, 2020, 12:35 PM IST

కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో పర్యాటక రంగం కోలుకోలేని దెబ్బ తిన్నది. దాదాపు మెజారిటీ సంస్థలు శాశ్వతంగా షట్‌డౌన్‌ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. 40%  ప్రయాణ, పర్యాటక కంపెనీలు వచ్చే 3-6 నెలల్లో మూతపడే చాన్స్‌ ఉన్నదని బీఓటీటీ తాజా నివేదిక హెచ్చరించింది.
 


ముంబై: లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలలకు పైగా స్తంభించింన దేశీయ విమాన యాన కార్యకలాపాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. రైళ్లు, బస్సుల పాక్షిక సేవలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రయాణ, పర్యాటక రంగం మళ్లీ చిగురు తొడుగుతున్న తరుణంలో విడుదలైన ఓ నివేదిక  మాత్రం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. 

పర్యాటక రంగంలో 40 శాతం కంపెనీలు వచ్చే 3-6 నెలల్లో శాశ్వతంగా మూతపడవచ్చని హెచ్చరించింది. అంతేకాదు, 36 శాతం కంపెనీలు తాత్కాలికంగా షట్‌డౌన్‌ అయ్యే ప్రమాదం ఉందంటోంది. ఐఏటీఓ, టీఏఏఐ, ఏడీటీఓఐ, ఓటీఓఏఐ, ఏటీఓఏఐ, ఎస్‌ఐటీఈ వంటి ఏడు జాతీయ సంఘాల భాగస్వామ్యంతో విడుదల చేసిన బీఓటీటీ ‘ట్రావెల్‌ సెంటిమెంట్‌ ట్రాకర్‌’ రిపోర్టు ఈ విషయాల్ని వెల్లడించింది.

Latest Videos

2,300 మంది ప్రయాణ, పర్యాటక కంపెనీల ప్రతినిధులు, యజమానులను 10 రోజులపాటు ఆన్‌లైన్‌లో సర్వే చేసింది. ‘దేశీయ ప్రయాణ, పర్యాటక రంగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. కరోనా వ్యాప్తితో పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తిన్నది. ఈ రంగంపై ఆధారపడిన లక్షల ప్రజలు భారీ నష్టాలు, ఉద్యోగాల కోతలను చవిచూడాల్సి వచ్చింది’ అని బీవోటీటీ ‘ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్’ నివేదిక పేర్కొంది.  

81% కంపెనీల  రాబడి పూర్తిగా దెబ్బతింది. 15% కంపెనీల ఆదాయం 75 శాతం వరకు తగ్గిపోయింది. ఫలితంగా 39 శాతం సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇక మరో 38 శాతం సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని తొలగించాలని ఆలోచిస్తున్నాయి. 

also read కరోనా టైం: పట్నాల్లో, పల్లెల్లో మారుతున్న వస్తువుల కొనుగోలు ట్రెండ్..

73 శాతం కంపెనీల మేనేజ్మెంట్లు సిబ్బంది జీతాల్లో కోత విధించడం దగ్గర నుంచి వేతనాల చెల్లింపులు వాయిదా, కాంట్రాక్టులను రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక 67% కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించుకుంటున్నాయి. 

దాదాపు సగం (49%) కంపెనీలు మూలధన వ్యయాన్న వాయిదా వేస్తున్నాయి. 42 సంస్థలు కొత్త సేవలను ప్రారంభిస్తూ ప్రభుత్వం నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతున్నాయి. 

78.6% కంపెనీలు తమను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరుతుండగా,  68.2శాతం సంస్థలు ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లకు ఎయిర్‌లైన్స్‌ నుంచి టిక్కెట్ల రద్దు, అడ్వాన్సుల రిఫండ్‌ ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. 

తమ సేవలపై జీఎస్‌టీని 5 శాతం మేర తగ్గించాలని 67.7 శాతం సంస్థల యాజమాన్యాలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరాయి. ఇక తమ టర్మ్‌ రుణాల చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని 54.2% కంపెనీల మరో అభ్యర్థన.

టీడీఎస్‌ డిపాజిట్‌ ఏడాది పాటు వాయిదా వేయాలని 49.3 శాతం సంస్థలు కేంద్ర ఆర్థిక శాఖకు విన్నవించుకుంటున్నాయి. ఇది అత్యంత అసాధారణ పరిస్థితి అని, ప్రయాణ, పర్యాటక రంగంలోని వేలాది కంపెనీల మనుగడ కోసం ప్రభుత్వం ఊరట కల్పించాలని ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు జ్యోతి మాయల్ కోరారు.  
 

click me!