కోల్‌కతా సహా 6 నగరాలకు త్వరలో విద్యుత్ బస్సులు

By rajesh yFirst Published Feb 21, 2019, 4:39 PM IST
Highlights

కోల్ కతాతోపాటు ఆరు నగరాల పరిధిలో 225 విద్యుత్ వాహనాలను సరఫరా చేసేందుకు టాటా మోటార్స్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది. వచ్చే నెలాఖరు లోగా వాటిని మార్కెట్లోకి తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. పశ్చిమ బెంగాల్ రవాణ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు 80 బస్సుల్లో 20 బస్సులు పంపిణీ చేసింది. ఆయా బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం పలు ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. 

కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆరు మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో వచ్చేనెలాఖరు నాటికి 225 విద్యుత్ బస్సులను సరఫరా చేయాలని టాటా మోటార్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. దేశీయంగా ఎలక్ర్టిక్‌ బస్సుల సరఫరాపై టాటా మోటార్స్ భారీ ఆశలు పెట్టుకున్నది.  ఇండోర్, జమ్ము, అసోం, జైపూర్ సహా దేశంలోని వివిధ రవాణా సంస్థల నుంచి 255 ఈ-బస్సులకు తమకు ఆర్డర్లు వచ్చాయని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాణిజ్య వాహనాల విభాగం ప్రొడక్ట్‌ లైన్‌ అధిపతి  రోహిత్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇందులో భాగంగా బెంగాల్‌ ప్రభుత్వానికి 80 ఈ-బస్సుల సరఫరా అంశం పరిశీలనలో ఉన్నదని ఆయన చెప్పారు. ఈ నెల ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగర అవసరాల కోసం 40 విద్యుత్ బస్సులు సరఫరా చేస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. 

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రవాణా సంస్థకు సరఫరా చేయతలపెట్టిన 80 వాహనాల్లో 40 తొమ్మిది మీటర్ల పొడవు, మరో 40 బస్సులు 12 మీటర్ల బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే తొమ్మిది మీటర్ల బస్సులు 20 సరఫరా చేశామని రోహిత్ శ్రీవాత్సవ తెలిపారు. తొలుత అప్పగించిన బస్సు సర్వీసులను బుధవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జెండా ఊపి ప్రారంభించారు. మిగతా బస్సులను దశలవారీగా సరఫరా చేయనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. 

ఎలక్ర్టిక్‌ బస్సుల కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం 60 శాతం సబ్సిడీ ఇస్తున్నదని, మిగతా మొత్తాలను ఆయా రాష్ట్రప్రభుత్వాలు భరించుకోవలసి ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొన్నది. ఎలక్ర్టిక్‌ బస్సుల విభాగానికి ఈ చర్య మంచి ఉత్తేజం ఇచ్చిందంటూ బస్సుల సరఫరా కోసం తాము రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది. 
 
తమ వాణిజ్య వాహనాల విభాగం మంచి వృద్ధిని ప్రదర్శిస్తున్నదని, ప్రస్తుతం ఈ విభాగంలో తమ వాటా 45 శాతం ఉన్నదని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాణిజ్య వాహనాల విభాగం ప్రొడక్ట్‌ లైన్‌ అధిపతి రోహిత్‌ శ్రీవాత్సవ చెప్పారు. తాము ప్రస్తుతం ఇప్పటివరకు తమ అస్తిత్వం లేని విభాగాల్లో ఉత్పత్తులు తయారుచేస్తున్నామని అన్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌ ఫ్యాక్టరీలో తాము ఎలక్ర్టిక్‌ బస్సు లు ఉత్పత్తి చేస్తున్నట్టు శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుతం అక్కడ నెలకు 125 బస్సుల తయారీ సామర్థ్యం ఉన్నదని, దాన్ని 200కి పెంచేందుకు సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

విద్యుత్ వాహనాలు ఫ్యూచర్ మొబిలిటీకి సంకేతాలని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాణిజ్య వాహనాల విభాగం ప్రొడక్ట్‌ లైన్‌ అధిపతి  రోహిత్‌ శ్రీవాత్సవ చెప్పారు. ఈ - మొబిలిటీ ఎవల్యూషన్‌లో టాటా మోటార్స్ ముందు పీఠినే నిలుస్తుందన్నారు. సుస్థిర ప్రగతి సాధించడమే లక్షమన్నారు. పశ్చిమ బెంగాల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ స్వరూప్ నిగం మాట్లాడుతూ త్వరలో పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి జాదవ్ పూర్, గారియా నుంచి విమానాశ్రయం వరకు, బెహాలా లు రాజార్హట్, ఎస్పానడే నుంచి సంఘ్రగచ్చి వరకు విద్యుత్ బస్సులు తిరుగుతాయన్నారు. తద్వారా క్లీన్ ఎనర్జీ వాడకాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 


టాటా మోటార్స్ తమ బస్సుల చార్జింగ్ కోసం నొనాపుకుర్, కస్బా, న్యూటౌన్, బెల్ఘోరియాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. తొలి దశలో చార్జింగ్ టర్మినల్స్ కు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. వర్షాకాలంలో బ్రేక్ డౌన్ సమస్య తలెత్తకుండా లీయాన్ బ్యాటరీలను బస్సుపై భాగంలో అమర్చామన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటరీలోని లిక్విడ్ కూల్ అవుతూ సుదీర్ఘ కాలం సేవలందిస్తుందన్నారు. 

click me!
Last Updated Feb 21, 2019, 4:39 PM IST
click me!