ఇప్పుడంతా బడ్జెట్ ఫీవర్ ఉంది. ఈ సమయంలో ఇప్పటివరకు బడ్జెట్ చుట్టూ జరిగిన కొన్ని అంశాలు చాాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని మార్పులు, మరికొన్ని సవరణలు, కొన్ని రికార్డులు.. అన్నీ కలిపిన అంశాలివి..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న లోక్‌సభలో సమర్పించనున్నారు. ఈ క్రమంలో గత యూనియన్ బడ్జెట్‌ల గురించి అంతగా తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి.
1
మొదటి బడ్జెట్
స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు.
2.
బడ్జెట్ పేపర్ల ముద్రణ
1950 వరకు బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ అంతా రాష్ట్రపతి భవన్‌లోనే జరిగేది. కానీ ఆ తరువాత బడ్జెట్ పత్రాలు లీక్ అవ్వడంతో.. ప్రింటింగ్ వేదికను న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చవలసి వచ్చింది. 1980లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి అక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతుంది.
3.
పొడవైన బడ్జెట్ ప్రసంగం
ఫిబ్రవరి 1, 2020న కేంద్ర బడ్జెట్ 2020–21ని సమర్పిస్తున్నప్పుడు నిర్మలాసీతారామన్ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇదే ఇప్పటివరకు అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంగా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు.. అంతా అయిన తరువాత చివర్లో సీతారామన్ ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నాయని.. కానీ అనారోగ్యంగా అనిపించడంతో ప్రసంగాన్ని తగ్గించాల్సి వస్తుందని.. ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. ఈ ప్రసంగంతో, ఆమె 2 గంటల 17 నిమిషాల ప్రసంగం చేయడం ద్వారా జూలై 2019 న తాను చేసిన మొదటి బడ్జెట్ రికార్డును బద్దలు కొట్టింది.
Budget 2024 : బడ్జెట్ తో మీకు నేరుగా ముడిపడిన పది అంశాలు..
4.
బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ పదాలు
పి.వి. నరసింహారావు ప్రభుత్వ హయాంలో, 1991లో 18,650 పదాలతో మన్మోహన్ సింగ్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2018లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 18,604 పదాలతో చేసిన ప్రసంగం దీని తరువాత రెండో స్థానంలో ఉంది. జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు.
5.
అతి చిన్న బడ్జెట్ ప్రసంగం
1977లో ఆర్థిక మంత్రి హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన ప్రసంగం. ఆయన తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు కేవలం 800 పదాలతో ప్రసంగాన్ని ముగించారు.
6.
ఎక్కువ బడ్జెట్ లు సమర్పించింది...
దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరారాజీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 నుండి 1969 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో 10 బడ్జెట్‌లను సమర్పించారు, తరువాత పి చిదంబరం (9), ప్రణబ్ ముఖర్జీ (8), యశ్వంత్ సిన్హా (8), మన్మోహన్ సింగ్ (6) బడ్జెట్ లతో వరుసక్రమంలో ఉన్నారు.
7.
బడ్జెట్ ప్రవేశపెట్టే టైం
1999 వరకు, బ్రిటిష్ కాలంనాటి పద్ధతి ప్రకారం ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. 1999లో మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
2017లో, అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు, ఆ నెల చివరి పనిదినాన్ని ఉపయోగించుకునే వలసపాలన కాలంనాటి సంప్రదాయాన్ని అలా మార్చారు.
8
బడ్జెట్ భాష
1955 వరకు, కేంద్ర బడ్జెట్ ఆంగ్లంలో సమర్పించబడింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్ పత్రాలను హిందీ, ఇంగ్లీష్లలో ముద్రించాలని నిర్ణయించింది.
9.
పేపర్‌లెస్ బడ్జెట్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021-22లో యూనియన్ బడ్జెట్ పేపర్‌లెస్‌గా తయారు చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటి పేపర్ లెస్ బడ్జెట్.
10.
బడ్జెట్‌ను సమర్పించిన మొదటి మహిళ
భారతదేశంలో బడ్జెట్‌ను సమర్పించిన మొదటి మహిళ ఇందిరాగాంధీ. 1971లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు, అలా మనదేశంలో బడ్జెట్‌ను సమర్పించిన మొదటి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2019లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ సీతారామన్.
ఆ సంవత్సరం, సీతారామన్ సంప్రదాయ బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను తీసివేసి, బదులుగా ప్రసంగం, ఇతర పేపర్లను తీసుకువెళ్లడానికి జాతీయ చిహ్నంతో సంప్రదాయ 'బహి-ఖాతా' ను ప్రవేశపెట్టారు.
11.
రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్‌లో విలీనం
92 ఏళ్లపాటు విడిగా సమర్పించిన రైల్వే బడ్జెట్‌ను 2017లో కేంద్ర బడ్జెట్‌లో విలీనం అయ్యింది. 2017 వరకు రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేర్వేరుగా సమర్పించబడేవి.